సాక్షి, అమరావతి: టీడీపీ, జనసేనలు ఎప్పుడూ కలిసే ఉన్నాయని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అక్రమ సంబంధానికి పవిత్రతను అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
‘‘11 మంది చనిపోతే పవన్ కనీసం పరామర్శించలేదు. మరణాలకు కారణమైన చంద్రబాబును పరామర్శించడం విడ్డూరం. చంద్రబాబు మంచి పాలన ఇవ్వలేదు.. కాబట్టే ప్రజలు ఓడించారు. ఎంతమంది కలిసి వచ్చినా మా ప్రభుత్వానికి ఇబ్బంది లేదు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది వైఎస్ జగన్ ప్రభుత్వమే’’ అని సజ్జల పేర్కొన్నారు.
‘‘2024 షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు.. వెంటిలేటర్‌పై ఉన్న పార్టీలే ముందస్తు ఎన్నికలు కోరుకుంటున్నాయి. బలమైన జగన్‌ను ఎదుర్కొనేందుకు వీళ్లంతా ఏకమవుతున్నారు. బీజేపీ కూడా వారితో కలిస్తే సీపీఐ రామకృష్ణ ఏం చెప్తారు. ఎరుపు, కాషాయం కలిస్తే పసుపు అవుతుందేమో చూడాలి. పందికొక్కులు, గుంటనక్కలు ఏకం కావడాన్ని జనం చూస్తున్నారు. జగన్‌కు ఉన్న ప్రజాబలం ముందు ఎవరూ నిలవలేరు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
చదవండి: సంక్రాంతి వచ్చిందే.. తుమ్మెదా!
‘‘2014లో పవన్ టీడీపీ పల్లకి మోశాడు. 2019 లో వ్యతిరేక ఓట్లు చీల్చడానికి పోటీ చేశారు. అపవిత్ర, అక్రమ సంబంధానికి పవిత్రత తేవటానికి ఇద్దరూ ప్రయత్నం చేస్తున్నారు. చనిపోయిన ప్రజల కుటుంబాలను కాకుండా చంపిన వారిని పరామర్శించటం ఏంటి?. రోడ్లపై సభలు వద్దంటే చంద్రబాబు ఎంత మొండిగా వ్యవహరించారో చూశాం. అలాంటి వ్యక్తికి పవన్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో తెలుసుకోవటం తేలికే. చంద్రబాబు యాక్షన్ ప్లాన్‌లో ఎవరి పాత్ర వారు పోషిస్తున్నారు. అందుకే ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక అంటూ హడావుడి మొదలెట్టారు’’ అని సజ్జల అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment