
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ త్వరలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఎల్.రమణ ప్రగతిభవన్‌కు వెళ్లారు. దీంతో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నాడనే వార్తలకు మరింత బలం చేకూరుతోంది. టీఆర్‌ఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ఎల్.రమణ ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ఇక తెలంగాణ తెలుగుదేశం శాసనసభాపక్షం(టీడీఎల్పీ) ఇటీవలే అధికార టీఆర్‌ఎస్ పక్షంలో విలీనం కాగా, ఎల్.రమణ కూడా గుడ్‌బై చెబితే రాష్ట్రంలో టీడీపీ పూర్తిగా కనుమరుగైనట్టేనని చెప్పవచ్చు.
టీఆర్‌ఎస్‌లో చేరికకు సంబంధించి పార్టీ నేతలు కొందరు రమణతో కొంతకాలంగా మంతనాలు సాగిస్తున్నారని సమాచారం. అయితే, తాజాగా ఈ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. దీనిపై రెండు మూడురోజుల్లోనే పూర్తి స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఎల్.రమణ అంటే సీఎం కేసీఆర్‌కు అభిమానం అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. చేనేత వర్గాలకు చాలా చేశాం.. ఇంకా చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రతిపాదనకు ఎల్.రమణ సానుకూలంగా స్పందించారని మంత్రి ఎర్రబెల్లి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment