సాక్షి, ఢిల్లీ: పార్టీలో ఏ నాయకులు ఏం చేస్తున్నారో అంతా తెలుసు.. ఇప్పటివరకూ ఎవరెవరు పార్టీ కోసం ఏం చేశారో, ఇప్పుడు ఏం చేస్తున్నారో తన దగ్గర సమాచారం ఉందని తెలంగాణ కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశంలో రాహుల్ గాంధీ అన్నట్లు తెలిసింది. విబేధాల పేరుతో నోటికొచ్చినట్లు బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తే అధిష్టానం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలంగాణ కాంగ్రెస్ నేతలను రాహుల్ హెచ్చరించారు.
పార్టీ కోసం అన్ని స్థాయిల్లోని నేతలు కలిసికట్టుగా, ఐక్యంగా పనిచేయాల్సిందేనని కర్ణాటక ఎన్నికల వ్యూహంలో అనుసరించిన విధానాన్ని సమావేశంలో ఆయన వివరించారు టీపీసీసీ నేతల సూచనలు, సలహాలు విన్న రాహుల్.. నాయకులంతా ఏకతాటిపై నడవాలని కోరారు. కేసీఆర్‌ను ఓడించేందుకు నేతలందరూ విబేధాలు, చిన్న చిన్న గొడవలు పక్కన పెట్టాలని సూచించారు.
ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహ రచన సమావేశం మూడు గంటల పాటు సుదీర్ఘగా సాగింది. కాగా భారీ చేరికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ సంతరించుకుంది. ఈ భేటీలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిలతో పాటు ఉత్తమ్, కోమటిరెడ్డి, జానారెడ్డి, జగ్గారెడ్డి, మధుయాష్కీ తదితరలు ఈ ఎన్నికల వ్యూహ భేటీకి హాజరయ్యారు.
చదవండి: టీ కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశం.. హైకమాండ్ ఏం చెప్పింది?
భేటీ అనంతరం టీపీసీసీ ఛీప్ రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ఎన్నికల కార్యచరణ మొదలైందని, రాబోయే 120 రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించామని తెలిపారు. ‘‘మేనిఫెస్టో రూపకల్పన త్వరగా పూర్తి చేయాలని చర్చ జరిపాం. అభ్యర్థుల ఎంపికలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపై చర్చ జరిగింది. ఎన్నికల సన్నాహక సమావేశం సుదీర్ఘంగా చర్చ జరిగింది. కర్ణాటక ఫార్ములాను తెలంగాణలో అమలు చేయాలని నిర్ణయించాం. అక్కడ అనుసరించిన మౌలిక అంశాలు ఇక్కడ కూడా అమలు చేయాలని డిసైడ్ అయింది’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment