సాక్షి, హైదరాబాద్: ‘ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం’.. ఇప్పుడు ఈ అంశంపై రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. తమిళనాడులో సూపర్ సక్సెస్ అయిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామంటూ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఈ హామీ కూడా కీలకభూమిక పోషించిందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇప్పుడు కర్ణాటక తరహాలో తెలంగాణలో కూడా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని మేనిఫెస్టోలో పెట్టే అంశం కాంగ్రెస్ పరిశీలనలో ఉంది.
కర్ణాటకలో ఈ హామీ ఆ పార్టీకి సానుకూల ఫలితాన్ని అందించిన నేపథ్యంలో, ఇక్కడా ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉన్నందున మనం కూడా దీనిపై ఆలోచన చేయాలంటూ తాజాగా బీఆర్‌ఎస్ నేతలు కూడా మంత్రుల దృష్టికి తెస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చే లోపు రాష్ట్రంలో దీనిని అమలు చేయాలన్న అభిప్రాయం వారి ముందుంచుతున్నారు.
చెన్నైకి వెళ్లిన ఆర్టీసీ అధికారులు
ఎన్నికలతో ప్రమేయం లేకుండా, ఇటీవలే కొందరు అధికారులు దీనిపై ఉన్నతాధికారులకు ఓ నివేదిక అందజేశారు. కొద్ది రోజుల క్రితం అధికారులతో కూడిన ఓ బృందం తమిళనాడు ఆర్టీసీపై అధ్యయనానికి చెన్నై వెళ్లింది. అక్కడ ఆర్డినరీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం బాగా సక్సెస్ అయ్యిందని, దాని రూపంలో ఆక్యుపెన్సీ రేషియో బాగా పెరిగిందని, ఈ పథకం కోసం ప్రభుత్వం రీయింబర్స్ చేసే మొత్తం ఆర్టీసీకి లాభదాయకంగా మారిందంటూ అక్కడి అధికారులు స్పష్టం చేశారు.
కర్ణాటక మోడల్‌తో పోలిస్తే, తమిళనాడు మోడల్ బాగుందని, దీనిని తెలంగాణలో కూడా అమలు చేస్తే బాగుంటుందని అధికారులు ఆర్టీసీ మేనేజ్‌మెంట్‌కు ఓ నివేదిక అందజేశారు. రెండు రాష్ట్రాల్లో ఈ పథకం అమలులోకి వచ్చాక మహిళా సాధికారత గణనీయంగా పెరిగిందని నివేదికలు పేర్కొంటున్నాయి. అటు అధికారుల సానుకూల నివేదిక, ఇటు రాజకీయపార్టీల ఎన్నికల ప్రణాళికలు.. వెరసి తెలంగాణ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం అంశం పెద్ద చర్చకు దారితీస్తోంది.
తమిళనాడులో ఇలా..
స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆ రాష్ట్ర ఆర్టీసీ ఆర్డినరీ బస్సుల్లో మహిళలు వయసుతో సంబంధం లేకుండా ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు 2021లో ప్రారంభించారు.
♦ ఆ రాష్ట్రంలోని మొత్తం 22500 ఆర్టీసీ బస్సులు ఉండగా, 7500 ఆర్డినరీ బస్సుల్లో ఈ వసతి కల్పించారు.
♦ మహిళలకు బస్సుల్లో కండక్టర్లు జీరో టికెట్ జారీ చేస్తారు. దీనివల్ల ఎంతమంది మహి ళలు బస్సుల్లో ప్రయాణించిందీ లెక్క తేలుతుంది.
♦ ఇలా జారీ అయ్యే జీరో టికెట్లకుగాను ప్రభుత్వం ప్రతి టికెట్‌కు రూ.16 చొప్పున ఆర్టీసీకి రీయింబర్స్ చేస్తుంది.
♦ ఈ పథకం రాకముందు అక్కడి ఆర్టీసీ బస్సుల్లో నిత్యం 30 లక్షల మంది మహిళలు ప్రయాణించేవారు. తర్వాత వారి సంఖ్య 45 లక్షలకు పెరిగింది. అంటే 50 శాతం ఆక్యుపెన్సీ పెరిగిందన్నమాట.
♦ ఈ రూపంలో ప్రభుత్వం నుంచి నెలకు సగటున రూ.200 కోట్ల మొత్తం ఆర్టీసీకి
అందుతోంది.
కర్ణాటకలో ఇలా..
తమిళనాడు కంటే ఓ అడుగు ముందుకేసి కర్ణాటకలో శక్తి పథకం పేరుతో గత జూన్‌లో ఆర్డినరీ బస్సులతోపాటు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కూడా మహి ళలకు ఉచిత ప్రయాణ వెసులుబాటు కల్పించారు.
♦ మొత్తం 18609 బస్సుల్లో ఈ అవకాశం కల్పించారు. ఇందులో 6343 ఎక్స్‌ప్రెస్, 6308 సిటీ సర్వీసులు, 5958 ఆర్డినరీ బస్సులున్నాయి.
♦ తొలి నెల రోజుల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 17.40 కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. ఒక్క బెంగళూరు సిటీలోనే ఏకంగా 5.60 కోట్ల ట్రిప్పులు నమోదయ్యాయి.
♦ ఈ పథకం అమలులోకి రాకముందు, కర్ణాటక రాష్ట్రంలో రోజుకు సగటున 85 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో తిరిగేవారు. పథకం ప్రారంభమయ్యాక ఆ సగటు సంఖ్య 1.09 కోట్లకు పెరిగిందని తేలింది. అంటే నిత్యం అదనంగా 25 లక్షల మంది ప్రయాణికుల సంఖ్య పెరిగింది. వారంతా మహిళా ప్రయాణికులే అన్నది దాని సారాంశం.
♦ అంటే ఇది ప్రత్యక్షంగా ప్రైవేటు వాహన ప్రయాణాన్ని అరికడుతోంది.
♦ ఈ పథకం తాలూకు ఖర్చు భరించేందుకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో ఏకంగా రూ.4 వేల కోట్లు కేటాయించింది.
♦ ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్ అందుతున్నందున, మహిళా ప్రయాణికుల రూపంలో ఆర్టీసీ బస్సుల్లో పెరిగే ఆక్యుపెన్సీ రేషియో మేరకు ఆర్టీసీకి ఆదాయం పెరగినట్టయ్యింది.
♦ ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ఈ పథకాన్ని అమలు చేస్తుండటం.. క్రమంగా ప్రభుత్వానికి భారంగా మారుతుందన్న విమర్శలు ఉన్నాయి. అందుకే తమిళనాడు తరహా ఆర్డినరీ బస్సుల వరకే దాన్ని పరిమితం చేయాలన్న వాదన ఉంది.
Comments
Please login to add a commentAdd a comment