కృష్ణా, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీ అరాచక కాండ కొనసాగుతోంది. శుక్రవారం కూడా వైఎస్సార్‌సీపీ శ్రేణుల్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడింది. మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీల ఇళ్లపై దాడులకు యత్నించింది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
తెలుగు యువతకు చెందిన కొందరు నాయకులు.. శుక్రవారం మధ్యాహ్నాం కొడాలి నాని ఇంటిపైకి రాళ్లు, గుడ్లు విసిరారు. ఆపై టపాసులు కాల్చి నానా హంగామా చేశారు. ఇంటిలోకి చొచ్చుకునిపోయే ప్రయత్నమూ చేశారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు.. వాళ్లను అడ్డుకుని అక్కడి నుంచి పంపించే యత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులతోనూ వాళ్లు వాగ్వాదానికి దిగారు.
కృష్ణాజిల్లా గుడివాడలో మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటిపై దాడి..
ఇంటి లోపలకి చొరబడే ప్రయత్నం చేసిన టీడీపీ గుండాలు.#TDPGoons pic.twitter.com/yDo1iT7yql— YSR Congress Party (@YSRCParty) June 7, 2024
ఇక.. విజయవాడలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటిపైనా దాడి జరిగింది. టీడీపీ గుండాలు వంశీ ఉండే అపార్ట్‌మెంట్‌ను నలువైపులా చుట్టుముట్టి.. వాహనాల్లో అటు ఇటు తిరుగుతూ హల్ చల్ చేశారు. వంశీ ఉంటున్న ఫ్లోర్ వైపు రాళ్లు విసిరారు. ఈ దాడిలో పార్కింగ్‌లో ఉన్న ఆయన వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఆపై పోలీసులు రంగంలోకి దిగి టీడీపీ శ్రేణుల్ని చెదరగొట్టి.. చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. అయితే..
సీఆర్పీఎఫ్, పోలీస్ బలగాలు మోహరించినప్పటికీ.. టీడీపీ యువత మరోసారి వల్లభనేని వంశీ ఇంటి పైకి దూసుకొచ్చింది. ఈ క్రమంలో అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపైనా టీడీపీ గుండాలు దాడికి యత్నించారు. ఏసీపీ వాహనంతో పాటు మరో వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతో ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగి టీడీపీ రౌడీలను చెదరగొట్టాయి. ఆపై వంశీ ఇంటి వైపు ఎవరూ వెళ్లకుండా పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు.
ఇక విజయవాడలోనే గత అర్ధరాత్రి రాజీవ్ నగర్‌లోని వైఎస్సార్‌సీపీ నేత పెద్దిరెడ్డి శివారెడ్డి ఇంటి పై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడికి దిగారు. ఈ దాడిలో ఆయన కారు అద్ధాలు ధ్వంసం అయ్యాయి. ఇంటి బయట ఫర్నీచర్‌ను పూర్తిగా నాశనం చేశారు. ఆ సమయంలో ఇళ్ల నుంచి బయటకు వచ్చిన స్థానికులు.. భయంతో వణికిపోయారు. ఆపై శివారెడ్డిని చంపేస్తామంటూ బెదిరిస్తూ వాళ్లంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఈ ఉదయం టీడీపీ నేతల దాడిపై నున్న పోలీస్ స్టేషన్‌లో పెద్దిరెడ్డి శివారెడ్డి ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment