న్యూఢిల్లీ: పటిష్ట పునాదులపై సమున్నతంగా నిల్చున్న భారత వారసత్వాన్ని బలహీనపర్చే కుట్రకు బీజేపీ తెర తీసిందని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. విభజన సిద్ధాంతాలతో దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతూ దేశానికి హాని తలపెడుతోందని బీజేపీని సోనియా తూర్పారబట్టారు. కాంగ్రెస్ 137 వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మంగళవారం పార్టీ శ్రేణులనుద్దేశిస్తూ సోనియా వీడియో సందేశమిచ్చారు.
‘భారత దేశ సంస్కృతిలో ఒకటిగా కలిసిపోయి, అద్భుతంగా పరిఢవిల్లుతున్న హిందూ–ముస్లిం మత సామరస్యాన్ని, సౌభ్రాతృత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ నియమాలను పక్కకుతోసి నియంత పాలన కొనసాగుతోంది’ అని సోనియా ధ్వజమెత్తారు. ‘ ఇకపై ఈ దారుణాలకు కాంగ్రెస్ మౌన సాక్షిగా ఉండబోదు. దేశ వారసత్వ భావాలను చెరిపేసే ప్రయత్నాలను కాంగ్రెస్ అడ్డుకుంటుంది’ అని ఆమె హామీ ఇచ్చారు.
‘ భారత స్వాతంత్రోద్యమంలో ఎలాంటి భాగస్వామ్యం, పాత్ర లేని కొన్ని విభజన, విద్వేష శక్తులు ప్రస్తుతం దేశ లౌకికగుణాన్ని నాశనం చేసే దారుణానికి ఒడుగడుతున్నాయి’ అని పరోక్షంగా బీజేపీనుద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ‘ అర్హత లేకున్నా తమకూ దేశ చరిత్రలో స్థానం కల్పించుకునేందుకు చరిత్రను తిరగరాసే యత్నం చేస్తున్నారు’ అని సోనియా అన్నారు. కాగా, పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సోనియా కాంగ్రెస్ పార్టీ జెండావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. జెండాను ఎగరేస్తుండగా హఠాత్తుగా జెండా నేలరాలింది.
Comments
Please login to add a commentAdd a comment