సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిదిన్నరేళ్లలో రాష్ట్రంలో ఒక్క మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టునైనా పూర్తి చేశారా? చిన్న చెరువునైనా తవ్వారా? కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులు కట్టి ఒక్క ఎకరానికైనా అదనంగా నీళ్లు ఇచ్చారా?’అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. భట్టి చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర గురువారం నల్లగొండ జిల్లాలోని దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండలంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆయన నక్కలగండి ప్రాజెక్టును పరిశీలించి భూనిర్వాసితులతో మాట్లాడారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ఞం కింద మొదలుపెట్టిన ప్రాజెక్టులను బీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిచేయకుండా నల్లగొండ జిల్లాకు తీవ్ర నష్టం చేసిందని విమర్శించారు. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో జిల్లాకు అదనంగా చుక్క నీరూ ఇవ్వలేదన్నారు. ఈ విషయంపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. 2004లో సీఎం అయిన వైఎస్ జలయజ్ఞం ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి ప్రాజెక్టులకు రూపకల్పన చేశారన్నారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే 2014 నాటికి ముందే రాష్ట్రంలో 95 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. కాళేశ్వరంతో కరెంటు బిల్లు నష్టం తప్ప తెలంగాణ ప్రజలకు, రైతులకు కలిగిన ప్రయోజనం ఏమీ లేదని భట్టి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వస్తారని భట్టి ఆశాభావం వ్యక్తం చేశారు. జూపల్లి కృష్ణారావు రాక ఖరారు అయినట్లేనని పేర్కొన్నారు. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అంశాన్ని విలేకరులు ప్రస్తావించగా.. బీజేపీ నుంచి కూడా కాంగ్రెస్‌లోకి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని చెప్పారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ప్రైవేటు సైన్యంలా పోలీసులు: కేసీఆర్‌కు భట్టి బహిరంగ లేఖ
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు పోలీసులు ప్రైవేటు సైన్యంలా తయారయ్యారని, ఎమ్మెల్యేల ఆదేశాలతో పోలీసులు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ప్రజలు భయంతో బతకాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. తాను 84 రోజులుగా చేస్తున్న పాదయాత్రలో ఈ పరిస్థితులను గ్రహించానని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థను ప్రజల కోసమే ఉపయోగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖను నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని నక్కలగండి ప్రాజెక్టు పాదయాత్ర శిబిరం వద్ద భట్టి విడుదల చేశారు.
ప్రజలు నా దృష్టికి తెచ్చారు..
‘మార్చి 16న చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర పురస్కరించుకుని వందల గ్రామాల్లో కాలినడకన తిరిగిన సందర్భంగా.. పోలీసులు తమను వేధింపులు, ఇబ్బందులకు గురి చేయడాన్ని వందలాది మంది ప్రజలు నా దృష్టికి తీసుకువచ్చారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజల రక్షణ కోసం ఏర్పాటు చేసిన పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల ఆదేశాలను అమలు చేస్తోంది. డీజీపీ, ఐజీ, డీఐజీ, ఎస్పీ లాంటి ఉన్నతాధికారులు చెప్పినట్లుగా కాకుండా ఎమ్మెల్యేల ఆదేశాలు అమలు చేసే పోలీసులుగా మారిపోయారు.
వారు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కోల్పోయారు..
సమాజంలో అనేక వర్గాల ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడే హక్కును కోల్పోయారు. కవులు, కళాకారు లు, మేధావులు, జర్నలిస్టులు, ప్రజాస్వామికవాదు లు, ప్రగతిశీల వాదులు, రాజకీయ పార్టీలు స్వేచ్ఛ గా భావజాలాన్ని వ్యాప్తి చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఏ ఆత్మగౌరవం కోసం, ఏ హక్కుల కోసం పోరాడామో అవి సాధించుకున్న స్వరాష్ట్రంలో మరింతగా లేకుండా పోయాయి. ప్ర జాస్వామ్యంలో ఆయా రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ వ్యవస్థలు మాత్రం శా శ్వతంగా ఉంటాయి. పోలీసు వ్యవస్థను ప్రజల రక్షణ కోసం ఉపయోగించాలి తప్ప రాజకీయ పార్టీ ల కోసం కాదు..’అని భట్టి లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment