టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన కుటిల రాజకీయ ఎత్తుగడలను మళ్లీ తెరమీదకు తెస్తున్నారు. ఒకవైపు భాగస్వామ్య పక్షాల కోసం త్యాగాలు తప్పవని అంటూనే.. మరోవైపు వారి వెనుక గోతులు తవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. తెలుగుదేశం అభ్యర్థులు తిరుగుబాటు చేసి బరిలో నిలుస్తూ ఉంటే, పైపై బుజ్జగింపులతో వారిని పోటీ నుంచి తప్పించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు.
అయితే, ఈ బుజ్జగింపులు మొత్తం నాటకాలేనని, రహస్య సంకేతాలు, సందేశాలు, రహస్య దూతల ద్వారా వారికి ఆయన పుష్కలంగా ఆశీస్సులు అందజేస్తున్నారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. భాగస్వామీపక్షాలకు కేటాయించిన సీట్లలో తెలుగుదేశం తిరుగుబాటు అభ్యర్థులను దొంగ చాటుగా ప్రోత్సహిస్తూ, ఆ సీటు గెలుచుకుని మళ్లీ మన పార్టీలోకి వచ్చేయండి అని చంద్రబాబు వారికి రహస్యంగా సూచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రమైన పోటీ ఉన్న ఒకటి రెండు చోట్ల.. అనివార్యమైన పరిస్థితుల్లో ఒకరికి టికెట్ కట్టబెట్టినప్పటికీ రెండో నాయకుడు తిరుగుబాటు చేస్తుంటే చంద్రబాబు నిర్లిప్తంగా ఉన్నట్లుగా, చిత్తశుద్ధి లేని బుజ్జగింపులు చేస్తున్నట్లుగా వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే అనేక నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అతలాకుతలంగా ఉంది. అసంతృప్తులు, అసమ్మతులు భగ్గుమంటున్నాయి. పార్టీ ఆఫీసులలో విధ్వంసం జరుగుతోంది. ఐదేళ్లపాటు చాకిరీ చేయించుకున్న పార్టీ అధిష్టానం ఎన్నికల సమయం వచ్చేసరికి రిక్త హస్తం చూపించడంపై ఇన్నాళ్లు కష్టపడిన నాయకులు కుతకుతలాడిపోతున్నారు.
పిఠాపురం నియోజకవర్గం నుంచి తానే బరిలో ఉంటానని పవన్ కళ్యాణ్ ప్రకటించిన తర్వాత అక్కడ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న వర్మ వర్గీయులలో అసంతృప్తి రాజుకుంది. 2014 ఎన్నికలలో ఇండిపెండెంట్‌గా విజయం సాధించినంతటి సొంత బలం వర్మకు ఉంది. అదే 2019 ఎన్నికలు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి దిగిన వర్మ, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హవా ఎదుట నిలబడలేకపోయారు. ఓటమి తప్పలేదు. కానీ, అప్పటినుంచి ప్రజల్లో ఉంటూ పార్టీని కాపాడుకుంటూ పనిచేస్తూ వచ్చారు. ఇప్పుడు అభ్యర్థిగా పవన్ వస్తాడు అనేసరికి ఆ వర్గం భగ్గుమంటోంది.
చంద్రబాబు నాయుడు వర్మకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడినట్లు కూడా సమాచారం వస్తోంది. చర్చించడానికి ఉండవల్లిలో నివాసానికి రమ్మని చంద్రబాబు ఆహ్వానిస్తే.. కార్యకర్తలతో సమావేశం పూర్తయిన తర్వాత వస్తానని వర్మ సమాధానంగా చెప్పారు. పెనమలూరు నియోజకవర్గం పరిస్థితి కూడా గందరగోళంగా ఉంది. అక్కడ బోడే ప్రసాద్‌కు టికెట్ దక్కదని తేల్చి చెప్పేశారు.
మైలవరం సీటును వైసీపీ నుంచి కొత్తగా ఫిరాయించి వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్‌కి ఇవ్వాల్సి రావడంతో, దేవినేని ఉమామహేశ్వర రావును పెనమలూరుకు బదిలీ చేయాలని చంద్రబాబు కుట్ర. ఇన్నాళ్లు ఆ నియోజకవర్గంలో పనిచేసిన బోడే ప్రసాద్ ఇప్పుడు రగిలిపోతున్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యే బరిలో ఉంటానని.. ఇండిపెండెంటుగానైనా పోటీ చేస్తానని, విజయం సాధించి నియోజకవర్గాన్ని చంద్రబాబుకు కానుకగా ఇస్తానని ఆయన తన భక్తిని చాటుకుంటున్నారు.
బీజేపీకి జనసేనకు కేటాయించిన సీట్లలో తన పార్టీ వారు బరిలోకి దిగేలాగా చంద్రబాబు చేసిన వ్యూహరచన పాతది. కొన్ని సంవత్సరాల కిందట బీజేపీలోకి ప్రవేశించిన తెలుగుదేశం నాయకులు, పులవర్తి రామాంజనేయులు తరహాలో ఇప్పుడిప్పుడే జనసేనలో చేరుతున్న నాయకులు అభ్యర్థిత్వాలను దక్కించుకుంటున్నారు. ఆ మొదటి వ్యూహం పూర్తయిన తర్వాత, రెండో వ్యూహాన్ని చంద్రబాబు కార్యరూపంలో పెడుతున్నారు. తమ పార్టీకి చెందిన కొందరిని ఇండిపెండెంట్లుగా బరిలోకి దించుతున్నారు. వారికి తన ఆశీస్సులు ఉంటాయని రహస్య దూతల ద్వారా తెలియపరుస్తున్నారు.
పవన్ కళ్యాణ్ పార్టీ గెలిచే సీట్లు తన ప్రభుత్వానికి అవసరం కానీ, ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రభుత్వంలో తలనొప్పిగా మారుతారని, తన కొడుకును వారసుడిగా సీఎం కుర్చీ మీద కూర్చోబెట్టడానికి అడ్డు తగులుతారనే భయం చంద్రబాబులో ఉంది. అందుకే పిఠాపురం నియోజకవర్గంలో వర్మను బుజ్జగిస్తున్నట్లుగా నటిస్తూ, ఇండిపెండెంటుగా పోటీ చేయడానికి ఆయనే ఎగదోస్తున్నారని అభిప్రాయం పలువురిలో కలుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా అనేక నియోజకవర్గాలలో ఇలాంటి కుటిల వ్యూహాలతో చంద్రబాబు మిత్ర పక్షాల అభ్యర్థులను కూడా తనకు అలవాటు అయిన దారిలో వెన్నుపోటు పొడవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
- వంశీకృష్ణ
Comments
Please login to add a commentAdd a comment