
సాక్షి, అమరావతి: చంద్రబాబు రాష్ట్రానికి శనిలాగా దాపురించారని, సభ్య సమాజంలో ఉండదగిన వ్యక్తి కాదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు హయాంలో కూడా రథం తగలబడితే బీజేపీ, పవన్ ఎందుకు ప్రశ్నించలేదు అని నిలదీశారు. మతాలకు అతీతంగా వైఎస్ కుటుంబం ప్రజలను ప్రేమిస్తుందని, హిందువుల మనోభావాలను ఎల్లప్పుడూ గౌరవించారని చెప్పారు. చెప్పులు వేసుకుని శంకుస్థాపనలు, పవిత్ర కార్యక్రమాల్లో పాల్గొన్న చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు. ఎర్రచందనం ఎన్‌కౌంటర్‌లో కూలీలను చంపితే, పుష్కరాల్లో 29 మంది చనిపోతే జాతీయ మీడియా ఎందుకు ఇంతగా కవరేజీ ఇవ్వలేదని ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
► రాజధాని అమరావతి కోసం చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియాలోని ఓ తోక పత్రిక భారీగా వసూలు చేసిన డబ్బు ఎక్కడికి పోయిందో దేవుడికే ఎరుక.
► దేవాలయాల్లో ఏదో ఒక చిచ్చు పెట్టాలని అధికార పార్టీ లేదా ప్రభుత్వం అనుకుంటుందా? చంద్రబాబు బుద్ధి ఇదేనా?
► కోవిడ్ కష్టకాలంలో రెవెన్యూ అడుగంటుతున్నా.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఒకే నెలలో ఏకంగా రూ.11,000 కోట్లను ప్రజలకు అందిస్తోందంటే ఎవరికి కడుపు మండుతుందో, వారే రథాలకు కూడా మంట అంటిస్తారన్నది కామన్ సెన్స్ పాయింట్.
► సంక్షేమ పథకాల డబ్బును నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు పంపుతుంటే చంద్రబాబుకు భయం పట్టుకుంది.
► ట్విట్టర్‌లో లోకేశ్ మాటలు ఆయన అజ్ఞానాన్ని, అమాయకత్వాన్ని బయటపెడుతున్నాయి.
► సహజవాయువుపై పన్ను పెరిగితే కనీస జ్ఞానం లేకుండా ఎల్‌పీజీ ధరల పెంపు అని మాట్లాడుతున్నారు.
► మంత్రిగా పనిచేసిన లోకేశ్‌కు జీఎస్టీ ఏయే వస్తువులకు వర్తిస్తుందో, రాష్ట్రాల పన్ను పరిధిలో ఇంకా ఏం ఉన్నాయో కూడా కనీస అవగాహన లేదు.
► మీటర్లు పెడితే రైతులకు విద్యుత్తు ఉచితంగా రాదని టీడీపీ, దాని తాబేదార్లు దుష్ప్రచారం మొదలుపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment