పట్నా : బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ రాజకీయపరంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. జేడీయూ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ ఉన్నతాధికారి ఆర్‌సీపీ సింగ్‌కు జేడీయూ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. 2019లో పార్టీ చీఫ్‌గా తిరిగి ఎన్నికైన నితీష్ పదవీకాలం 2022 వరకు ఉన్నప్పటికీ ముందే తప్పుకున్నారు. అయితే ముఖ్యమంత్రిగా, పార్టీ పెద్దగా బాధ్యతలు ఒక్కరి వద్దే ఉండటం సరైనది కాదని పలువురు సీనియర్ నేతలు అభిప్రాయపడ్డారు. దీంతో పార్టీ చీఫ్ బాధ్యతల నుంచి నితీష్ తప్పుకున్నారు. ఈ మేరకు ఆదివారం పట్నాలో నిర్వహించిన జేడీయూ ముఖ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. (నితీష్‌కు షాకిచ్చిన జేడీయూ ఎమ్మెల్యేలు)
కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆర్‌సీపీ సింగ్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడుగా కొనసాగుతున్నారు. రెండుసార్లు పెద్దల సభకు ఎంపికైన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాకుండా నితీష్ కుమార్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో పాటు గతంలో జేడీయూ ప్రభుత్వంలో పలు కీలక విభాగాల్లోనూ ఆయన పనిచేశారు. అనంతరం నితీష్ పిలుపు మేరకు ఉద్యోగానికి రాజీనామా చేసి జేడీయూలో చేరారు. ఎన్నికలతో పాటు పాలనలో నితీష్‌కు వ్యహకర్తగా వ్యవహరిస్తున్నారు. దీంతో జేడీయూ అధ్యక్షుడిగా ఆర్‌సీపీ సరైన వ్యక్తిగా భావించిన నితీష్.. పార్టీ బాధ్యతలను ఆయనకు అప్పగించారు.
ఇదిలావుండగా.. అరుణాచల్ ప్రదేశ్‌లో జేడీయూకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకోవడంతో జేడీయూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. బీజేపీకి ఇది సరైనది కాదని ఆ పార్టీ సీనియర్ నేత కేసీ త్యాగి విమర్శించారు. ఓ రాష్ట్రంలో స్నేహం చేస్తూ మరో రాష్ట్రంలో ద్రోహం చేయడం సరైన విధానం కాదని హితవు పలికారు. ఇది ఇరు పార్టీల మధ్య సఖ్యతను దెబ్బతీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే బెంగాల్‌లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ ఒంటరిగా బరిలో నిలుస్తుందని కేసీ త్యాగి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment