
సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లా పంచాయతీ ఎన్నికల్లో చంద్రబాబు పరువు కాపాడేందుకు టీడీపీ మాజీ నేత.. ప్రస్తుత బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు రంగంలోకి దిగారు. అనధికారికంగా జిల్లా టీడీపీ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. సర్పంచ్ అభ్యర్థుల ఖర్చులు ఆయనే భరిస్తున్నారు. ఎన్నికల వ్యూహాలు, కుట్రలు, కుతంత్రాలన్నీ ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. నిజానికి.. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి ఈ జిల్లాలో అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి. మొదటి విడత ఎన్నికల్లో ఇది దాదాపు స్పష్టమైంది. రెండో విడత నుంచి ఆ పరిస్థితులు తలెత్తకూడదని చంద్రబాబు జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లా టీడీపీ నేతలు ఎన్నికల నిర్వహణకు పనికి రారని సదరు రాజ్యసభ సభ్యుడిని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.
కుప్పమే వారికి ప్రతిష్టాత్మకం
చిత్తూరు జిల్లాలో మిగిలిన నియోజకవర్గాలను పక్కనపెడితే.. చంద్రబాబుకి కుప్పం నియోజకవర్గం తలనొప్పిగా మారింది. ఇక్కడ నామినేషన్లు వేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో టీడీపీ పెద్దఎత్తున డబ్బు ఖర్చుచేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ప్రతి పంచాయతీలో నామినేషన్ వేయించడంతో పాటు, ఎన్నికల వ్యయం మొత్తం టీడీపీనే భరించడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. ఒక కుప్పం నియోజకవర్గంలో ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు చొప్పున ఖర్చు చేసేందుకు ఆ రాజ్యసభ సభ్యుడు ఏర్పాట్లుచేస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో ‘తమ’ అనుకున్న వారికే రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల చొప్పున ఇస్తున్నారు.
అంతా గోప్యమే..
మరోవైపు.. కుప్పంలో టీడీపీ మద్దతుదారునిగా ఏయే పంచాయతీలో ఎవరెవరు నామినేషన్ వేస్తారోనన్నది గోప్యంగా ఉంచుతున్నారు. ప్రత్యర్థిగా ఎవరు వేస్తున్నారో తెలుసుకుని, వారిపై వారిలోనే మరొకరిని బరిలోకి దింపేందుకు కూడా భారీగానే డబ్బులు వెచ్చిస్తున్నట్లు సమాచారం. ఆ వర్గంలో ఇద్దరు నామినేషన్లు వేస్తే.. ఓట్లు చీలిపోయి తమకు లబ్ధిచేకూరేలా పథకం వేస్తున్నారు. అంతేకాక.. ప్రత్యర్థి వర్గంలో చిచ్చుపెట్టేందుకూ ప్రణాళిక రచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment