మాట్లాడుతున్న కేఏ పాల్, జేడీ లక్ష్మీనారాయణ
సాక్షి, విశాఖపట్నం: తెలంగాణ రాష్ట్రాన్ని, అక్కడ ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల్ని కాపాడలేని కేసీఆర్ విశాఖ ఉక్కుని కాపాడతాననడం హాస్యాస్పదమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ఎద్దేవా చేశారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో కలిసి పాల్ బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. దళితుల పట్ల కేసీఆర్‌కు కనీస ప్రేమ లేదని, అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినంత మాత్రాన ఆయన్ని ఎవరూ నమ్మరని పాల్ అన్నారు.
ప్రధాని కావాలన్న కాంక్షతో దోచుకున్న సొమ్ముని కేసీఆర్ పంచుతున్నారన్నారు. కేసీఆర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు రూ.1,000 కోట్లు, తోట చంద్రశేఖర్‌కు రూ.100 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. కేసీఆర్‌ని ప్రధానిని చేస్తే విభజన సమయంలో ఏపీలో దోచుకున్న రూ.లక్షల కోట్లు పంచేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని, ప్లాంట్‌ని అమ్ముతామంటే.. వారు అడిగిన దానికి ఐదింతలు అమెరికా ఫండ్ తెచ్చి మరీ కొంటామనీ, అది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మాలని అన్నారు.
టెస్లా అధినేత ఎలెన్‌మస్క్ కూడా స్టీల్‌ప్లాంట్‌కు విరాళాలిచ్చేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ 99 శాతం జరిగిపోయిందని, కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నాటకాలాడుతోందని అన్నారు. 14 సంవత్సరాలు సీఎంగా ఉండి ఉద్యోగాలివ్వని చంద్రబాబు ఇప్పుడు మళ్లీ బాబు వస్తే జాబు అని చెబుతున్న మాటల్ని ఎవరూ విశ్వసించి ఓటు వేయరన్నారు.
కొడుకుని సీఎం చేసేందుకు ఎన్నారైల వద్ద రూ.50 కోట్లు చొప్పున చంద్రబాబు దండుకుంటున్నారని పాల్ ఆరోపించారు. వైఎస్ జగన్ సీఎం కాక ముందు దోచుకున్నారని కేసులు పెట్టిన సీబీఐ.. సీఎంగా ఉండగా రూ.లక్షల కోట్లు దోచుకున్న చంద్రబాబుని ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా రోడ్‌మ్యాప్ కోసం బీజేపీ చుట్టూ తిరగడాన్ని పవన్ ఆపేసి జనసేన పార్టీని ప్రజాశాంతిలో విలీనం చేయాలని చెప్పారు.
చదవండి: మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ప్రస్తుతం విశాఖ ఉక్కులో 300 మెట్రిక్ టన్నుల స్టీల్ డిమాండ్ ఉందన్నారు. ఇంకా 8 వేల మంది నిర్వాసితులకు న్యాయం జరగాల్సి ఉందని చెప్పారు. వాటన్నింటినీ పరిష్కరించకుండా కేంద్రం తొండాట ఆడుతోందని విమర్శించారు. స్టీల్‌ప్లాంట్ ప్రభుత్వ రంగ కంపెనీగానే ఉండాలని, విశాఖ ఉక్కుని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరితో కలిసి పోరాటం చేస్తానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment