
హైదరాబాద్, సాక్షి: ప్రతిపక్ష నేత కేసీఆర్ వచ్చి రైతు భరోసా మీద సలహాలు ఇస్తారని అనుకున్నానని, సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే రావట్లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో భూభారతి, రైతు భరోసాలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.
బీఆర్‌ఎస్ హయాంలో క్రషర్ యూనిట్లకు, మైనింగ్ భూములకు రైతు బంధు ఇచ్చారు. లేఅవుట్లు వేసి.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన వాళ్లకు కూడా రైతు బంధు ఇచ్చారు. రోడ్డు విస్తరణలో పోయిన భూమికి కూడా రైతు బంధు ఇచ్చారు.
మేము ఇచ్చినట్లు గానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని కేటీఆర్ అంటున్నారు. మీరు ఇచ్చినట్లు ఇస్తే..మేము ప్రతిపక్షం లో ఉంటాం. ఆ తర్వాత బయటకు వెల్లాల్సి వస్తుంది. కేసీఆర్ చేసిన ఘనకార్యానికి ఇప్పుడు ఆయన సభకు రాలేకపోతున్నారు..
గుట్టలు, రోడ్డు, రియలెస్టేట్ వెంచర్లకు రైతు భరోసా ఇవ్వాలా? వద్దా? బీఆర్ఎస్ సమాధానం చెప్పాలి. మా ప్రభుత్వం సూచనలను తీసుకోవడానికి సిద్ధం గా ఉంది. బీఆర్ఎస్ సభలో ఎంత చిల్లరగా వ్యవహరించినా ఓపికతో ఉన్నాం’ అని రేవంత్ అన్నారు.
అబద్ధాల సంఘానికి అధ్యక్షుడు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ప్రవర్తన, చిత్ర విచిత్ర వేషాలు ప్రజలు గమనిస్తున్నారు. అబద్ధాల సంఘానికి అధ్యక్షుడు సభకు రాలేదు. ఉపాధ్యక్షుడు వచ్చారు.
మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి రైతుభరోసాపై సలహాలు ఇస్తారనుకున్నాం. కానీ అలా జరగడం లేదు.గత పదేళ్ల పాలనపై సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే సభకు రావడం లేదేమో
ఒకసారి అధికారం.. మరోసారి డిపాజిట్లు కోల్పోయిన బీఆర్‌ఎస్ నేతల తీరు మారడం లేదు. మీరు లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి ఆపసోపాలు పడ్డారు. కానీ మేం మీలా కాదు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రుణమాఫీ చేశామని అన్నారు.

Comments
Please login to add a commentAdd a comment