ఆస్తి నాకు.. పాస్తి నీకు.. నగ నాకు.. నట్రా నీకు | Special Story On TDP And Janasena Seat Sharing Deal, Details Inside - Sakshi
Sakshi News home page

ఆస్తి నాకు.. పాస్తి నీకు.. నగ నాకు.. నట్రా నీకు

Published Wed, Mar 6 2024 5:49 PM | Last Updated on Thu, Mar 7 2024 10:25 AM

Special Story On TDP And Janasena seat Sharing Deal - Sakshi

అదీ టీడీపీ జనసేన వాటాల పంపకం

ఒరేయ్ మనం ఇద్దరం అన్నదమ్ములం.. ఏదున్నా ఇద్దరం సమానంగా పంచుకుందాం.. అందులో భాగంగా పొలం నాకు పుట్ర నీకు.. నగ నాకు నట్రా నీకు.. పాడి పంట నాకు పేడ పెంట నీకు... ఆస్తి నాకు.. పాస్తి నీకు .. ఇలా వాటాలు వేసేద్దాం.. చూసావా ఎక్కడా ఇందులో పక్షపాతం లేదు.. రెండూ సమానం. పెర్ఫెక్ట్ పంపిణీ అని అమాయకపు అన్నను మోసం చేసిన తమ్ముణ్ణి సినిమాల్లో చూసాం.. ఇప్పుడు రాజకీయాల్లో అచ్చం అలాంటి పంపిణీ జరుగుతోంది. చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ మధ్య సీట్ల పంపిణీ చూస్తుంటే అదే గుర్తొస్తోంది. 

గెలిచే సీట్లన్నీ తెలుగుదేశం తీసుకుని ఖచ్చితంగా ఓడిపోయే సీట్లు మాత్రం జనసేనకు తగలబెట్టేందుకు చంద్రబాబు పక్కా వ్యూహం పన్నారు. అందులో భాగంగా కాపు ఓటర్లను చూసుకుని రాజమండ్రి రూరల్‌పై కందుల దుర్గేష్‌ ఆశలు పెట్టుకుంటే అది కూడా టీడీపీకి ఇస్తున్నారు. దుర్గేష్‌కు నిడదవోలు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వేరే ఊరు వెళ్ళేది ఓడిపోవడం  కోసమే తప్ప అక్కడ అయన గెలిచేది లేదు. భీమిలిలో పంచకర్ల సందీప్‌ది ఇదే పరిస్థితి. చాలా కాలంగా సందీప్‌ కాపు ఓటర్లను చూసుకుని పవన్‌ కల్యాణ్‌ పేరిటి బోలెడుడబ్బులు ఖర్యు పెట్టాడు. అయితే అదంతా బూడిదలో పోసిన పన్నీరేనని చంద్రబాబు నిరూపిస్తూ భీమిలిని లాగేసుకున్నాడు. 

అనకాపల్లి మీద జనసేనకు కొంత హోప్స్ ఉన్నాయనే భ్రమలో ఇప్పటివరకూ పవన్‌ కల్యాణ్‌ ఉన్నాడు దాన్ని కూడా  టీడీపీ లాగేసుకుంది. గాజువాకలో సేమ్‌ టూ సేమ్‌ ఇదే పరిస్థితి. అక్కడ ఉన్న స్థానిక సంస్థల్లో 90 శాతం హవా వైఎస్సార్‌సీపీదే. 

ఈ నాలుగు తీసుకున్నాం కాబట్టి మీకు నాలుగు సీట్లు ఇస్తున్నాం అంటూ రాయలసీమలో నాలుగు సీట్లు పవన్ మొకాన పడేస్తున్నారు. రాయలసీమ అంటే  సీఎం వైఎస్‌ జగన్‌కు, వైఎస్సార్ కాంగ్రెసుకు బాగా పట్టున్న ప్రాంతం. గత ఎన్నికల్లో మొట్ట నాలుగుజిల్లాల్లోని 52  సీట్లలో 49 సీట్లు గెలిచి రొమ్ము విరుచుకుని నిలబడిన ప్రాంతమది. 

అక్కడ జనసేనకు నాలుగు సీట్లు ఇవ్వడం అంటే డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకెళ్లి తొడకొట్టడం వంటిదే... నిర్దాక్షిణ్యంగా పీకకోసి ..బొచ్చు పీకి బిర్యానీ వండుకుని తినేస్తారు. అందుకే చంద్రబాబు కూడా ఎలాంటి ఆలోచన లేకుండా తాము ఖచ్చితంగా ఓడిపోయే సీట్లన్నీ పవన్‌కు ఇచ్చేసి చూసావా.. ఇచ్చిన మాట ప్రకారం మీకు ఇరవైనాలుగు సీట్లు ఇచ్చాము.. ఇక మీ చావు మీరు చావండి అన్నట్లుగా ఒక మాట చెప్పి పంపేశారు.  ఇది కాకుండా ఓడిపోయే నెల్లిమర్ల వంటి సీట్ కూడా జనసేన చేతిలో పెట్టేసి బాబుగారు గొప్పోళ్ళు.. అందుకే నేను ఆయనవెంట నిలబడ్డాను అనే డైలాగ్స్ పవన్‌తో చెప్పించారు. చివరకు పవన్ కాస్తా చంద్రబాబుకు తాబేదారుగా మిగిలిపోవడం ఖాయం అని సైనికులు ఆవేదన చెందుతున్నారు. 

తాజాగా కాసేపటి క్రితం ఇద్దరి మధ్య జరిగిన భేటీలో సీట్ల పంపిణీ గురించి కూడా చర్చకు వచ్చింది. గతంలో జనసేనకు 24  ఎమ్మెల్యే.. మూడు ఎంపీ సీట్లు ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది అయితే వాటిలో ఏవేవి జనసేనకు ఇవ్వాలన్నది తేల్చలేదు. ఆ అంశం గురించి నేడు వారు చర్చించినట్లు తెలిసింది. అందులో భాగంగా పవనుకు ఇచ్చే సీట్లన్నీ ఏర్చి కూర్చి .చివరకు ఆయనను నిండా ముంచేసేలా చంద్రబాబు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది 

నువ్వు సెనగలు తీసుకురా.. నేను పొట్టు తీసుకొస్తాను.. ఇద్దరం కలిపేసి ఊదుకుని పంచుకుందాం అని చెప్పి... అయన తెచ్చిన సెనగలు రెండు వాటాలు వేసుకుని తినేసే రకం చంద్రబాబు... ఆయన్ను నమ్మితే ఏమవుతుందో పవనుకు మున్ముందు అర్థం అవుతుంది
 -సిమ్మాదిరప్పన్న 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement