
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడికి ప్రభుత్వం ఏంచేస్తుందో తెలుసుకోకుండా ఇష్టానుసారంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మాట్లాడటం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. కరోనాతో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతున్న విషయాన్ని జాతీయ మీడియాలో చూస్తే అర్ధమవుతుందన్నారు. మహమ్మారిపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుందో కేంద్రాన్ని అడగాలని సంజయ్‌కు హితవు పలికారు. ఒక్కసారి ఢిల్లీలో ఏం జరుగుతోందో చూడాలని, అక్కడ ప్రధానమంత్రి ఉన్నారు కదా అని ప్రశ్నించారు.
వైద్యారోగ్యశాఖలో డబ్బులు ఉన్నాయని సీఎం కేసీఆర్ ఆ శాఖను తీసుకున్నారని బండి అనడం దారుణమని, ఒక ఎంపీ ఇలా మాట్లాడడం బాధ్యతారాహిత్యమని, మీడియాతో మాట్లాడేటప్పుడు అన్ని చూసి మాట్లాడాలని హితవు పలికారు. ఈటల రాజేందర్ అంశంపై జరుగుతున్న పరిణామాలను బట్టి నిర్ణయాలు ఉంటాయని విలేకరులు అడిగిన ప్రశ్నకు తలసాని సమాధానం ఇచ్చారు. బాల్క సుమన్ మాట్లాడుతూ, సీఎంపై బండి సంజయ్ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీఎంకు కరోనా వచ్చినా రోజూ వైద్య కార్యదర్శి, హెల్త్ డిపార్ట్‌మెంట్‌తో మాట్లాడుతున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment