చెన్నై: ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో గవర్నర్ల వైఖరి రోజురోజుకీ వివాదాస్పదంగా మారుతుంది. పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లోని గవర్నర్లు, ప్రభుత్వాల మధ్య వైరం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
పంజాబ్, తమిళనాడులో బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్ల జాప్యంపై ఇప్పటికే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్లు నిప్పుతో చెలగాటం ఆడుతున్నారని.. వారికి ఆత్మపరిశీలన అవసరమని పేర్కొంది. ఇది తీవ్ర ఆందోళనకరమైన అంశమని పేర్కొన్న అత్యున్నత ధర్మాసనం.. అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులపై నిర్దేశిత సమయంలో నిర్ణయం తీసుకోవాలని గవర్నర్లను ఆదేశించింది.
తాజాగా తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ వివాదం మరో మలుపు తిరిగింది. సుప్రీంకోర్టు మొట్టికాయ వేసిన వారం రోజుల్లోనే గవర్నర్ ఆర్‌ఎన్ రవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. చాలా కాలంగా తన వద్ద పెండింగ్‌లో ఉన్న 10 బిల్లులను గవర్నర్ వెనక్కి పంపారు. వీటిలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్‌ను నియమించడంలో గవర్నర్‌కు ఉన్న అధికార పరిధిని తగ్గించడం ఒకటి అయితే గత అన్న డీఎంకే ప్రభుత్వంలోని మంత్రులను విచారించేందుకు అనుమతి కోరుతూ పంపిన బిల్లులు కూడా ఉన్నాయి.
గవర్నర్ చర్యపై శనివారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. గవర్నర్ ఆర్‌ఎన్ రవి తిప్పి పంపిన బిల్లులను మరోసారి అసెంబ్లీలో ఆమోదించి ఆయనకు పంపనున్నట్లు స్పీకర్ ఎం అప్పావు తెలిపారు. బీజేపీ నియమించిన గవర్నర్ ఉద్ధేశపూర్వకంగా బిల్లల ఆమోదంలో ఆలస్యం చేస్తున్నారని, ఇది ప్రజల ద్వారా ఎన్నికైన పాలనను అణగదొక్కడమేనని డీఎంకే ప్రభుత్వం విమర్శిస్తోంది. కాగా అంతకముందు కూడా గవర్నర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్) వ్యతిరేక బిల్లును సైతం వెనక్కి పంపిన విషయం తెలిసిందే.
చదవండి: 'ఐక్యమయ్యాం.. విజయం సాధిస్తాం: రాహుల్ గాంధీ
Comments
Please login to add a commentAdd a comment