
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో అందరికీ సీట్లు ఇవ్వలేనని, చాలామంది నాయకులు త్యాగాలకు సిద్ధం కావాలంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో టీడీపీలో హాహాకారాలు మిన్నంటుతున్నాయి. పోటీకి సిద్ధమైన నాయకులు ఇప్పుడు ఏం చేయాలో తోచక గగ్గోలు పెడుతున్నారు. పొత్తుల కోసం పాకులాడుతూ తమ గొంతు కోస్తున్నారని పలువురు నేతలు బహిరంగంగానే చంద్రబాబుపై ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ న్యాయం చేస్తామని చెప్పడంపై మండిపడుతున్నారు. అన్ని సీట్లు వదులుకున్నాక ఇక అధికారం ఎలా వస్తుందని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు 50కిపైగా ఎమ్మెల్యే, మూడు ఎంపీ స్థానాలు, బీజేపీకి 25 ఎమ్మెల్యే, ఏడు ఎంపీ స్థానాలు ఇవ్వక తప్పదని టీడీపీలో పది రోజులుగా చర్చ జరుగుతోంది.
మొత్తం 75 ఎమ్మెల్యే, పది ఎంపీ స్థానాలను టీడీపీ ఆ రెండు పార్టీలకు వదిలేయాల్సిన పరిస్థితి నెలకొంది. మిగిలిన వంద ఎమ్మెల్యే, 15 ఎంపీ స్థానాల్లో మాత్రమే టీడీపీ పోటీ చేయాల్సి ఉంటుంది. వాటిలోనే నేతలు సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే విషయాన్ని చంద్రబాబు శుక్రవారం రాత్రి టెలీకాన్ఫరెన్స్‌లో నాయకులందరికీ స్పష్టంగా చెప్పారు.
మానసికంగా సిద్ధం చేస్తున్న బాబు
సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు బహిరంగంగా మాట్లాడకుండా గుంభనంగా వ్యవహరిస్తున్నారు. జనసేనతో పొత్తు గురించి పలు సందర్భాల్లో ప్రస్తావించినా... సీట్లపై నోరు మెదపలేదు. పొత్తు కోసం ఢిల్లీ వెళ్లి అమిత్‌షా శరణు కోరిన తర్వాత బీజేపీ ఎన్ని సీట్లు అడిగితే అన్ని ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. టీడీపీ నేతలను మానసికంగా సిద్ధం చేసేందుకు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి తొలిసారి సీట్ల సర్దుబాటు గురించి చర్చించారు. పొత్తుల వల్ల అందరికీ సీట్లు ఇవ్వడం కుదరదని, సర్దుకుపోవాలని బాంబు పేల్చారు.
చంద్రబాబు వ్యాఖ్యలతో టీడీపీ నేతలు ఒక్కసారిగా డీలా పడిపోయారు. జిల్లాల వారీగా ఎవరి సీట్లు ఎగిరిపోయే జాబితాలో ఉన్నాయో ఆరా తీస్తూ భగ్గుమంటున్నారు. బీజేపీ, జనసేనకు అన్ని సీట్లు ఇవ్వడానికి ఎలా ఒప్పుకున్నారని వాపోతున్నారు. చంద్రబాబు తాను, తన కుటుంబ ప్రయోజనాల కోసం పార్టీని పణంగా పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీని బీజేపీ కాళ్ల కింద పెడుతున్నారని, ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి, చంద్రబాబు నడుపుతున్న పార్టీకి సంబంధం లేదని కృష్ణా జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.
సీనియర్లకు ఎసరు..
సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తానని గతంలో చంద్రబాబు హామీ ఇవ్వటాన్ని సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పదేపదే మీడియా ఎదుట ప్రస్తావిస్తున్నారు. తన సీటుకు ఢోకా లేదని ఆయన చెప్పుకుంటున్నా... జనసేనకు కేటాయించి బుచ్చయ్యకు చంద్రబాబు ఝలక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
పలువురు మాజీ మంత్రుల సీట్లు కూడా ఎగిరిపోయే జాబితాలో ఉన్నాయి. భూమా అఖిలప్రియ, గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆలపాటి రాజా, బొండా ఉమా తదితర నేతల సీట్లు గల్లంతు కానున్నాయి. ఎన్నో ఏళ్లుగా తాము పోటీ చేస్తున్న స్థానాలను వేరే పార్టీకి ఇవ్వడం తగదని సీనియర్ నేతలు వాపోతున్నారు.
ఎన్నారై నేతల ఆందోళన
సీట్లు ఆశ చూపించి కొందరు ఎన్నారై, పారిశ్రామికవేత్తలను రంగంలోకి దించిన చంద్రబాబు వారితో నియోజకవర్గాల్లో భారీగా ఖర్చు చేయించారు. విజయవాడలో కేశినేని చిన్ని, గుంటూరులో ఉయ్యూరు శ్రీనివాస్, భాష్యం ప్రవీణ్, కాకినాడలో సానా సతీశ్, నెల్లిమర్లలో బంగర్రాజు తదితరులను పార్టీ కోసం వాడుకున్నారు. వారంతా ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని నిలదీస్తున్నారు. ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడి డబ్బులు ఖర్చు చేశామని, ఇప్పుడు తమను నట్టేట ముంచవద్దని వేడుకుంటున్నారు.
ఒంటరి పోరుకు ససేమిరా..
పొత్తులు లేకపోతే పార్టీ ఉనికే ప్రశ్నార్థకమవుతుందంటూ నేతలను చంద్రబాబు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం వైఎస్ జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోవడం అసాధ్యమని, బీజేపీ, జనసేన పార్టీలను కూడగడితేగానీ తలపడలేమని స్పష్టం చేస్తున్నారు. టీడీపీ నేతలు మాత్రం అధినేత అభ్యర్థనను ఆలకించేందుకు నిరాకరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment