
బీజేపీలో ఎంపీ టికెట్ల కేటాయింపులో బయటివారికి ప్రాధాన్యతపై నిరసనలు
కొందరు నేతలు పార్టీని వీడొచ్చునంటూ ప్రచారం
బీజేపీ నేతలపై కేసులు పెట్టించిన సైదిరెడ్డికి నల్లగొండ టికెటా?
వరంగల్ జిల్లాలో పార్టీ కేడర్‌ను ఇబ్బందిపెట్టిన అరూరి రమేశ్‌తో సంప్రదింపులా?
బంగారు శ్రుతి, మనోహర్‌రెడ్డి వంటివారికి భువనగిరి, నల్లగొండ సీట్లు ఇవ్వలేరా? అనే ప్రశ్నలు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ అభ్యర్థులుగా బయటివారికి ప్రాధాన్యమివ్వడంపై బీజేపీలో ఇంకా అసంతృప్త స్వరాలు తగ్గడం లేదు. ఇప్పటివరకు 15 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించగా.. అందులో ఏడుగురు ఇటీవలే చేరినవారికి (ఒకరు పార్టీలో కూడా చేరకున్నా) టికెట్లు ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.
రిజర్వ్‌డ్ సీట్లను (మూడు ఎస్సీ, రెండు ఎస్టీ సీట్లు) పార్టీలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారికి కాకుండా ‘వలస’ నేతలకే ఇవ్వడం ఏమిటని (ఇంకా వరంగల్ ఎస్సీ సీటు ఖరారు కాలేదు) ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో తమకు టికెట్ దక్కని కొందరు నేతలు అసంతృప్తితో పార్టీ మారొచ్చంటూ ప్రచారం జరుగుతోంది.
మహబూబ్‌నగర్ సీటును పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు కేటాయించడంతో.. ఆ స్థానాన్ని ఆశించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి నిరుత్సాహానికి గురయ్యారు. దీనికితోడు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఇతర నేతలు గురువారం జితేందర్‌రెడ్డి నివాసానికి వెళ్లి భేటీకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. జితేందర్‌రెడ్డి పార్టీ మారుతారంటూ ప్రచారం సాగింది. అయితే ప్రస్తుతం తాను బీజేపీలోనే ఉన్నానని, పార్టీ మారే ఉద్దేశమేదీ లేదని ఆయన ప్రకటించారు.
వేధించిన వారికి టికెట్లా?
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ గుర్రంపోడు ఎస్టీల భూముల పోరు అంశంలో బీజేపీ నాయకులపై అప్పటి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కేసులుపెట్టి జైలుకు పంపారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. పార్టీ శ్రేణులను వేధించిన వ్యక్తిని బీజేపీలో చేర్చుకుని నల్లగొండ ఎంపీ టికెట్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. గతంలో మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోసం టికెట్ త్యాగం చేసి, తర్వాత చేరిన మరో కాంగ్రెస్ నేతకు అసెంబ్లీ టికెట్ ఇచ్చినా సహకరించిన పార్టీ నేత జి.మనోహర్‌రెడ్డికి నల్లగొండ ఎంపీ సీటు ఎందుకు ఇవ్వలేకపోయారని నిలదీస్తున్నాయి.
ఇక నాగర్‌కర్నూల్ ఎంపీ సీటును బీఆర్‌ఎస్ ఎంపీ కుమారుడికి ఇచ్చి.. పార్టీ మాజీ జాతీయాధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కుమార్తె బంగారు శ్రుతికి మొండిచెయ్యి చూపడం ఎంతవరకు సబబు అని బీజేపీ అసంతృప్త నేతలు ప్రశ్నిస్తున్నారు. 20ఏళ్లకుపైగా పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్న పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్‌ను కాదని కాంగ్రెస్ నుంచి వచ్చిన శ్రీనివాస్‌కు పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇవ్వడం సరికాదని అంటున్నారు.
వరంగల్ జిల్లాలో పార్టీ కేడర్‌పై కేసులకు కారణమైన అప్పటి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌కు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తాం, పార్టీలోకి రావాలంటూ పిలవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. అరూరి రమేశ్‌ను పార్టీలోకి తీసుకోవద్దని, వరంగల్ ఎంపీ సీటు ఇవ్వొద్దని గురువారం రాష్ట్ర నాయకత్వానికి మాజీ మంత్రి జి.విజయరామారావు, మాజీ ఎమ్మెల్యే జైపాల్, ఇతర ఎస్సీ వర్గ నాయకులు విజ్ఞప్తి చేశారు.
ఇదే డిమాండ్‌తో వరంగల్ జిల్లా నేతలు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆందోళన కూడా చేశారు. ఇలా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ఎంపీ టికెట్లు ఇవ్వడంపై.. ఆశావహులు, ఇతర నేతలు పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నించినట్టు తెలిసింది. అయితే టికెట్ల కేటాయింపులో తమ ప్రమేయం పెద్దగా లేదని, జాతీయ నాయకత్వమే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తోందని ముఖ్య నేతలు బదులిస్తున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment