సాక్షి, అమరావతి: అసలు ఆ జీవోలో తప్పేమయినా ఉందా? రోడ్లపై సభలు, సమావేశాలను వద్దనటం మంచిదా... చెడ్డదా? అది కూడా కావాలని ఇరుకు రోడ్లో సభ నిర్వహించడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయాక... అటువంటి సంఘటనలు ఇక పునరావత్తం కాకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు కదిలి ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయటం సమంజసం కాదని అనగలమా? ఇవేమీ ఒక పార్టీనో, ఒక నాయకుడినో దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన ఉత్తర్వులు కాదు కదా?!. రోడ్లపై సభలు పెట్టకూడదన్నది అన్ని పార్టీలకూ, అందరు నాయకులకూ సమానంగా వర్తించే అంశం. ఇది తప్ప వేరే కార్యక్రమాలేమైనా రోడ్లపై చేసుకోవాలంటే దానికి పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకుంటే చాలని ఆ ఉత్తర్వుల్లోనే ఉంది.
మరిప్పుడు దేన్ని తప్పు బడుతున్నారు? రోడ్లపై సభలు, సమావేశాలు వద్దనటాన్నా? లేక మిగతా కార్యక్రమాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలనటాన్నా? వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి దురుద్దేశాలు ఆపాదిస్తూ దుష్ప్రచారానికి దిగుతున్నారనేది మరోసారి తేటతెల్లం కావటం లేదా? ఇన్ని మరణాలు సంభవించాక కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోకుండా ఉంటే చంద్రబాబుకు వంత పలికే ఇతర ప్రతిపక్ష పార్టీలు, మీడియా దీన్ని ఆక్షేపించకుండా ఉంటాయా? రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజల భద్రతతో ఏమాత్రం సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఏమనుకోవాలి? ఇరుకు రోడ్డులోకి కావాలని వాహనాన్ని పోనిచ్చి సభ నిర్వహించి, 8 మంది ప్రాణాలు బలితీసుకున్న ప్రతిపక్ష నాయకుడిలో కాస్తయినా పశ్చాత్తాపం కనిపించాలి కదా? పదుల సంఖ్యలో జనం గాయపడినా కూడా ఏ మాత్రం బాధపడకుండా రోడ్లపై మరో సభకు తయారై... దాన్ని ఎందుకు అడ్డుకుంటారంటూ రభస చేయటం సరైనదేనా?
ఎందుకిచ్చారు ఈ జీవో..?
ప్రతిపక్షాల గొంతునొక్కేందుకే ప్రభుత్వం ఈ జీవో జారీ చేసిందంటూ టీడీపీ చేస్తున్న ప్రచారంలో అక్షరం కూడా నిజం లేదన్నది యథార్థం. ఎందుకంటే చంద్రబాబు నాయుడి పబ్లిసిటీ దాహంతో నెల్లూరు జిల్లా కందుకూరులో రోడ్డుపై నిర్వహించిన సభలో 8 మంది దుర్మరణం చెందారన్నది విస్మరించలేని విషాదం. నాలుగు రోడ్ల కూడలిలో కాస్త విశాలమైన ప్రాంతంలో సభ నిర్వహిస్తామని ముందుగా అనుమతి తీసుకున్న చంద్రబాబు... కేవలం తన సభకు వచ్చిన జనాన్ని తక్కువ మందిని కూడా రద్దీరద్దీగా బీభత్సమైన స్థాయిలో చూపించాలన్న వ్యూహాన్ని ఎంచుకున్నారు. అందుకోసం డ్రోన్లతో షూటింగ్‌కు సిద్ధమయ్యారు. తీరా సభా స్థలమయిన ఎన్టీఆర్ సర్కిల్‌కు వచ్చేసరికి జనం అనుకున్నంతగా లేరని భావించారు.
ఆ విశాలమైన రోడ్లోంచి తన వాహనంతో సహా కాన్వాయ్‌ని మరో 50–70 మీటర్లు ముందుకు... ఇరుకు రోడ్లోకి పోనిచ్చారు. ఇరుకు రోడ్డులో ఫ్లెక్సీలు కట్టడంతో మరింత కుదించుకుపోయింది. అన్ని వాహనాలు అంత చిన్న రోడ్లోకి దూసుకు రావటంతో... అప్పటిదాకా అక్కడ నిల్చుని ఉన్న జనం వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో కొందరు కింద పడిపోయారు. వారిని తొక్కుకుంటూనే మిగిలిన వారు వెనక్కి వెళ్లారు. దీంతో దాదాపుగా ఎనిమిది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇరుకు రోడ్లో తక్కువ జనం వచ్చినా... పై నుంచి డ్రోన్లతో షూట్ చేస్తే భారీగా వచ్చినట్లు కనిపిస్తారని, దాన్నే ప్రచారానికి వాడుకోవచ్చని బాబు వేసిన వ్యూహం బెడిసికొట్టడమే ఈ నిండు ప్రాణాలను బలితీసుకుందని చెప్పటానికి వేరే ఏమీ అక్కర్లేదు.
అసలు ఆ జీవోలో ఏముంది?
ఇదిగో... ఈ సంఘటన నేపథ్యంలోనే ప్రజల ప్రాణాలను కాపాడటం తన బాధ్యతగా భావించి ప్రభుత్వం జీవో నెంబర్–1 జారీ చేసింది. పబ్లిసిటీ కోసం ఇరుకు రోడ్లలో జనాన్ని షూట్ చేసి.. మరిన్ని మరణాలకు కారణమయ్యే సంఘటనలేవీ జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ జీవో జారీ చేసింది. అయితే ఈ జీవోలో... సభలు నిర్వహించకూడదని ఎక్కడా చెప్పలేదు. కేవలం రోడ్లపై మాత్రమే నిర్వహించవద్దని పేర్కొన్నారు. మైదానాలు, ఇతర ప్రత్యామ్నాయ ప్రదేశాల్లో సభలు నిర్వహించుకోవచ్చు. అందుకోసం గ్రామ, మండల, మునిసిపాలీటీల పరిధిలో ప్రత్యామ్నాయ ప్రదేశాలను గుర్తించాలని కూడా అధికార యంత్రాంగాన్ని స్వయంగా ప్రభుత్వమే ఆదేశించింది. అంటే ఏదైనా గ్రామంలో గానీ పట్టణంలో గానీ రోడ్లపై మాత్రమే సభలు నిర్వహించకూడదు. అక్కడి కాలేజీ మైదానాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించుకోవచ్చు.
అందుకు దరఖాస్తు చేస్తే పోలీసులు అనుమతిస్తారు. కాబట్టి ప్రభుత్వం జారీ చేసిన జీవో సభల నిర్వహణకు ఏ విధంగానూ అడ్డంకి కాదు. వీటన్నిటికీ తోడు... రోడ్లపై సభలు వద్దన్న నిబంధనకు అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం మినహాయింపులిచ్చింది. ప్రత్యేక పరిస్థితుల్లో సభలు నిర్వహించాలని భావిస్తే అందుకు కారణాలను వివరిస్తూ జిల్లా ఎస్పీ/ పోలీస్ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. సభ నిర్వహించే సమయం, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, హాజరయ్యే జనం, ఇతర ఏర్పాట్ల వివరాలను తెలియజేస్తూ దరఖాస్తు చేయాలి. వాటిని పరిశీలించి పోలీసులు సంతృప్తి చెందితే సభ నిర్వహణకు షరతులతో అనుమతినిస్తారు. అనుమతి కోసం పేర్కొన్న షరతులకు విరుద్ధంగా సభను నిర్వహిస్తే మాత్రం నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment