సాక్షి, అమరావతి: మలి విడత మున్సిపల్ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీకి ఘోర పరాభవం తప్పలేదు. ఇటీవల జరిగిన పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, తొలి విడత మున్సిపల్ ఎన్నికల్లో పరాజయం పాలైన టీడీపీ.. తాజా మున్సిపల్ ఎన్నికల్లోనూ ఘోర ఓటమి చవిచూసింది. దీంతో టీడీపీ ఓటమి సంపూర్ణమైందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు వేసిన ఎత్తులు, పన్నిన వ్యూహాలు పనిచేయలేదు. అసత్య ప్రచారం, సానుభూతి కోసం ఆడిన డ్రామాలు విఫలమయ్యాయి. తాజాగా ఒక కార్పొరేషన్, 12 మున్సిపాల్టీలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయింది.
దర్శి మున్సిపాల్టీలో మాత్రమే గెలిచింది. మరో రెండు చోట్ల పోటీ ఇవ్వగలిగింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోటా ఓడిపోయింది. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. అక్కడ 25 వార్డులకు ఆరింటిలోనే టీడీపీ గెలిచింది. చంద్రబాబుకు కంచుకోట అయిన కుప్పం తొలిసారి చేజారిపోవడం టీడీపీ శ్రేణులకు శరాఘాతంగా మారింది. చంద్రబాబే ఓడిపోతే ఇక పార్టీ పరిస్థితి ఏమిటనే చర్చ నాయకుల్లో మొదలైంది. సొంత నియోజకవర్గంలోనే గెలవలేని చంద్రబాబు తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో ఎలా గెలిపించగలరనే అనుమానాలు అన్ని వైపుల నుంచి వస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇష్టానుసారం నోరుపారేసుకున్న చంద్రబాబు.. తాజా ఫలితాల తర్వాత నోరు మెదపకుండా హైదరాబాద్ వెళ్లిపోయారు.
నెల్లూరులో టీడీపీకి అవమానం
నెల్లూరు కార్పొరేషన్‌లో 54 డివిజన్‌లలో ఒక్కటీ టీడీపీకి దక్కలేదు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీద రవిచంద్ర వంటి నేతలున్నా వైఎస్సార్‌సీపీకి పోటీ ఇవ్వలేక చేతులెత్తేశారు. గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గురజాల, దాచేపల్లిలో ప్రభావం చూపలేకపోయారు. టీడీపీ ఎమ్మెల్యే రామరాజు ప్రాతినిథ్యం వహిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నియోజకవర్గంలోని ఆకివీడు మున్సిపాలిటీలో జనసేన, బీజేపీతో కలిసి బరిలోకి దిగినా వైఎస్సార్‌సీపీకి పోటీ ఇవ్వలేకపోయింది. అక్కడ 20 వార్డులకు 4 వార్డుల్లో మాత్రమే అతి కష్టంమీద గెలవగలిగారు.
వైఎస్సార్ కడప జిల్లాలోని రాజంపేట, కమలాపురం మున్సిపాల్టీల్లో టీడీపీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. కమలాపురంలో 20 వార్డులకు 5, రాజంపేటలో 20 వార్డులకు 4 వార్డుల్లోనే గెలిచింది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో 20 వార్డులకు రెండు వార్డులే టీడీపీకి వచ్చాయి. కర్నూలు జిల్లా బేతంచర్లలో 20 వార్డులకు కేవలం ఆరింటిలో టీడీపీ గెలిచింది. అనంతపురం జిల్లా పెనుకొండలోనూ టీడీపీ భంగపడింది. మాజీ మంత్రి పరిటాల సునీత సొంత ప్రాంతమైన ఇక్కడ 20 వార్డులకు రెండే రెండు వార్డులు వచ్చాయి.
దక్కింది దర్శి ఒక్కటే
ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాల్టీ ఒక్కటే టీడీపీకి దక్కింది. అక్కడ 20 వార్డులకు 13 వార్డుల్లో టీడీపీ గెలుపొందింది. కృష్ణాజిల్లా కొండపల్లి మున్సిపాల్టీలో పోటీ ఇవ్వగలిగింది. అక్కడ 29 వార్డులకు 14 టీడీపీ, 14 వైఎస్సార్‌సీపీ గెల్చుకున్నాయి. ఇండిపెండెంట్ ఒకరు గెలిచారు. జగ్గయ్యపేటలో వైఎస్సార్‌సీపీకి టీడీపీ పోటీ ఇచ్చినా గెలవలేకపోయింది.
టీడీపీ ఓటమి సంపూర్ణం
Published Thu, Nov 18 2021 3:30 AM | Last Updated on Thu, Nov 18 2021 7:16 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment