
టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పార్టీ ఇంచార్‌లు లేరట. చంద్రబాబు పిలుపునిచ్చిన కార్యక్రమాలను సైతం పట్టించుకునే దిక్కులేకుండా పోయిందని టాక్. నాయకులే లేకపోవడంతో అసలు పచ్చ జెండా పట్టుకునేవారే కరువయ్యారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అసలు అక్కడ ఏం జరుగుతోంది?
చిత్తూరు జిల్లా పూతలపట్టులో తెలుగుదేశం జెండా ఎగరేయాలని ఆ పార్టీ నాయకత్వం చాలా సంవత్సరాలుగా ఆశ పడుతోంది. 2009 నుంచి ఇప్పటివరకు అక్కడ టిడిపి జెండా ఎగరలేదు. గత ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీ చేసి ఓడిన మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి ఆ తర్వాత పచ్చ పార్టీకి గుడ్ బై చెప్పారు. అప్పటినుంచి పూతలపట్టు నియోజకవర్గంలో టిడిపి ఇన్చార్జినే నియమించలేదు. మాజీ మంత్రి, టిడిపి నేత గల్లా అరుణకుమారి ఈ నియోజకవర్గానికి చెందినవారే. ఆమె కుటుంబానికి పూతలపట్టు నియోజకవర్గంలో అనేక ఫ్యాక్టరీలు ఉన్నాయి. అయితే ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కావడంతో గల్లా కుటుంబం కూడా పట్టించుకోవడం మానేసింది.
ఈ నియోజకవర్గంలో నాలుగేళ్ళుగా పచ్చ జెండా పట్టుకునేవారే కరువయ్యారు. ఉన్నవాళ్ళలో కొంతమంది ఇన్చార్జి పదవి ఆశిస్తున్నా వాళ్లకు చంద్రబాబు ఓకే చెప్పడంలేదు. ఈ టాపిక్ మీదే ఇప్పుడు పూతలపట్టు టీడీపీలో చర్చ జరుగుతోంది. ఇన్చార్జి లేకపోతే పార్టీ కార్యక్రమాలు ఎలా జరుగుతాయని పచ్చ కార్యకర్తలు చర్చించుకుంటున్నారట. ఇన్చార్జి పదవి ఆశిస్తున్న వారిలో సప్తగిరి ప్రసాద్, సప్తగిరి, ముత్తులతోపాటు తిరుపతికి చెందిన ఓ జర్నలిస్టు కూడా ఉన్నట్లు సమాచారం. తిరుపతికి చెందిన ఈ జర్నలిస్టు మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ద్వారా తన ప్రయత్నాలు చేస్తున్నారట.
ఇన్‌చార్జిగా ఎవరూ లేకపోవడంతో కార్యకర్తలు సైతం టీడీపీకి దూరం దూరంగానే ఉంటున్నారు. ఏమీ పట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. అధిష్టానం పిలుపునిచ్చే కార్యక్రమాలు చేపట్టాలంటే ఖర్చు భరించేది ఎవరంటూ పచ్చ కార్యకర్తలు చర్చించుకుంటున్నారట. పార్టీ పరిస్థితి ఇలాగే కొనసాగితే గత ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయని పసుపు కేడర్ ఆందోళన పడుతోంది. గడచిన మూడు ఎన్నికల్లో గెలవని పార్టీ రాబోయే ఎన్నికల్లో మాత్రం ఎలా గెలుస్తుందని వారిలో వారే ప్రశ్నించుకుంటున్నారు. అసలు పూతలపట్టులో టీడీపీ అనే పార్టీ ఉన్న విషయాన్నే ప్రజలు మర్చిపోయేట్టు ఉన్నారని ఆ పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు.
-నరేష్‌బాబు, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment