5 లోక్‌సభ స్థానాలతో రంగారెడ్డి జిల్లాకు లింక్
తెలంగాణలోనే విభిన్న రాజకీయ పరిస్థితులు
అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించేది ఇక్కడి ఓటర్లే
సాక్షి, హైదరాబాద్: పల్లె.. పట్నం కలబోత. భౌగోళికంగా ఏడు జిల్లాల సరిహద్దులతో విస్తరించి ఉన్న అరుదైన ఘనత. తెలంగాణలోనే శరవేగంగా విస్తరిస్తోంది రంగారెడ్డి జిల్లా. ఐటీ, పారిశ్రామిక, రియల్ ఎస్టేట్ రంగాల్లో దూసుకుపోతోంది. జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఈ జిల్లా ప్రస్తుతం కొంత విభిన్న పరిస్థితులను ఎదుర్కొంటోంది. తెలంగాణలోనే కాదు.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రంగారెడ్డి జిల్లా అయిదు లోక్‌సభ స్థానాల పరిధిలో విస్తరించి ఉండటం.. ఇటు రాజకీయంగానే కాదు అటు పరిపాలనా పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం ఒక్కో లోక్‌సభ స్థానం పరిధిలో కొనసాగుతుండటంతో ఎన్నికల రిటరి్నంగ్ అధికారులకే కాదు, పోలీసు యంత్రాంగానికి కొత్త చిక్కులు తప్పడం లేదు.
దేశంలోనే మొదటి స్థానంలో మల్కాజిగిరి..
దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న జాబితాలో మల్కాజిగిరి మొదటిస్థానంలో ఉంది. మల్కాజిగిరి. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, కంటోన్మెంట్, మేడ్చల్ సహా జిల్లాలోని ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఇదే పార్లమెంట్ పరిధిలో కొనసాగుతోంది. ఇక్కడ మొత్తం 37,28,417 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎల్బీనగర్ ఓటర్లే 6,00,552 మంది ఉండటం విశేషం. అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించడంలో జిల్లా పరిధిలోని ఎల్బీనగర్‌కు చెందిన ఓటర్లే కీలక పాత్ర పోషించబోతున్నారు.
తెలంగాణలో చేవెళ్ల రెండోది..
తెలంగాణలో అత్యధిక ఓటర్లు ఉన్న రెండో అతిపెద్ద లోక్‌సభ స్థానంగా చేవెళ్లకు గుర్తింపు ఉంది. వికారాబాద్, పరిగి, తాండురు సహా రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజక వర్గాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ మొత్తం 29,19,465 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో చేవెళ్ల, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లికి చెందిన వారే 21,72,811 మంది ఓటర్లు ఉండటం గమనార్హం.
అక్కడి అభ్యర్థులు..ఇక్కడి ఓటర్లు
రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం భువనగిరి లోక్‌సభ స్థానం పరిధిలో కొనసాగుతోంది. ఈ లోక్‌సభ స్థానంలో 18,04,930 మంది ఓటర్లు ఉండగా, వీరిలో ఒక్క ఇబ్రహీంపట్నంలోనే 3,37,134 మంది ఓటర్లు ఉన్నారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధిక ఓటర్లు ఇక్కడే ఉండటం, అభ్యర్థుల గెలుపోటములు వీరిపైనే ప్రధానంగా ఆధారపడ్డాయి.
⇒ జిల్లాలోని కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నాగర్‌కర్నూల్ లోక్‌సభ పరిధిలో కొనసాగుతోంది. ఈ లోక్‌సభ స్థానంలో మొత్తం 17,34,773 మంది ఓటర్లు ఉండగా, వీరిలో కల్వకుర్తికి చెందిన వారు 2,43,098 మంది ఉన్నారు.
⇒ షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం పరిధిలో కొనసాగుతోంది. ఈ స్థానంలో 16,80,417 మంది ఓటర్లు ఉండగా, వీరిలో షాద్‌నగర్ ఓటర్లే 2,38,392 మంది ఉన్నారు. ఆయా పారీ్టల అభ్యర్థుల జయాపజయాలను జిల్లా ఓటర్లే నిర్దేశించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment