సాక్షి, విశాఖ: ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ సమయం ముగిసింది. కేవలం రెండు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. వైఎస్సార్‌సీపీ నుంచి బొత్స సత్యనారాయణ నామినేషన్ వేయగా, ఇండిపెండెంట్‌గా షేక్ సఫి ఉల్లా నామినేషన్ వేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నుంచి టీడీపీ తప్పుకుంది.
ఇక విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి బొత్స సత్యనారాయణ గెలుపు లాంఛనమైనట్లు తెలుస్తోంది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణను ధీటుగా ఎదుర్కొనే సత్తా లేకపోవడంతో పోటీ నుంచి అధికార టీడీపీ తప్పుకుంది. సరైన బలం లేకపోవడంతో ఎన్నికల్లో పోటీ చేయడం లేదని టెలీకాన్ఫరెన్స్‌లో పార్టీ నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు.
మంగళవారం నామినేషన్ గడువు చివరి రోజు కావడంతో అభ్యర్ధి పోటీపై విశాఖ టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానికేతురుడిని నిలబెట్టేందుకు పార్టీ నేతలతో చంద్రబాబు మంతనాలు జరిపారు. అయితే అందుకు పార్టీ నేతలు ఒప్పుకోలేదు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానికేతురుడిని ఎలా పెడతారని టీడీపీ నేతలు చంద్రబాబును ప్రశ్నించారు. కోట్లు రూపాయలు కుమ్మరించిన ఓడిపోవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం చేశారు. పారిశ్రామికవేత్తలకు సీట్లు ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. ఇప్పటికే స్థానికేతరులతో టీడీపీ నిండిపోయిందన్న టీడీపీ నేతల అభిప్రాయంతో చంద్రబాబు అంగీకరించారు. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్ట్ 6 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.
నేటితో నామినేషన్ల దాఖలుకు సమయం ముగిసింది. 14న స్క్రూటినీ, 16న ఉపసంహరణ, 30న పోలింగ్ జరగనుంది. సెప్టెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో ఈ ఎన్నిక జరుగుతుంది. అంటే విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్ సభ్యులు కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. సెప్టెంబరు 3వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.. సెప్టెంబరు 6వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.
విశాఖపట్నం జీవీఎంసీలో కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు ఓటు హక్కు వినియోగించుకుంటారు. మొత్తం 841 ఓట్లు ఉండగా.. అందులో వైఎస్సార్‌సీపీ బలం 615 ఉంటే.. టీడీపీ, జనసేన, బీజెపీకి కలిపి 215 ఓట్లు ఉన్నాయి.. అలాగే 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment