
సాక్షి, అమరావతి: అధికారమన్నది పవర్ కాదని, అది ఒక బాధ్యత అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. రాష్ట్ర మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అధిక ప్రాధాన్యత కల్పించాలన్నదే సీఎం జగన్ ముఖ్య విధానమని తెలిపారు. ఇందులో ఒకరికి న్యాయం, మరొకరికి అన్యాయం అన్నది లేదన్నారు. అందరూ అర్థం చేసుకున్నారు కాబట్టే సాఫీగా సాగుతోందని తెలిపారు. పార్టీలో ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం ఉందని స్పష్టంచేశారు.
సోమవారం తాత్కాలిక సచివాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. పదవులు దక్కలేదన్నది నాయకుల అసంతృప్తి కాదని, వారి అనుచరుల తాత్కాలిక అసంతృప్తి మాత్రమేనని చెప్పారు. అధికారం వారి నాయకుడికి రావాలన్నదే అనుచరుల బాధ అని, అక్కడి నుంచి అసంతృప్తి అంటూ పుకార్లు పుట్టిస్తున్నారని తెలిపారు. ఆవేశంతో కొంత మంది రాజీనామాలు అనే మాట వచ్చి ఉంటుందన్నారు. ఇదంతా తాత్కాలికమేనన్నారు. పరిమిత సంఖ్యలో ఉన్న పోస్టుల్లో అందరికీ న్యాయం చేయడం కొంత ఇబ్బందికరమేనని చెప్పారు. అనుచరుల బాధను అధినేత అర్థం చేసుకుంటారన్నారు. చాలా మంది నేతలు స్పోర్టివ్‌గా తీసుకున్నారని చెప్పారు.
బీసీలకు పెద్ద పీట వేసిన విషయాన్ని అందరూ గమనించాలన్నారు. ఓ వర్గం మీడియా కుట్రపూరితంగా దీనిపై దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. 2014లో చంద్రబాబు 25 మంత్రి పదవులు ఉన్నా, 19 మందినే ఎందుకు నియమించుకున్నారని ప్రశ్నించారు. ఆయన కుమారుడి కోసం మరో ఐదు పోస్టులు భర్తీ చేశారన్నారు. ఇవన్నీ మరిచి ఇవాళ టీడీపీ నేతలు అడ్డగోలు కామెంట్లు చేస్తూ శునకానందం పొందుతున్నారని దుయ్యబట్టారు. పార్టీ బాధ్యతలు, రీజినల్ కోఆర్డినేటర్ పోస్టులు కూడా భర్తీ చేస్తారని, వాళ్లూ కీలకంగా మారతారని తెలిపారు. మంత్రివర్గం, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్లు అందరూ కలిసి ఎన్నికల టీమ్‌గా ఉంటారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వీరంతా పార్టీని విజయపథంలో నడిపిస్తారని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment