సాక్షి, హైదరాబాద్ : పట్టభద్రుల ఎన్నికపై టీఆర్‌ఎస్ సీరియస్‌గానే దృష్టి సారించింది. హైదరాబాద్, వరంగల్ స్థానాలు కైవసం చేసుకునేందుకు పకడ్బందీగా పావులు కదుపుతోంది. శాసన మండలి పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి (టీఆర్‌ఎస్), రామచంద్రరావు (బీజేపీ) పదవీ కాలపరిమితి మార్చి 29న ముగియనుంది. ఈ నెల 18న ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’, 22న ‘హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్’ పట్టభద్రుల నియోజకవర్గం ఓటరు తుది జాబితా వెలువడనుంది. ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం ‘హైదరాబాద్’ పట్టభద్రుల నియోజకవర్గంలో 4.48లక్షలు, ‘వరంగల్’లో 5లక్షలకు పైగా పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. ఓటరు జాబితాలో కనీసం మూడింట ఒక వంతు మంది పట్టభద్రులు తమ పార్టీ యంత్రాంగం చొరవతోనే ఓటర్లుగా నమోదైనట్లు టీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. కాగా జనవరి మూడో వారంలో ఉమ్మడి ఆరు జిల్లాల పరిధిలోని టీఆర్‌ఎస్ కీలక నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారు.
‘వరంగల్’నుంచి మళ్లీ ‘పల్లా’!
వరంగల్– ఖమ్మం– నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మరోమారు పోటీ చేస్తారని టీఆర్‌ఎస్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. ఓటరు తుది జాబితా వెలువడిన తర్వాత అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది.కాగా, రాజేశ్వర్‌రెడ్డి గతేడాది అక్టోబర్ నుంచే జిల్లాల వారీగా వివిధ సంఘాలు, వర్గాలతో భేటీలు నిర్వహిస్తున్నారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, రాణిరుద్రమ, జయసారధిరెడ్డి, తీన్మార్ మల్లన్న, రాములు నాయక్ తదితరులు ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సన్నద్ధం అవుతుండటంతో టీఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డాలని నిర్ణయించుకుంది.
‘హైదరాబాద్’ బరిలో ఔత్సాహికులు
‘హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్’పట్టభద్రుల నియోజకవర్గానికి 2007, 2009, 2015లో మూడు పర్యాయాలు ఎన్నికలు జరిగినా ఇప్పటి వరకు టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందలేదు. దీంతో ఈసారి టీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డికి ఈ నియోజకవర్గం పరిధిలో గ్రాడ్యుయేట్ ఓటర్ల సభ్యత్వ నమోదు పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు. హైదరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పలువురు ఔత్సాహికులు ఆసక్తి చూపుతున్నారు. జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, తెలంగాణ విద్యా సంక్షేమ మౌలిక వసతుల కల్పన అభివృద్ధి సంస్థ చైర్మన్ నాగేందర్‌గౌడ్ (రంగారెడ్డి) పీఎల్ శ్రీనివాస్ (హైదరాబాద్), శుభప్రద్ పటేల్ (వికారాబాద్), వర్కటం జగన్నాథ్‌రెడ్డి (మహబూబ్‌నగర్) టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
పట్టభద్రుల కోటా ఎన్నికపై కేటీఆర్ దిశానిర్దేశం
సాక్షి, హైదరాబాద్: ‘వరంగల్– నల్లగొండ– ఖమ్మం’శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారకరామారావు కీలకభేటీ నిర్వహించారు. నియోజకవర్గాలవారీగా కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు. శనివారం ప్రగతిభవన్‌లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మె ల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్సీలు, కీలక నేతలు పాల్గొన్నారు. పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం పూర్తవడంతో పార్టీపరంగా జరిగిన ఓటరు నమోదు గురించి ఆరా తీసి సంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గాలవారీగా ప్రతి 50 మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జిని నియమించాలని ఆదేశించారు. బూత్ కమిటీల ఏర్పాటు, పార్టీ నేతల సమన్వయం, ప్రచారవ్యూహంపై పలు సూచనలు చేశారు.
ఉద్యోగులు, యువతపై నజర్
పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని అనధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో ఆయనతో సమన్వయం చేసుకుని సమావేశాలు ఏర్పాటు చేయాల్సిందిగా కేటీఆర్ సూచించారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత ప్రచార వ్యూహంపై దిశా నిర్దేశం చేస్తామని, ఆలోగా పార్టీ యంత్రాంగాన్ని ఎన్నికలకు సన్నద్ధం చేయాలని సూచించారు. ఉద్యోగులు, యువత కోసం ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ఇతర అంశా ల గురించి సన్నాహక సమావేశాల్లో వివరించా లని కేటీఆర్ సూచించారు. ఈ ఎన్నికలో కీలకమైన ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, యువతను లక్ష్యంగా చేసుకుని ప్రచారం సాగించాలని దిశానిర్దేశం చేశారు. గతంతో పోలిస్తే ఓటర్ల సంఖ్య రెండింతలు పెరిగినందున వీలైనంత ఎక్కువ మందిని చేరుకునేలా కార్యాచరణ ఉండాలన్నారు. నియోజకవర్గస్థాయిలో స్థానిక ఎమ్మెల్యే పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment