టీడీపీ నేతలు నిర్వహించిన సర్వేలో తమ వివరాలు తెలిపిన ఆదర్శనగర్ కాలనీ వాసులు
మార్టూరు: ప్రజలు ఎంత ప్రతిఘటించినా టీడీపీ నేతలు, కార్యకర్తలు తమ మోసాలను మాత్రం విడనాడటం లేదు. ‘మీకు మా పథకాలు వస్తాయి..’ అంటూ అమాయక ప్రజలకు మాయమాటలు చెబుతూ సర్వే పేరిట వారి వివరాలు సేకరించి తమ ఫోన్లలో నమోదు చేసుకుంటున్నారు. ఆ తర్వాత వారి ఫోన్‌లకు వచ్చిన ఓటీపీలు చెప్పాలని కోరుతున్నారు. దీంతో ఆందోళనకు గురవుతున్న ప్రజలు వారిని నిలదీస్తే పారిపోతున్నారు. తాజాగా ఇటువంటి ఘటన బాపట్ల జిల్లా మార్టూరు మండలం డేగరమూడి గ్రామంలో సోమవారం వెలుగులోకి వచ్చింది.
గ్రామస్తులు తన్నీరు రాజు, ముక్తిపాటి వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. డేగరమూడి గ్రామంలోని ఆదర్శనగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఆర్‌ఎంపీ విప్పర్ల బాలకృష్ణ టీడీపీ కార్యకర్త. అతను రెండు రోజులుగా మరో వ్యక్తితో కలిసి తమ కాలనీలో ఇంటింటికీ తిరుగుతూ మహిళలు, పెద్దవారిని కలిసి వారి కుటుంబ వివరాలు సేకరిస్తున్నారు. కాలనీ వాసుల సెల్‌ఫోన్‌లకు వచ్చిన ఓటీపీలు తెలుసుకుని తమ సెల్‌ఫోన్‌లలో నమోదు చేస్తున్నారు. ఇలా ఆది, సోమవారాలు రెండు రోజులలో 50కిì పైగా కుటుంబాల వివరాలు సేకరించారు.
ఈ విషయం స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకుడు జంపని వీరయ్య చౌదరి దృష్టికి రాగా, ఆయన స్థానికులతో కలిసి ఆదర్శనగర్ కాలనీకి వెళ్లి సర్వే చేస్తున్న టీడీపీ కార్యకర్తలను నిలదీశారు. దీంతో వారు బైక్‌తో పారిపోయారు. ఆ యువకులు ఏం వివరాలు అడుగుతున్నారని వీరయ్య చౌదరి స్థానికులను ఆరా తీయగా... ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్ గ్యారెంటీ’ పేరుతో వివరాలు అడిగారని, తమ కుటుంబ వివరాలు సెల్‌ఫోన్‌లో నమోదు చేసుకున్నారని తెలిపారు. దీనివల్ల తమకు ఏమైనా నష్టం జరుగుతుందా.. అని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో గ్రామానికి చెందిన తన్నీరు రాజు, అన్నం శ్రీను, మరికొందరు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment