తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలంగాణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వరంగల్ జిల్లాలో పార్టీ నాయకురాలు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల రెండో విడత పరామర్శ యాత్ర ముగిసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రుణమాఫీని ఒకేసారి కాకుండా విడతల వారీగా చేయడమే ఆత్మహత్యలకు కారణమన్నారు. ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావని, రైతులు అధైర్యపడొద్దని ఆయన చెప్పారు. రైతులకు అండగా వైఎస్ఆర్సీపీ ఉందని, రాజన్న రాజ్యం మళ్లీ వస్తోందని తెలిపారు. రైతులకు ధైర్యం చెప్పేందుకు వైఎస్ఆర్సీపీ ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు.
ఇక మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి లేరనే వార్తను తట్టుకోలేక అత్యధికులు వరంగల్ జిల్లాలోనే చనిపోయినట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. పరామర్శ యాత్రలో ఉండేందుకు ఆరు అడుగుల ఇళ్లు కూడా లేనివారిని షర్మిల చూశారని ఆయన తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉంటే పక్కాగృహాలు వచ్చేవని పేదప్రజలు అభిప్రాయపడుతున్నారన్నారు. వైఎస్ఆర్ అన్నదాతలకు కూడా అండగా నిలిచారని, ఆనాడు రైతు ఆత్మహత్యలు చాలా తక్కువగా ఉండేవని ఆయన అన్నారు.
సర్కారు నిర్లక్ష్యంతోనే రైతుల ఆత్మహత్యలు: పొంగులేటి
Published Fri, Sep 11 2015 2:50 PM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM
Advertisement