సాక్షి, అమరావతి: కరోనా నుంచి ప్రజలను కాపాడటమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ శ్రమిస్తుంటే విపక్ష నేత చంద్రబాబు మాత్రం ఈ కష్టకాలంలోనూ చిల్లర రాజకీయాలకే ప్రాధాన్యమిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. కేంద్రం చేతుల్లో ఉండే వ్యాక్సిన్లతోపాటు ఆక్సిజన్ కొరత ఏర్పడితే రాష్ట్రంపై నిందలేయడమేంటని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యాక్సినేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసిందని చంద్రబాబు విమర్శించడం అర్థరహితమన్నారు. వ్యాక్సిన్ల తయారీ, పంపిణీ కేంద్రం చేతుల్లో ఉంటుందని ఆయనకు తెలియకపోవడం సిగ్గుచేటన్నారు. కేంద్రం వ్యాక్సిన్లు ఇస్తే రోజుకు 6 లక్షల మందికి ఇవ్వగల సామర్థ్యం రాష్ట్రానికి ఉందన్నారు. రాష్ట్రానికి 4 కోట్ల డోసుల వ్యాక్సిన్లు కావాలని కేంద్రాన్ని, తయారీ కంపెనీలను కోరామన్నారు.
ప్రజారోగ్యమే సీఎం జగన్ లక్ష్యం
‘‘90 శాతం మందిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి ముఖ్యమంత్రి తెచ్చారు. కోవిడ్‌ను ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చారు. 90 శాతం ఆసుపత్రులకు ఈ సౌకర్యం వర్తింపజేశారు. అనారోగ్యం వస్తే ప్రభుత్వం ఆదుకుంటుందనే భరోసాను పేదలకు కల్పించారు. చంద్రబాబు హయాంలో వైద్యాన్ని గాలికొదిలేశారు. అప్పుడు కోవిడ్ వస్తే పరిస్థితి దారుణంగా ఉండేది. ‘నాడు – నేడు’ ద్వారా ఆసుపత్రులను తీర్చిదిద్దారు కాబట్టే ప్రజలను రక్షించగలుగుతున్నాం.
ప్రతీ ప్రాణం ముఖ్యమే
ప్రతీ ప్రాణాన్ని కాపాడేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కోవిడ్ కట్టడికి ఏడాదిలోనే ఎన్నో మార్పులు తెచ్చింది. గతేడాది 200 ఆసుపత్రులుంటే 630కి పెంచారు. వారంలోనే పడకల సామర్థ్యాన్ని 27 వేల నుంచి 45 వేలకు పెంచి ఆక్సిజన్‌తో పాటు అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో ఏప్రిల్ 24 నాటికి ఆక్సిజన్ బెడ్స్ 19 వేలు ఉండగా ఈ నెల 4 నాటికి 29 వేలకు పెరిగాయి. కొత్తగా వైద్యుల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టింది. కోవిడ్ కేర్ సెంటర్లు 40 నుంచి 80 వరకూ పెరిగాయి. ఆక్సిజన్ కోసం ప్రతీక్షణం సర్కార్ పోరాడుతోంది. ప్రస్తుతం 450 టన్నుల ఆక్సిజన్ అందుబాటులో ఉంది. ఆర్‌ఐఎన్‌ఎల్ రిజర్వు నుంచి కూడా తీసుకుంటున్నారు. క్రయోజనిక్ ట్యాంకర్స్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.
యుద్ధ ప్రాతిపదికన బయట నుంచి దిగుమతి చేసుకునే ప్రయత్నం చేస్తోంది. డబ్బులు కట్టే పనిలేకుండా ఎక్కువ మందికి వైద్యం అందించేందుకు సీఎం తపన పడుతున్నారు. ఆక్సిజన్, వ్యాక్సిన్లు, మందులన్నీ కేంద్రం పరిధిలో ఉంటాయి. రాష్ట్రాలు వీటిని వేరే మార్గంలో తెచ్చుకునే అవకాశం లేదు. 70 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు వస్తే రాష్ట్రానికి ఇంత వరకూ ఒక్కటీ రాలేదు. అయినా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిల్వకు నిర్మాణాలు జరుగుతున్నాయి. వీలైనంత వరకూ ఆక్సిజన్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గతేడాది లాక్‌డౌన్ సమయంలో అనేక సంక్షేమ పథకాలతో ఆదుకున్నారు. అనేక పథకాల రూపంలో ప్రత్యక్ష నగదు బదిలీ చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నా ప్రజల హాహాకారాలు అంటూ విపక్షం ఆరోపణలు చేయడం దుర్మార్గం. మరో పది రోజుల్లో రాష్ట్రంలో ఆక్సిజన్ బెడ్స్ మరిన్ని పెరుగుతాయి. ప్రతిపక్షం అనవసర రాద్దాంతం మానుకుని నిర్మాణాత్మక పాత్ర పోషించాలి’’.
కరోనాపై కదనం
కరోనాపై చేస్తున్న యుద్ధంలో ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలని వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చింది. ఈ మేరకు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు సజ్జల తెలిపారు. 9143 541234, 9143 64 1234 వాట్సాప్ ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఇదే విధంగా ప్రతి నియోజకవర్గంలో కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి రెండు ఫోన్ నంబర్లు కేటాయించి ప్రజలకు సహాయపడాలని కోరారు.
విపత్తులోనూ విష రాజకీయాలా?
Published Thu, May 6 2021 4:03 AM | Last Updated on Thu, May 6 2021 7:55 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment