
సాక్షి, హైదరాబాద్: ఫిరాయింపులు, అబద్ధాలతో దిగజారుడు పద్ధతుల ద్వారా గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ నైతికంగా ఓడిపోయిందని కాంగ్రెస్‌పార్టీ నేత, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ గుజరాత్ ఎన్నికల్లో ఒక్క రాహుల్ గాంధీని ఎదుర్కోవడానికి ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులంతా కలిపి 182 మంది వరకు కష్టపడ్డారని అన్నారు. ప్రధాని మోదీ తనను హత్య చేయడానికి కుట్ర జరిగిందంటూ మాట్లాడటం ద్వారా ప్రధాని పదవికే మచ్చ తెచ్చారని విమర్శించారు. ప్రధాని హత్యకు కుట్ర జరిగి ఉంటే కారకులపై కేసులు పెట్టాలని, పాకిస్తాన్‌పై యుద్ధం ప్రకటించాలని సవాల్ చేశారు. ఇవేమీ చేయకుండా కేవలం ప్రచారానికే ఈ అంశాన్ని ఎందుకు వాడుకున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కులం, మతం పేరునే కాకుండా పాకిస్తాన్ పేరును కూడా మోదీ వాడుకుని, దేశ ప్రతిష్టను ప్రపంచ దేశాల ముందు దిగజార్చారని ఆరోపించారు.
రాహుల్‌కు భయపడుతున్న మోదీ
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎందుకు భయపడుతున్నారో అర్థంకావడం లేదని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాని స్థాయిలో ఉన్న మోదీ తన హత్యకు కుట్ర జరిగిందంటూ మాట్లాడటమే ఆయన భయపడుతున్నారనడానికి నిదర్శనమన్నారు. గుజరాత్ ఎన్నికల్లో అడ్డదారులు తొక్కి గెలిచిన బీజేపీ ఏదో సాధించినట్టుగా గొప్పలు చెప్పు కోవడం హాస్యాస్పదమన్నారు. రాహుల్‌గాంధీ పరిణతి చెందిన నాయకుడిగా బీజేపీ నేతలే ఒప్పుకుంటున్నారన్నారు. విభజన చట్టంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన హక్కులు, నిధులను అడగడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారని పొంగులేటి ఆరోపించారు.
గెలుపు కోసం దిగజారిన మోదీ: సురవరం
సాక్షి, హైదరాబాద్: గుజరాత్ ఎన్నికల్లో గెలవడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిగజారి వ్యవహరించారని సీపీఐ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ దేశ ప్రధానిగా అభివృద్ధి గురించి మాట్లాడకుండా కులం, మతం, చివరకు పాకిస్తాన్ పేరును కూడా వాడుకుని ఓటర్లను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారని అన్నారు. గుజరాత్‌లో గతంతో పోలిస్తే బీజేపీకి సీట్లు, ఓట్లు తగ్గాయన్నారు. కాగా, జనవరి 8, 9 తేదీల్లో విజయవాడలో సీపీఐ జాతీయ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆరే గిరిజనుల మధ్య చిచ్చుకు కారణమని ఆరోపించారు. గిరిజన తెగల మధ్య తలెత్తిన సమస్యపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment