తిరుపతి, సాక్షి: ఎన్నికల ప్రచారం నడుమ అందరినీ కలిసే పరిస్థితి ఉండట్లేదని.. దయచేసి పరిస్థితి అర్థం చేసుకోవాలని చేరికల కోసం వస్తున్న స్థానిక నాయకుల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరుతున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర గురువారం ఉదయం ఎనిమిదవ రోజు తిరుపతి జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి చేరికలు జరిగాయి.
ఎద్దల చెరువు వద్ద బస్సు యాత్రలో మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్టువర్ధన్ రెడ్డి పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరారు. సీఎం జగన్ విష్ణుకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములందరికీ YSRCP తరపున మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నా. అందరినీ కలిసే పరిస్ధితి కష్టం అనేది దయచేసి ఆలోచన చేయమని కోరుతున్నా..
.. ఎన్నికల ప్రచారం మధ్యలో ఉన్నాం కాబట్టి, వెళ్లాల్సిన రూటు ఇంకా చాలా ఉంది. నన్ను కలవలేకపోయామే అని బాధపడొద్దు. మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా.. ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ పేరు, పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను..
.. ఈ నెల 6వ తేదీన కావలిలో మేమంతా సిద్ధం సభ కూడా మీ పరిధిలోనే జరుగుతుంది. అప్పుడు మీ అందరినీ వీలైనంతవరకు నేను కలుస్తా. విష్టు దగ్గరుండి ఎంతమందిని వీలైతే అంతమందిని కలిపిస్తాడు’’ అని సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ చేరికల కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు, నెల్లూరు వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి కూడా హాజరయ్యారు.
కాగా, 2019లో నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేశారు విష్ణువర్ధన్ రెడ్డి. వారం రోజుల కిందట వైఎస్‌ఆర్‌సీపీలో చేరనున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ మధ్యలోనే ఆయన టీడీపీకి రాజీనామా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment