అభివాదం చేస్తున్న నాయకులు ఆర్.కృష్ణయ్య, మందకృష్ణ, రేణుక యాదవ్ తదితరులు
హిమాయత్‌నగర్ (హైదరాబాద్): రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీకి రోజులు దగ్గరపడ్డాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య, ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు. సూర్యాపేట వేదికగా ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్యపై మంత్రి జగదీశ్‌రెడ్డి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుంటే సీఎం కేసీఆర్ పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
వట్టె జానయ్యపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పలు సంఘాల నాయకుల ఆధ్వర్యంలో జానయ్య సతీమణి రేణుక యాదవ్‌తో కలసి హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్‌లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ..బీసీ వర్గానికి చెందిన వట్టె జానయ్య సూర్యాపేటలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించిన మరుసటి రోజు నుంచి వారం రోజుల వ్యవధిలో ఆ వ్యక్తిపై 90 కేసులు పెట్టడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వట్టె జానయ్యపై పెట్టిన అక్రమ కేసులను తక్షణం ఎత్తివేయకుంటే సూర్యాపేటలో రెండు లక్షల మందితో బహిరంగ సభను నిర్వహించి బీఆర్‌ఎస్‌కు వణుకుపుట్టిస్తామని మందకృష్ణ హెచ్చరించారు. ప్రతి సందర్భంలో తమను కాళ్లకు మొక్కేలా జగదీశ్‌రెడ్డి ప్రవర్తించారంటూ రేణుక యాదవ్ ఆరోపించారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం అంతరించిపోయిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు ఆరోపించారు. జానయ్య సోదరుడు కృష్ణయాదవ్, పలు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment