సాక్షి,అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను జీర్ణించుకోలేక చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గాడిదలు కాస్తున్నారా’ అన్న లోకేశ్ ప్రశ్నకు స్పందిస్తూ.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటినుంచి రాష్ట్రంలో బరితెగించి తిరుగుతున్న రెండు పెద్ద అడ్డ గాడిదలను కాస్తున్నారని చెప్పారు. వాటిలో ఒకటి చంద్రబాబు కాగా.. రెండోది లోకేశ్ అని ఎద్దేవా చేశారు. వాటి బారినుంచి రాష్ట్రాన్ని జగన్ కాపాడుతున్నారని పేర్కొన్నారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఈవీఎంల వల్ల మోసం జరిగిందని మాట్లాడిన చంద్రబాబుకు బ్యాలెట్ పేపర్లతోనూ ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు.
‘చంద్రబాబు పుత్రరత్నం లోకేశ్ విశాఖలో మాట్లాడిన మాటలు వింటే నవ్వొస్తోంది. ఇలాంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాడని కొంత బాధ కూడా కలుగుతోంది. ప్రపంచంలోనే పేరొందిన స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నానని చెప్పుకునే లోకేశ్, అక్కడ చదివి నేర్చుకున్న సంస్కారం ఇదేనా’ అని ప్రశ్నించారు. దుష్ప్రచారం, అవాస్తవాలు, అబద్ధాలు, కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో నీచ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు, లోకేశ్ లాంటి రెండు గాడిదల నుంచి ప్రజలను రక్షించేందుకు తమ ప్రభుత్వం కాపలా కాస్తోందన్నారు.
‘విశాఖ ఉక్కు.. రాష్ట్ర ప్రజలందరి హక్కు’
విశాఖ ఉక్కు.. మన హక్కు అని, దానిని కాపాడుకునేందుకు వైఎస్సార్‌సీపీ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోందన్నారు. స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణకు ఎప్పుడు బీజం పడిందో ప్రజలంతా తెలుసుకోవాలన్నారు. ఫ్యాక్టరీలో పెట్టుబడులు ఉపసంహరిస్తూ 2017లో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఒక ప్రకటన చేశారని, 2017లో చంద్రబాబు భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ ప్రభుత్వమే ఇలా చేస్తే కనీసం ఒక్క ఉత్తరమైనా కేంద్రానికి ఎందుకు రాయలేదని చంద్రబాబును నిలదీశారు. అప్పట్లో ఆశోక్ గజపతిరాజు కేంద్రంలో మంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు.
పోస్కో ప్రతినిధులను చంద్రబాబు కలిసింది నిజం కాదా
పోస్కో సంస్థ ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిస్తే దాన్ని వక్రీకరిస్తున్నారని అప్పిరెడ్డి పేర్కొన్నారు. 2017 డిసెంబర్ 4, 5, 6 తేదీల్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు దక్షిణ కొరియా వెళ్లి.. పోస్కో ప్రతినిధులను కలిశారని గుర్తు చేశారు. అప్పట్లో పోస్కో సంస్థతో చంద్రబాబు చేసుకున్న రహస్య ఒప్పందం ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నెల 18న రాష్ట్రవ్యాప్త ఆందోళనకు టీడీపీ పిలుపునివ్వడం వల్ల ప్రయోజనం లేదని.. ఈ ఆందోళనల కన్నా బలంగా, దృఢంగా, ఆరోగ్యంగా ఉన్న లోకేశ్ ఆమరణ దీక్ష చేస్తే మంచిదని సలహా ఇచ్చారు. విశాఖ ఉక్కుపై జగన్ సర్కారు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూ కొన్ని సూచనలు కూడా చేసిందన్నారు. స్టీల్ ప్లాంట్ సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment