చంద్రబాబు ముఠా వికారపు చేష్టలు.. సజ్జల ఏమన్నారంటే..? | Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ముఠా వికారపు చేష్టలు.. సజ్జల ఏమన్నారంటే..?

Published Fri, Mar 4 2022 5:56 PM | Last Updated on Sat, Mar 5 2022 4:51 AM

Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అందుకే పరిపాలనా వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నామని తెలిపారు. అమరావతిలో కూడా అన్ని అభివృద్ధి పనులు చేసి తీరుతామన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, అందరి ఆకాంక్షలు, వాస్తవాలను గుర్తెరిగి అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ది చెందాలని కాంక్షిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.ఆచరణ సాధ్యం కాని ప్రణాళికలకు దూరంగా ఉంటూ, విభజనతో ఇప్పటికే నష్టపోయిన రాష్ట్రంపై అనవసర భారాన్ని నివారించారన్నారు. మరోవైపు కోవిడ్‌ కష్టకాలంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజలను అన్ని రకాలుగా ఆదుకున్నారని గుర్తు చేశారు. 

చంద్రబాబు అధికారంలో ఉండగా ఎవరినీ పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా రాజధానిని ప్రకటించారని సజ్జల తెలిపారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా కేవలం తన బినామీలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల ప్రయోజనాల కోసమే నిర్ణయాలు తీసుకున్నారని ధ్వజమెత్తారు. రాజధాని అమరావతికి కనీసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేయాలని చెప్పిన చంద్రబాబు ఐదేళ్లలో మౌలిక సదుపాయాలకు రూ.ఐదు వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, ఈ లెక్కన ఎప్పటికి పూర్తి కావాలని ప్రశ్నించారు. అంత భారాన్ని ఏ ప్రభుత్వమైనా చివరకు కేంద్రం కూడా భరించలేదన్నారు. రూపాయి పెట్టి రూ.వెయ్యి లాభాన్ని ఆశించిన బాబు బినామీలంతా తమ ఆదాయం పోయిందనే ఉక్రోషంతోనే ఆందోళనకు దిగారని, ఇప్పుడు హైకోర్టు తీర్పుతో బాణసంచా కాల్చింది కూడా వారేనని చెప్పారు. హైకోర్టు తీర్పుతో చంద్రబాబు బృందం వికారపు చేష్టలకు దిగిందని దుయ్యబట్టారు. దీన్ని రైతుల విజయంగా టీడీపీ ప్రచారం చేయడం జుగుప్సాకరమన్నారు. నిజమైన ఉద్యమంలో చమట, మట్టివాసన ఉంటాయని, ఇక్కడ మాత్రం రైతుల ముసుగులో చంద్రబాబు బినామీలు, రియల్టర్లు, పెట్టుబడిదారులున్నారని చెప్పారు. రెక్కాడితే గానీ డొక్కాడని వారు అసలే లేరన్నారు.  ఇన్ని డ్రామాలు చూశాక మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సి వస్తోందన్నారు. 

ఎంత ఖర్చు చేశారు..?
రూ.లక్ష కోట్ల పెట్టుబడి ఏ ప్రభుత్వానికీ సాధ్యం కాదని సజ్జల పేర్కొన్నారు. అమరావతిలో గత సర్కారు చేసిన వ్యయం రూ.8,572.19 కోట్లు మాత్రమేనని చెప్పారు. అందులో మౌలిక వసతుల ఖర్చు రూ.5,674 కోట్లు కాగా మిగిలిన దాదాపు రూ.3 వేల కోట్లు వడ్డీలపై రుణాలు, కన్సల్టెన్సీల ఛార్జీల కోసమని వివరించారు. ఇంకా రూ.798 కోట్లు రైతులకు కౌలు కింద ఇచ్చారన్నారు. ఈ మొత్తం కూడా సొంత డబ్బు కాదని, అంతా రుణం, బాండ్లు అని తెలిపారు. హడ్కో రుణం రూ.1,151 కోట్లు, అమరావతి బాండ్లు రూ.2 వేల కోట్లు, కన్సార్షియమ్‌ రుణాలు మరో రూ.1,862 కోట్లు అని చెప్పారు. కేంద్రం నుంచి దాదాపు రూ.1,500 కోట్లు వచ్చాయని సజ్జల గణాంకాలతో సహా వివరించారు. వాస్తవం ఇది కాగా చంద్రబాబు నిస్సిగ్గుగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

అన్నీ అభివృద్ధి చెందుతాయి..
పరిపాలన వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల అభివృద్ధి తమ లక్ష్యమని సజ్జల తెలిపారు. అమరావతిలోని 33 వేల ఎకరాల్లో రూ.లక్షల కోట్ల ఆస్తి ఉందని టీడీపీ వారే చెబుతున్నారని తెలిపారు. అదే మొత్తాన్ని మూడు ప్రాంతాల్లో పెడితే అన్నీ అలాగే అభివృద్ధి చెందుతాయి కదా? అని ప్రశ్నించారు. అయినా అక్కడి నుంచి రాజధానిని పూర్తిగా తరలించడం లేదన్నారు. కేవలం పరిపాలన వికేంద్రీకరణ మాత్రమే చేస్తున్నామన్నారు. కర్నూలులో హైకోర్టు. విశాఖలో సచివాలయం ఏర్పాటుకు మాత్రమే యోచించామని చెప్పారు. 

