సాక్షి, అమరావతి: ఆర్థిక వ్యవహారాల్లో గత చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పులు ఇప్పుడు రాష్ట్రానికి శాపాలుగా పరిణమించాయి. అప్పట్లో బాబు ప్రభుత్వం పరిమితికి మించి చేసిన అప్పులు ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక అవసరాలకు అడ్డు పడుతున్నాయి. రాష్ట్ర భవిష్యత్తును ఏమాత్రం పట్టించుకోకుండా చివరి మూడేళ్లు ఆ ప్రభుత్వం అప్పులు తెచ్చింది. అందులోనూ కేంద్రం ఇచ్చిన అనుమతికి మించి అప్పులు తెచ్చింది. అప్పట్లో ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన చంద్రబాబు, ఆయన తానా అంటే తందానా అనే దుష్ట చతుష్టయం అప్పులపై గగ్గోలు పెడుతున్నాయి. వీరి వ్యవహారంపై ఆర్థిక నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దొంగే.. దొంగా దొంగా అని అరిచినట్లు ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు.. కేంద్రం ఇచ్చిన అనుమతికి మించి అప్పులు చేశారు. ఇప్పుడు ఆ అప్పులు రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం చివరి మూడు ఆర్థిక సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ అనుమతికి, 14వ ఆర్థిక సంఘం సిఫార్సులకు మించి ఏకంగా రూ.17,932.94 కోట్లు ఎక్కువగా అప్పు చేసింది. బాబు హయాంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో మూడు శాతానికి మించి అప్పులు చేయరాదని 14వ ఆర్థిక సంఘం, కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం హయాంలో ఏ ఆర్థిక సంవత్సరంలోనూ 3 శాతానికి లోపు అప్పులను పరిమితం చేయలేదు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.95 శాతం నుంచి 4.52 శాతం వరకు ఎక్కువగా అప్పులు చేశారు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వం పరిమితికి మించి ఏకంగా రూ.8,204.13 కోట్లు అప్పు చేసింది.
అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అనేక సమయాల్లో వచ్చే ప్రభుత్వానికి అప్పులు కూడా పుట్టకుండా మేమే అప్పులు చేశామని చెప్పడం కూడా అందరినీ విస్మయానికి గురిచేసింది. ఇలా చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులను ప్రస్తుత ప్రభుత్వ హయాంలో సర్దుబాటు చేస్తామని, ఆ మేర ఇప్పుడు మూడు ఆర్థిక సంవత్సరాల్లో అప్పులను తగ్గిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. దీంతో ప్రస్తుత ప్రభుత్వంలో నిబంధనల మేరకు, అనుమతి మేరకు తీసుకోవాల్సిన అప్పుల్లో కోతపడుతోంది. దీని ప్రభావం ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై పడుతోందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.
బాబు ప్రభుత్వం తీసుకున్న అప్పులను ఇప్పటి అప్పుల్లో మినహాయిస్తే బడ్జెట్ వ్యయానికి కూడా నిధులు తగ్గిపోతాయని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. చంద్రబాబు హయాంలో పరిమితికి మించి చేసిన అప్పులను 14వ ఆర్థిక సంఘం కాలవ్యవధిలోనే క్రమబద్ధీకరించాలని, 15వ ఆర్థిక సంఘం కాల వ్యవధిలో క్రమబద్ధీకరించవద్దని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ప్రస్తుతం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 4.5 శాతం మేర అప్పులు చేయడానికి అనుమతి ఉంది. అయితే అప్పట్లో చంద్రబాబు సర్కారు చేసిన అధిక అప్పులు ఇప్పుడు రాష్ట్రానికి గుదిబండలా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment