దేవినేని ఉమా సతీమణితో మాట్లాడుతున్న చంద్రబాబు
సాక్షి, అమరావతి/భవానీపురం (విజయవాడ పశ్చిమ) : కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ పేరుతో తెలుగుదేశం పార్టీ హైడ్రామాకు తెరలేపింది. నిజ నిర్ధారణ పేరుతో అక్కడకు వెళ్లి హడావుడి చేసేందుకు ఆ పార్టీ నాయకులు విశ్వప్రయత్నం చేశారు. అక్కడ మైనింగ్ జరుగుతోందంటూ లేనిపోని ఆరోపణలతో ప్రజలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూశారు. ఈ క్రమంలోనే జి.కొండూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడి టీడీపీ నేతలు దళితులపై దాడిచేసే వరకూ వెళ్లింది. ఈ కారణాలతోనే దేవినేని ఉమాను పోలీసులు అరెస్టుచేశారు.
మీడియా హడావుడితో తరచూ ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడం ఉమాకు మొదటి నుంచి అలవాటైన విద్యగా ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. కానీ, ఈసారి అది బెడిసికొట్టి ఆయనే జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని జీర్ణించుకోలేక వ్యవహారం మొత్తాన్ని రాజకీయం చేసేందుకు చంద్రబాబు రంగంలోకి దిగారు. రగడ సృష్టించి ఏదో జరిగిపోతోందని ప్రజల్లో భ్రమలు కల్పించడానికి నిజనిర్ధారణ కమిటీ ముసుగులో వ్యూహం రచించారు. కానీ పోలీసులు ఈ పథకాన్ని ముందే పసిగట్టడంతో వారి ప్రయత్నం సఫలం కాలేదు.
టీడీపీ హయాంలోనే విచ్చలవిడి మైనింగ్
వాస్తవానికి టీడీపీ అధికారంలో ఉండగానే కొండపల్లి సహా మైలవరం నియోజకవర్గంలో దేవినేని ఉమా నేతృత్వంలో అనేకచోట్ల అక్రమ మైనింగ్ విచ్చలవిడిగా జరిగినట్లు అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. అధికారం కోల్పోయాక ఏమీ జరక్కపోయినా కొండపల్లి అటవీ ప్రాంతంలో తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించి రాజకీయంగా లబ్ధిపొందడానికి ప్రయత్నించారు. చివరికి ఈసారి దాన్ని మరింత రచ్చచేసి అలజడులు సృష్టించడానికి ప్రయత్నించి అభాసుపాలయ్యారు. ఇలా ఏ ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఉమా కుటుంబాన్ని పరామర్శించి అక్కడి నుంచి నేరుగా గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లి హైదరాబాద్ వెళ్లిపోయారు.
‘దళిత ద్రోహి చంద్రబాబు డౌన్ డౌన్, దేవినేని ఉమా అరాచకాలు నశించాలి, చంద్రబాబు గో బ్యాక్’ అంటూ ఫ్లకార్డులతో ఆందోళన చేస్తున్న వారిని అడ్డుకుంటున్న పోలీసులు
ఉమాపై కేసులు దుర్మార్గం : చంద్రబాబు
దేవినేని ఉమామహేశ్వరరావుపై కేసులు పెట్టడం దుర్మార్గమని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ నాయకులే దాడిచేసి రివర్స్ కేసు పెట్టడం దారుణమన్నారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో ఉమా కుటుంబసభ్యులను శనివారం ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎస్సీలపై దాడి చేశారంటూ దేవినేనిపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. కొండపల్లి బొమ్మల తయారీకి ఉపయోగించే చెట్లను కొట్టేస్తుండడంతో ఉమాతోపాటు టీడీపీ నేతలు అక్కడికి వెళ్లారని చెప్పారు. అక్రమ మైనింగ్ జరగకపోతే నిజనిర్ధారణ కమిటీని ఎందుకు అడ్డుకున్నారని బాబు ప్రశ్నించారు. డీజీపీ గౌతం సవాంగ్ ప్రవర్తన అన్యాయంగా ఉందన్నారు. ఈ దాడులకు టీడీపీ భయపడబోదన్నారు. టీడీపీతో పెట్టుకున్న వారు కాలగర్భంలో కలిసిపోయారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని.. రెండేళ్ల నుంచి వారిపై దాడులు పెరిగాయని చంద్రబాబు ఆరోపించారు. రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్‌ను అర్ధాంతరంగా ఎందుకు మార్చారని ఆయన ప్రశ్నించారు. అక్రమ మైనింగ్‌పై గవర్నర్ జోక్యం చేసుకోవాలని.. సీనియర్ అధికారులతో విచారణ కమిటీని ఏర్పాటుచేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
గొల్లపూడిలో చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న దళితులు
దళిత ద్రోహి చంద్రబాబు
గొల్లపూడిలో దేవినేని ఉమా కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు శనివారం చంద్రబాబు వస్తున్నారని తెలుసుకున్న స్థానిక దళితులు.. టీడీపీ నేతలు తమపై చేస్తున్న అరాచకాలపై ఆయనకు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. గొల్లపూడి పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. వారికి గ్రామంలోని బీసీలు మద్దతు పలికారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారంతా ప్లకార్డులు పట్టుకుని ‘దళిత ద్రోహి చంద్రబాబు డౌన్ డౌన్, దేవినేని ఉమా అరాచకాలు నశించాలి, చంద్రబాబు గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. ‘దాడికి గురైన దళితులను కాకుండా దాడిచేసిన వారిని పరామర్శించడానికి వెళ్తారా చంద్రబాబూ..?’ అంటూ వారు మండిపడ్డారు. ఒకానొక దశలో వారు ముందుకు చొచ్చుకు రావడంతో, పోలీసులు బలవంతంగా వెనక్కి నెట్టడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
చంద్రబాబు అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలుసుకున్న పోలీసులు రెండు గంటల తర్వాత వారిని వెనక్కి పంపించేశారు. అనంతరం.. గ్రామానికి చెందిన దళిత నాయకులు కేతేపల్లి కోటేశ్వరరావు (దావీదు), గేరా సుమన్‌కుమార్, యడవల్లి శారమ్మ, చీదెళ్ల రవి, నందిపాముల సత్యం తదితరులు మాట్లాడుతూ.. తమపై టీడీపీ నేతల దౌర్జన్యాలు, దూషణలు పెచ్చుమీరిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. టీడీపీ నేతల వరుస దాడులను చూస్తుంటే చంద్రబాబే వారిని ప్రోత్సహిస్తున్నారనే అనుమానం కలుగుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment