పోలీసులతో మాజీమంత్రి అమర్నాథరెడ్డి వాగ్వాదం..
సాక్షి, తిరుపతి/అనంతపురం/పెనుకొండ/పలమనేరు (వి.కోట): వరుస ఓటములతో తీవ్ర పరాభవాల్ని మూటగట్టుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు కనీసం కుప్పం మున్సిపాల్టీలోనైనా పరువు నిలుపుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. అలజడులు సృష్టించి.. ప్రలోభాలకు గురిచేసైనా పార్టీని నిలబెట్టుకోవాలని కుట్రలు, కుతంత్రాలకు తెరలేపారు. ఇక్కడ అల్లర్లు సృష్టించి తద్వారా సానుభూతి ఓట్లు రాబట్టుకోవాలని పథక రచన చేశారు. ఇందులో భాగంగానే.. ప్రచారం ముగిశాక స్థానికేతరులందరూ కుప్పం నుంచి వెళ్లిపోవాలనే నిబంధన ఉన్నా టీడీపీ నేతలు దానిని ఏమాత్రం లెక్కచేయకుండా అక్కడే తిష్టవేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కూన రవికుమార్, పలమనేరుకు చెందిన మాజీమంత్రి అమర్నాథరెడ్డి, చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని, మరో 230 మంది స్థానికేతరులు కుప్పంలోనే మకాం వేశారు. ఓటుకు రూ.5 వేల నుంచి 10 వేల వరకు పంచుతున్నారు. తమ అసలు మొబైల్ ఫోన్లను పోలీసులు ట్రాక్ చేస్తారనే ఉద్దేశంతో తాత్కాలికంగా వేరే నెంబర్లతో తమ ప్రణాళికను అమలుచేస్తున్నారు. వీరందరి కొత్త నెంబర్లతో వాట్సప్ గ్రూప్ ఏర్పాటుచేశారు. దీనికి అడ్మిన్లుగా చంద్రబాబు, లోకేశ్ ఉంటూ ఎప్పటికప్పుడు ఏం చేయాలనే దానిపై వీరికి దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు.. ఓటర్లకు పెద్దమొత్తంలో డబ్బులు పంచేందుకు కూన రవికుమార్ ఆదివారం కుప్పానికి చేరుకున్నట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.
పోలీసులను అడ్డుకుంటున్న తెలుగు తమ్ముళ్లు
అడ్డుకున్నందుకు నానా యాగీ
ఇక మాజీమంత్రి అమర్నాథరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు పులివర్తి నాని కుప్పంలోకి వస్తుండగా పీఈఎస్ మెడికల్ కాలేజీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడే రోడ్డుపై బైఠాయించి రచ్చరచ్చ చేశారు. టీడీపీ నేతలను కొడుతున్నారంటూ అనుకూల మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయించారు. కుప్పం టీడీపీ నేతలు అక్కడకు చేరుకుని గొడవను మరింత పెద్దది చేసే ప్రయత్నం చేశారు. మాజీ జెడ్పీటీసీ రాజ్‌కుమార్ అయితే మరో అడుగు ముందుకేసి వైఎస్సార్‌సీపీ నేతలు ఇంటికొచ్చి తనపై దాడిచేశారంటూ హడావుడి చేశాడు. ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు కుప్పానికి వచ్చిన ఉద్యోగులను చంద్రబాబు పీఏ మనోహర్ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఉద్యోగులు టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసినట్లు తెలిస్తే కచ్చితంగా ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం.
పెనుకొండలో బరితెగింపు
అనంతపురం జిల్లా పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికల్లోనూ టీడీపీ ఆగడాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఎలాగైనా ఇక్కడ గెలవాలన్న ధ్యేయంతో విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారు. సోమవారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రలోభాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ కీలక నేతలు పెనుగొండ చుట్టుపక్కల మకాం వేసి మద్యం, డబ్బు పంపిణీని పర్యవేక్షిస్తున్నారు. కర్ణాటక నుంచి భారీ ఎత్తున మద్యం తెప్పించి రహస్య ప్రాంతాల్లో నిల్వచేశారు. అలాగే, ఇప్పటికే విచ్చలవిడిగా మద్యంతోపాటు ఒక్కో ఓటుకు రూ.3వేల నుంచి రూ.4వేల వరకు పంచారు. అయినా.. చాలాచోట్ల కనీస పోటీ కూడా ఇవ్వలేకపోతున్నామని గ్రహించిన ఆ పార్టీ నేతలు రెండోసారి డబ్బు పంపిణీకి పూనుకున్నారు. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా కూడా నగదును బదిలీ చేస్తున్నారు.
ఇక ప్రతీ ఇంటికీ ముక్కు పుడకలు కూడా అందించినట్లు తెలిసింది. ఆదివారం మరింత ఎక్కువగా ఈ ప్రలోభాలను కొనసాగించారు. ఇలా నిబంధనలను ఉల్లంఘించిన పార్టీ నేతలు బీకే పార్థసారథి, పల్లె రఘునాథరెడ్డి, పరిటాల శ్రీరామ్ మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప చెప్పారు. మరికొందరు నేతలపైనా ఇలాగే కేసులు నమోదు చేశామని.. ఎవరైనా హద్దు మీరితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మరోవైపు.. చిలమత్తూరు జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ సోమఘట్ట గ్రామంలో వలంటీర్లను బెదిరించారు. అలాగే, వైఎస్సార్‌సీపీ నేత నసనకోట ముత్యాలును ‘నువ్వెందుకురా ఇక్కడికొచ్చావ్.. చంపుతా’ అంటూ కాలర్ పట్టుకుని బెదిరించారు.
Comments
Please login to add a commentAdd a comment