ఓడిపోతున్నా తీరు మారని టీడీపీ
టీడీపీ నేత అచ్చెన్నాయుడు తమకు 150 నుంచి 160 సీట్లు వస్తాయని పేర్కొనటంపై సజ్జల స్పందిస్తూ అన్ని ఎన్నికల్లో ఓడిపోతున్నా ఆ పార్టీ వైఖరిలో మార్పు రావడం లేదని వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పు టీడీపీ విజయం ఎలా అవుతుంది? దానివల్ల వారు ప్రజలకు ఒరగబెట్టిందేమిటి? కోర్టు తీర్పును టీడీపీ మరో రకంగా చూపుతూ తమ విజయంగా అభివర్ణిస్తోందని విమర్శించారు. సొంత మామకు వెన్నుపోటు పొడిచి అధికారం చేపట్టిన నాడే చంద్రబాబు చరిత్రహీనుడయ్యారని చెప్పారు. సొంతంగా ఏ ఎన్నికల్లోనూ ఆయన గెలవలేదని, ఇప్పుడు అనుకూల మీడియాను నమ్ముకున్నారని తెలిపారు. పది మంది ఉంటే వంద మంది ఉన్నట్లు చూపుతున్నారన్నారు. ప్రతి చిన్న పనికి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ రాజకీయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నిన్నటి పరిణామాలపై ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం న్యాయ నిపుణులతో చర్చిస్తుందని సజ్జల తెలిపారు. అసెంబ్లీలోనూ చర్చిస్తుందన్నారు. తమ లక్ష్యం న్యాయబద్ధమైనది కాగా చంద్రబాబుది కుల రాజకీయమని విమర్శించారు.

నిష్పాక్షిక దర్యాప్తునే కోరుతున్నాం..
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఓ వర్గం మీడియా ఒకవైపు కోణాన్ని మాత్రమే హైలైట్‌ చేస్తోందన్నారు. సీఆర్పీసీ 161 స్టేట్‌మెంట్లలో కూడా తమకు అనుకూలంగా ఉన్న వాటినే ప్రచురిస్తోందన్నారు. సీబీఐ దర్యాప్తులో లోపాలను తాము ప్రశ్నిస్తున్నామన్నారు. గతంలో సిట్‌ దర్యాప్తు నివేదికను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వివేకా లేఖను సాయంత్రం వరకు ఎందుకు దాచి పెట్టారు? ఆయన ఫోన్‌ను సాయంత్రం వరకు పోలీసులకు ఎందుకు అప్పగించలేదు? అని సూటిగా ప్రశ్నించారు. ఫోన్‌లో ఏవి డిలీట్‌ చేశారో బహిర్గతం చేయాలన్నారు. ఈ కేసులో ప్రభుత్వం ఎప్పుడూ నిష్పాక్షిక దర్యాప్తునే కోరుకుంటోందని సజ్జల స్పష్టం చేశారు.   

చదవండి: సీఎం జగన్‌ అండగా నిలిచారు.. వారి ఆనందానికి అవధుల్లేవ్‌..

వాస్తవ రైతులు వీరే ...
అమరావతిలో మొత్తం 34,385 ఎకరాల్లో 30,913 ఎకరాలు పట్టా భూములు. 28,526 ఎకరాలు రైతులకు చెందిన భూములు. ఇందులో కేవలం 1,133 మంది చేతిలో 10 వేలకు పైగా ఎకరాల భూమి ఉంది. అందులో దాదాపు 10,050 మంది సీఆర్డీఏ  భూములు సేకరించే నాటికే తమ భూములు అమ్ముకున్నారు. ఆ భూములు కొన్న వారిలో చంద్రబాబు బినామీలు ఎక్కువ ఉన్నారు. ఆ తర్వాత సీఆర్డీఏ ప్లాట్లు చేస్తే 7,500 మంది యజమానులు అమ్ముకోగా ఇప్పుడు 11 వేల మంది వాస్తవ రైతులు ఉన్నారు. అంటే మెజారిటీ రియల్టర్లు లేదా ప్లాట్లు కొని ఎక్కువ ధరకు అమ్ముకోవాలనుకున్న వారే ఇప్పుడు ఇక్కడ మిగిలారు. వాస్తవం ఇలా ఉంటే ఇది రైతు ఉద్యమమని ప్రపంచమంతా చూపే ప్రయత్నం చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. నిజానికి అక్కడున్న రైతులను ఛిన్నాభిన్నం చేశారు కాబట్టే చంద్రబాబును చిత్తుగా ఓడించారని, భవిష్యత్తులోనూ అదే జరుగుతుందని సజ్జల పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement