pongulegi srinivasa reddy
-
TS: బీఆర్ఎస్కు కోనప్ప గుడ్‌బై..! మంత్రి పొంగులేటితో కీలక భేటీ
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బుధవారం ఉదయం తెలంగాణ సెక్రటేరియట్లో రాష్ట్ర రెవెన్యూ,సమాచార మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చాంబర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడున్న మీడియా ప్రతినిధులతో ఆయన ముచ్చటించారు. కార్యకర్తలతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తుపెట్టుకుంటున్నట్లు మంగళవారం రెండు పార్టీల అధ్యక్షులు ప్రెస్మీట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. బీఎస్పీతో పొత్తు విషయంలో అసంతృప్తికి గురైన కోనప్ప బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలోనే కోనప్ప సచివాలయానికి వచ్చి సీఎం రేవంత్ మంత్రి వర్గంలో కీలక మంత్రిగా పేరున్న పొంగులేటితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సిర్పూర్ నుంచి కోనప్పపై పోటీ చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు కొనసాగితే తన రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదం అని భావించిన కోనప్ప పార్టీ మార్పు దిశగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ కోనప్ప, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మధ్య ఉంటుందని అందరూ భావించినప్పటికీ సిర్పూర్ నుంచి అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ఇదీ చదవండి.. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల ధర్నా -
జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ‘పొంగులేటి’!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన శ్రీనివాస్‌రెడ్డి.. ఈ ప్రభుత్వంలో రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, మంత్రివర్గ కూర్పు పూర్తయిన కొద్ది రోజులకే సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాలకు ఇన్చార్జ్ మంత్రులను నియమించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌కు ఇన్చార్జ్ మంత్రులుగా బాధ్యతలు అప్పగించారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు జనగామ, వరంగల్, హనుమకొండ జిల్లాలకు, సత్యవతిరాథోడ్ మహబూబాబాద్, ములుగు, జేఎస్ భూపాలపల్లి జిల్లాలకు ఇన్చార్జ్ మంత్రిగా వ్యవహరించారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం ఉమ్మడి జిల్లాకు ఒకే మంత్రిని.. అది ఇతర జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని నియమించింది. గతంలోనూ(రాష్ట్ర విభజనకు ముందు) కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాంరెడ్డి వెంకట్‌రెడ్డిని జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా కొనసాగించింది. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గురించి.. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకత కలిగిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి .. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ నుంచి ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. పాలేరు ఎమ్మె ల్యే, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి 2016లో మృతి చెందారు. అదే సంవత్సరం పొంగులేటి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మృతితో వచ్చిన ఉపఎన్నికల్లో తుమ్మల నాగేశ్వర్రావు బీఆర్ఎస్ నుంచి గెలుపొందాడు. తుమ్మల గెలుపులో శ్రీనివాస్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారు. అయితే 2019 వరకు పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగిన తనకే తర్వాత ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తిరిగి ఖమ్మం ఎంపీ టికెట్ ఇస్తారని ఆశించగా.. నామా నాగేశ్వర్రావుకు కేటాయించడం పొంగులేటిని అసంతృప్తికి గురిచేసింది. పార్టీ నేతల జోక్యంతో ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేసిన శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత జరిగిన పరిణామాలతో పార్టీలో ఇమడ లేక పోయారు. ఈ ఏడాది జనవరి 2 నుంచి పార్టీకి అంటీముట్టనట్లుగా ఉన్న శ్రీనివాస్‌రెడ్డి జూలై 2న కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో పాలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో కీలకమైన రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖలు నిర్వహిస్తున్న ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా నియమితులయ్యారు. కాగా తాజాగా నియామకమైన జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఏసీడీపీ తదితర నిధుల వినియోగం, ఎమ్మెల్యే, ముఖ్యనేతలను సమన్వయం చేయడంలో కీలకంగా వ్యవహరించడంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ కార్యక్రమాలను, పథకాల అమలును పర్యవేక్షిస్తారు. ఇవి కూడా చదవండి: ఉమ్మడి జిల్లా ఇన్చార్జిగా మంత్రి సీతక్క! -
పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ ముందస్తు కార్యాచరణ!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: 'పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఇటీవల రాష్ట్రంలో విజయం సాధించిన పార్టీ.. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనూ రాష్ట్రంలోని 17 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా మంత్రులు, ముఖ్య నేతలు సమన్వయంతో ముందుకు వెళ్లేలా కార్యాచరణ రూపొందించింది. ఈ నేపథ్యాన అన్ని స్థానాలకు పార్టీ ఇన్చార్జిలను నియమించింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాల బాధ్యతను రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పగించింది. అలాగే డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కను సికింద్రాబాద్, హైదరాబాద్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. సీఎం రేవంత్‌రెడ్డి తర్వాత జిల్లాకు చెందిన భట్టి, పొంగులేటికి రెండేసి పార్లమెంట్ స్థానాల బాధ్యతలు కట్టబెట్టడం విశేషం.' రాజకీయంగా సీనియర్ నాయకులు, మంత్రులైన భట్టి, తుమ్మలకు పార్టీ అధిష్టానం ప్రాధాన్యత ఇచ్చి రాజధానిలోని పార్లమెంట్ స్థానాల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించింది. సామాజిక సమీకరణలు, గతంలో పనిచేసిన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని భట్టిని సికింద్రాబాద్, హైదరాబాద్, తమ్మలను మల్కాజ్గిరి ఇన్చార్జిగా నియమించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భట్టి హైదరాబాద్‌లో ప్రచారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన నేపథ్యాన జోష్‌లో ఉన్న పార్టీ శ్రేణులు అదే ఉత్సాహంతో లోక్‌సభ ఎన్నికలకు సై అంటున్నాయి. పొంగులేటికి కీలకంగా.. ఖమ్మం పార్లమెంట్ స్థానం ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో విస్తరించి ఉండగా, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో ఇక్కడి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దీంతో ఈ రెండు స్థానాల ఇన్చార్జిగా మంత్రి పొంగులేటి కొనసాగుతారు. అసెంబ్లీ ఎన్నికల్లో పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాకుండా మహబాబాబాద్, వనపర్తి, నల్లగొండ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఆయన ప్రచారానికి వెళ్లిన అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే తమ లక్ష్యమని చెప్పగా.. భద్రాచలం మినహా ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్, పొత్తులో భాగంగా కొత్తగూడెంలో సీపీఐ విజయం సాధించాయి. ఈ మేరకు భట్టి, తుమ్మలతో సమన్వయం చేసుకుంటూ పార్టీ అభ్యర్థుల విజయంలో కీలక పాత్ర పోషించిన పొంగులేటిని అధిష్టానం ప్రత్యేకంగా గుర్తించినట్లు రెండు పార్లమెంట్ స్థానాల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడంతో స్పష్టమవుతోంది. ఈ రెండింటి పరిధిలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, భద్రాచలంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తుతో కొత్తగూడెం స్థానాన్ని సీపీఐ దక్కించుకోగా.. మిగిలిన 12 స్థానాల్లో కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. దీంతో రెండు పార్లమెంట్ స్థానాల పరిధిలో పొంగులేటికి ఉన్న పరిచయాలు, పార్టీ కేడర్, కుటుంబ బంధుత్వం లోక్‌సభ ఎన్నికల్లోనూ అభ్యర్థుల విజయానికి కలిసొస్తుందన్న భావనతో ఆయనకు ఈ బాధ్యతలు ఇచ్చినట్లు పార్టీ నేతల ద్వారా తెలిసింది. కాగా, ఖమ్మం లోక్‌సభ స్థానం పరిధిలో ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాలు, మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో మహబాబాబాద్, డోర్నకల్, నర్సంపేట, ములుగు, పినపాక, ఇల్లెందు, భద్రాచలం అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇవి కూడా చదవండి: ‘పార్లమెంట్’పై కాంగ్రెస్ 0గురి! ఆ స్థానాలకు పోటాపోటీగా.. -
ఏఐసీసీ కార్యాలయంలో పొంగులేటి, జూపల్లి..!
-
టీ కాంగ్రెస్‌లో ఘర్ వాపసి జరుగుతోంది: రాహుల్ గాంధీ
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పొంగులేటి శ్రీనివాస్ , జూపల్లి కృష్ణారావు భేటీ ముగిసింది. వీరిద్దరితోపాటు ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు గుర్నాథ్ రెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సిరెడ్డి, ముఖ్య నాయకులు పిడమర్తి రవి, కూచుకుల్ల రాజేష్ రెడ్డి కూడా ఉన్నారు. ఏఐసీసీ కార్యాలయంలో అరగంటకు పైగా సమావేశం సాగింది. ఈ సందర్భంగా జూలై 2న ఖమ్మం సభకు రావాలని రాహుల్‌ను పొంగులేటి, జూపల్లి కోరారు. అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. టీ కాంగ్రెస్‌లో ఘర్ వాపసి జరుగుతోందని.. నేతలంతా తిరిగి కాంగ్రెస్‌లోకి రావడం ఆనందంగా ఉందన్నారు. కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కాగా తెలంగాణలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. రాజకీయ పార్టీల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాగా, సీనియర్ నేతలు పొంగులేటి శ్రీనివాస్, జూపల్లి కృష్ణారావు నేడు(సోమవారం) రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరునున్నారు. ఇందులో భాగంగానే వీరు ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. ఇక, ఢిల్లీలో ఉన్న వీరిద్దరూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పొంగులేటి, జూపల్లి ఉన్నట్టు సమాచారం. అనంతరం, మధ్యాహ్నం రెండు గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో రాహుల్ గాంధీతో వీరు సమావేశం కానున్నారు. పొంగులేటి, జూపల్లితో పాటు అరికెల నర్సారెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి సహా పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరనున్నారు. వీరంతా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో కూడా సమావేశం కానున్నారు. మరోవైపు.. కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఢిల్లికి పయనమయ్యారు. ఈ సందర్బంగా మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. పొంగులేటిని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే కాంగ్రెస్‌లో చేరడం లేదు. ప్రజల అభిప్రాయం మేరకే కాంగ్రెస్‌లో చేరుతున్నారు. వారు మధ్యాహ్నం రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరుతారు అని తెలిపారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ బిగ్ ప్లాన్.. 500 వాహనాల కాన్వాయ్‌తో కేసీఆర్.. -
కాంగ్రెస్‌లోకే పొంగులేటి, జూపల్లి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిదిన్నరేళ్లలో రాష్ట్రంలో ఒక్క మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టునైనా పూర్తి చేశారా? చిన్న చెరువునైనా తవ్వారా? కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులు కట్టి ఒక్క ఎకరానికైనా అదనంగా నీళ్లు ఇచ్చారా?’అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. భట్టి చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర గురువారం నల్లగొండ జిల్లాలోని దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండలంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆయన నక్కలగండి ప్రాజెక్టును పరిశీలించి భూనిర్వాసితులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ఞం కింద మొదలుపెట్టిన ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిచేయకుండా నల్లగొండ జిల్లాకు తీవ్ర నష్టం చేసిందని విమర్శించారు. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో జిల్లాకు అదనంగా చుక్క నీరూ ఇవ్వలేదన్నారు. ఈ విషయంపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. 2004లో సీఎం అయిన వైఎస్ జలయజ్ఞం ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి ప్రాజెక్టులకు రూపకల్పన చేశారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే 2014 నాటికి ముందే రాష్ట్రంలో 95 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. కాళేశ్వరంతో కరెంటు బిల్లు నష్టం తప్ప తెలంగాణ ప్రజలకు, రైతులకు కలిగిన ప్రయోజనం ఏమీ లేదని భట్టి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వస్తారని భట్టి ఆశాభావం వ్యక్తం చేశారు. జూపల్లి కృష్ణారావు రాక ఖరారు అయినట్లేనని పేర్కొన్నారు. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అంశాన్ని విలేకరులు ప్రస్తావించగా.. బీజేపీ నుంచి కూడా కాంగ్రెస్‌లోకి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రైవేటు సైన్యంలా పోలీసులు: కేసీఆర్‌కు భట్టి బహిరంగ లేఖ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పోలీసులు ప్రైవేటు సైన్యంలా తయారయ్యారని, ఎమ్మెల్యేల ఆదేశాలతో పోలీసులు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ప్రజలు భయంతో బతకాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. తాను 84 రోజులుగా చేస్తున్న పాదయాత్రలో ఈ పరిస్థితులను గ్రహించానని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థను ప్రజల కోసమే ఉపయోగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖను నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని నక్కలగండి ప్రాజెక్టు పాదయాత్ర శిబిరం వద్ద భట్టి విడుదల చేశారు. ప్రజలు నా దృష్టికి తెచ్చారు.. ‘మార్చి 16న చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర పురస్కరించుకుని వందల గ్రామాల్లో కాలినడకన తిరిగిన సందర్భంగా.. పోలీసులు తమను వేధింపులు, ఇబ్బందులకు గురి చేయడాన్ని వందలాది మంది ప్రజలు నా దృష్టికి తీసుకువచ్చారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజల రక్షణ కోసం ఏర్పాటు చేసిన పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల ఆదేశాలను అమలు చేస్తోంది. డీజీపీ, ఐజీ, డీఐజీ, ఎస్పీ లాంటి ఉన్నతాధికారులు చెప్పినట్లుగా కాకుండా ఎమ్మెల్యేల ఆదేశాలు అమలు చేసే పోలీసులుగా మారిపోయారు. వారు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కోల్పోయారు.. సమాజంలో అనేక వర్గాల ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడే హక్కును కోల్పోయారు. కవులు, కళాకారు లు, మేధావులు, జర్నలిస్టులు, ప్రజాస్వామికవాదు లు, ప్రగతిశీల వాదులు, రాజకీయ పార్టీలు స్వేచ్ఛ గా భావజాలాన్ని వ్యాప్తి చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఏ ఆత్మగౌరవం కోసం, ఏ హక్కుల కోసం పోరాడామో అవి సాధించుకున్న స్వరాష్ట్రంలో మరింతగా లేకుండా పోయాయి. ప్ర జాస్వామ్యంలో ఆయా రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ వ్యవస్థలు మాత్రం శా శ్వతంగా ఉంటాయి. పోలీసు వ్యవస్థను ప్రజల రక్షణ కోసం ఉపయోగించాలి తప్ప రాజకీయ పార్టీ ల కోసం కాదు..’అని భట్టి లేఖలో పేర్కొన్నారు. -
ఢిల్లీ చేరుకున్న రాజీవ్‌జ్యోతి సద్భావన యాత్ర
సాక్షి, న్యూఢిల్లీ: దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఉగ్రవాదానికి, మతోన్మాదానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏటా నిర్వహిస్తున్న రాజీవ్ జ్యోతి సద్భావన యాత్ర ఢిల్లీ చేరుకుంది. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో చెన్నైలోని పెరంబుదూర్ నుంచి ఆగస్టు 9న చేపట్టిన ఈ యాత్రలో పలు రాష్ట్రాల పీసీసీ నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వారికి ఆహ్వానం పలికి జ్యోతి అందుకున్నారు. యాత్రలో పాల్గొన్న నేతలు పార్లమెంటు వద్ద ఉన్న రాజీవ్ విగ్రహానికి నివాళులర్పించి పాలాభి షేకం చేశారు. సోమవారం రాజీవ్ జయంతి సందర్భంగా సద్భావన యాత్ర జ్యోతిని వీర్‌భూమి వద్ద ఉంచుతామని చెప్పారు. -
గుజరాత్లో నైతికంగా ఓడిన బీజేపీ
సాక్షి, హైదరాబాద్: ఫిరాయింపులు, అబద్ధాలతో దిగజారుడు పద్ధతుల ద్వారా గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ నైతికంగా ఓడిపోయిందని కాంగ్రెస్‌పార్టీ నేత, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ గుజరాత్ ఎన్నికల్లో ఒక్క రాహుల్ గాంధీని ఎదుర్కోవడానికి ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులంతా కలిపి 182 మంది వరకు కష్టపడ్డారని అన్నారు. ప్రధాని మోదీ తనను హత్య చేయడానికి కుట్ర జరిగిందంటూ మాట్లాడటం ద్వారా ప్రధాని పదవికే మచ్చ తెచ్చారని విమర్శించారు. ప్రధాని హత్యకు కుట్ర జరిగి ఉంటే కారకులపై కేసులు పెట్టాలని, పాకిస్తాన్‌పై యుద్ధం ప్రకటించాలని సవాల్ చేశారు. ఇవేమీ చేయకుండా కేవలం ప్రచారానికే ఈ అంశాన్ని ఎందుకు వాడుకున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కులం, మతం పేరునే కాకుండా పాకిస్తాన్ పేరును కూడా మోదీ వాడుకుని, దేశ ప్రతిష్టను ప్రపంచ దేశాల ముందు దిగజార్చారని ఆరోపించారు. రాహుల్‌కు భయపడుతున్న మోదీ సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎందుకు భయపడుతున్నారో అర్థంకావడం లేదని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాని స్థాయిలో ఉన్న మోదీ తన హత్యకు కుట్ర జరిగిందంటూ మాట్లాడటమే ఆయన భయపడుతున్నారనడానికి నిదర్శనమన్నారు. గుజరాత్ ఎన్నికల్లో అడ్డదారులు తొక్కి గెలిచిన బీజేపీ ఏదో సాధించినట్టుగా గొప్పలు చెప్పు కోవడం హాస్యాస్పదమన్నారు. రాహుల్‌గాంధీ పరిణతి చెందిన నాయకుడిగా బీజేపీ నేతలే ఒప్పుకుంటున్నారన్నారు. విభజన చట్టంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన హక్కులు, నిధులను అడగడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారని పొంగులేటి ఆరోపించారు. గెలుపు కోసం దిగజారిన మోదీ: సురవరం సాక్షి, హైదరాబాద్: గుజరాత్ ఎన్నికల్లో గెలవడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిగజారి వ్యవహరించారని సీపీఐ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ దేశ ప్రధానిగా అభివృద్ధి గురించి మాట్లాడకుండా కులం, మతం, చివరకు పాకిస్తాన్ పేరును కూడా వాడుకుని ఓటర్లను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారని అన్నారు. గుజరాత్లో గతంతో పోలిస్తే బీజేపీకి సీట్లు, ఓట్లు తగ్గాయన్నారు. కాగా, జనవరి 8, 9 తేదీల్లో విజయవాడలో సీపీఐ జాతీయ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆరే గిరిజనుల మధ్య చిచ్చుకు కారణమని ఆరోపించారు. గిరిజన తెగల మధ్య తలెత్తిన సమస్యపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. -
సర్కారు నిర్లక్ష్యంతోనే రైతుల ఆత్మహత్యలు: పొంగులేటి
తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలంగాణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వరంగల్ జిల్లాలో పార్టీ నాయకురాలు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల రెండో విడత పరామర్శ యాత్ర ముగిసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రుణమాఫీని ఒకేసారి కాకుండా విడతల వారీగా చేయడమే ఆత్మహత్యలకు కారణమన్నారు. ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావని, రైతులు అధైర్యపడొద్దని ఆయన చెప్పారు. రైతులకు అండగా వైఎస్ఆర్సీపీ ఉందని, రాజన్న రాజ్యం మళ్లీ వస్తోందని తెలిపారు. రైతులకు ధైర్యం చెప్పేందుకు వైఎస్ఆర్సీపీ ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. ఇక మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి లేరనే వార్తను తట్టుకోలేక అత్యధికులు వరంగల్ జిల్లాలోనే చనిపోయినట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. పరామర్శ యాత్రలో ఉండేందుకు ఆరు అడుగుల ఇళ్లు కూడా లేనివారిని షర్మిల చూశారని ఆయన తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉంటే పక్కాగృహాలు వచ్చేవని పేదప్రజలు అభిప్రాయపడుతున్నారన్నారు. వైఎస్ఆర్ అన్నదాతలకు కూడా అండగా నిలిచారని, ఆనాడు రైతు ఆత్మహత్యలు చాలా తక్కువగా ఉండేవని ఆయన అన్నారు.