సాక్షి, సెంట్రల్‌డెస్క్: భారతీయ జనతా పార్టీ నాయకులు అన్వయ్ కుటుంబంపై అభాండాలు మోపి, అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారని శివసేన ఆరోపించింది. రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్‌చీప్ అర్నబ్ అరెస్టు విషయంలో 1975లో జరిగిన ఎమర్జెన్సీ సమయం, మాజీ ప్రధాని ఇందిరాగాంధీలతో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ను పోలుస్తున్నారని, అది తమకు గౌరవంగా అనుకుంటున్నట్లు సామ్నా సంపాదకీయంలో శివసేన పేర్కొంది.
ట్రంప్.. బీజేపీ
అమెరికా ప్రస్తుత అధ్యక్షుడిలా నకిలీ వార్తలను ప్రచారం చేయడం, మాటిమాటికీ కోర్టులో కేసులు వేయడం బీజేపీకే చెల్లుబాటయిందని సామ్నా సంపాదకీయం ఎద్దేవా చేసింది. ఓటమి అంచున ఉన్న ట్రంప్‌లాగే బీజేపీ నాయకులు ప్రవర్తిస్తున్నారని విమర్శించింది. అమెరికా ప్రతిష్టకు, చట్టాలకు వ్యతిరేకంగా ట్రంప్ చర్యల్లాగే ఇక్కడ కూడా ఓ వ్యక్తి ఆత్మహత్య కేసులో ముంబై పోలీసులు అర్నబ్‌ను అరెస్టు చేస్తే బీజేపీ ఆందోళనలు చేస్తోందని మండిపడింది. అరెస్టు రాజకీయ కక్షతో కూడుకన్నదని వ్యాఖ్యానించడం, పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడటం ప్రజలకు గందరగోళానికి గురిచేస్తోందని శివసేన వ్యాఖ్యానించింది. 2002లో ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, (ప్రస్తుత కేంద్ర హోంమంత్రి) అమిత్ షాతో సహా బీజేపీ నాయకులను గుజరాత్ అల్లర్లలో అనేక కేసులలో విచారించారని గుర్తుచేశారు. వారిని చట్టం ప్రకారం నిర్దోషులుగా ప్రకటించారని, కాని బీజేపీపై మోపిన కేసులు రాజకీయ కక్షలో భాగమని ఎందుకు వాదించలేదని శివసేన విమర్శించింది.
ఉద్ధవ్ ఫొటోతో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఫొటోలు పెట్టి, ప్రస్తుత పరిస్థితిని బీజేపీ పోల్చి చూడటం ఆ పార్టీ పిల్లతనం గుర్తుచేస్తోందని, అయినా శివసేన దాన్ని గౌరవంగానే స్వీకరిస్తోందని సంపాదకీయంలో స్పష్టంచేసింది. ఇందిరా ఐరన్ లేడీ అని, పాకిస్తాన్‌ను విచ్ఛినం చేసి, భారతదేశం విభజనపై ప్రతీకారం తీర్చుకున్నారని సంపాదకీయం కొనియాడింది. ఎన్సీపీయే కాకుండా మహావికాస్ ఆఘాడీ ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగమని మరోసారి గుర్తుచేసింది. ఇక అర్నబ్ విడుదలయ్యే వరకు బీజేపీ నాయకులు నల్లబ్యాండ్డీలు ధరించాలని ప్రకటించడంపై కూడా పత్రిక విమర్శలు గుప్పించింది. బ్యాడ్జీలతో సరిపెట్టారని, జైల్ భరో, నిరసన దీక్షలు లాంటిపై చేపట్టలేదని ఎద్దేవా చేసింది.
అర్నబ్‌కు దొరకని బెయిల్
రిపబ్లిక్ టీవీ ఎడిటర్–ఇన్–చీఫ్ అర్నబ్ గోస్వామి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడానికి నిరాకరించింది. తాత్కాలకి బెయిల్ వెంటనే ఇవ్వడానికి నిరాకరించింది. అయితే పిటిషనర్ బెయిల్ కోసం సెషన్ కోర్టుకు వెళ్లవచ్చని సూచించింది. ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, అతని తల్లి ఆత్మహత్యకు సంబంధించి నవంబర్ 4 న మహారాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు అన్వయ్‌కి బకాయిలు చెల్లించలేదని ఆరోపణలపై అరెస్టు జరిగింది. రిపబ్లిక్ టీవీ ఎడిటర్–ఇన్–చీఫ్ అర్నబ్ గోస్వామి మరో ఇద్దరు నిందితులు – ఫిరోజ్ షేక్, నితీష్ సర్దా – మధ్యంతర బెయిల్ కోరుతూ వారి ‘అక్రమ అరెస్టు‘ ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ ఎస్ ఎస్ షిండే, ఎం ఎస్ కార్నికల డివిజన్ బెంచ్ శనివారం విచారించింది.
వెంటనే దర్యాప్తు నిలిపివేయాలని, ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలని పిటిషనర్లు కోర్టును కోరారు. శనివారం మధ్యంతర బెయిల్‌పై మాత్రమే వాదనలు విన్న కోర్టు, దీపావళి సెలవుల తర్వాత డిసెంబర్ 10న ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయడంపై దాఖలైన పిటిషన్లను విచారించనున్నట్లు తెలిపింది. కాగా, అర్నబ్, మరో ఇద్దరు నిందితుల కస్టడీకి మేజిస్ట్రేట్ నిరాకరించడం పట్ల నవంబర్ 9న విచారణ జరగనుంది. కాగా, అర్నబ్ గోస్వామి తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే తాత్కాలిక బెయిల్ ఉత్తర్వులు జారీచేయాలని అభ్యర్థించగా నిరాకరించింది. హైకోర్టు ఉత్తర్వులు పిటిషనర్ దిగువ కోర్టుకు వెళ్లకుండా నిరోధించవని, బెయిల్ కోసం సెషన్ కోర్టును అశ్రయించవచ్చని సూచించింది. కోర్టు 4 రోజుల్లో మీ పిటిషన్‌పై విచారణ జరపవచ్చని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment