తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో రోజురోజుకూ నైరాశ్యం పెరిగిపోతోంది. ఏ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారన్నదానిపై అందరిలోనూ సందేహం వ్యక్తమవుతోంది. పొత్తులపైనా నిర్దిష్ట నిర్ణయం జరగక దిగువ స్థాయి కేడర్ సతమతమవుతోంది. టికెట్‌పై స్పష్టత కొరవడడంతో సీనియర్లలోనూ నిరాసక్తత పెరిగిపోతోంది. అసలు ఎన్నికలు సమీపిస్తున్నా అభ్యర్థులెవరన్నది తేలకపోవడంతో ఎక్కడా ఆ హడావుడి మాత్రం కనిపించడం లేదు.
ఓ వైపు అధికార పార్టీ అభ్యర్థుల ఖరారు విషయంలో దూకుడుగా వ్యవహరిస్తుంటే తమ పార్టీ అధినేత మీనమేషాలు లెక్కించడం కార్యకర్తలను గందరగోళంలో పడేస్తోంది. మరోవైపు ప్రతి చోటా పొత్తు ధర్మం పేరుతో మిత్రపక్షమైన జనసేన అభ్యర్థుల హడావుడి వారిని తీవ్రంగా కలచివేస్తోంది. ఇప్పటికే జనంలోకి వైఎస్సార్‌సీపీ దూసుకుపోతూ... ప్రజల్లో విశ్వాసం కూడగడుతుంటే తాము మాత్రం ఏం చేశామో...
భవిష్యత్తులో ఏం చేస్తామో... చెప్పుకోలేక... డీలాపడిపోతోంది. దీనికి తోడు అప్పుడప్పుడు పెదబాబు... ఇటీవల చినబాబు చేసిన పర్యటనలకు ఖర్చులు పెట్టలేక టికెట్లు ఆశిస్తున్న నాయకులు చేతులెత్తేస్తున్నారు. తీరా ఏర్పాటుచేసిన సభల్లో వారి ప్రసంగాలు ఆకట్టుకోలేకపోవడం... సభలు వెలవెలబోవడంతో ఎక్కువమంది పార్టీ వీడే యోచనలో ఉన్నారు. – సాక్షి నెట్‌వర్క్
బత్తులకు ఉత్తచెయ్యేనా...
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం టీడీపీలో అభ్యర్థిత్వాల వ్యవహారం రోజుకోమలుపు తిరుగుతోంది. ఈ స్థానంలో తమ పార్టీ పోటీచేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో ఇప్పటివరకూ తనకే టికెట్ వస్తుందని ప్రచారం చేసుకున్న ఆ పార్టీ నేత బత్తుల బలరామకృష్ణకు తాజాగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి రూపంలో షాక్ తగిలేలా ఉంది. ఆయనకు కాకుండా జనసేనకు టికెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక అధినేత చంద్రబాబుతో తాడోపేడో తేల్చుకునేందుకు సుమారు 300 మంది టీడీపీ కార్యకర్తలతో కలిసి మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి వెళ్లడంతో పరిస్థితులు తారుమారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
విభేదాలు బట్టబయలు
శ్రీసత్యసాయి జిల్లాలో ఏ నియోజకవర్గం పరిశీలించినా.. వేరు కుంపట్లు కనిపిస్తున్నాయి. దీనిపై విసిగెత్తిపోతున్న కేడర్ టీడీపీకి టాటా చెబుతోంది. ఇప్పటికే చాలా గ్రామాల్లో టీడీపీ ఖాళీ అయ్యింది. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈ నెల 13, 14, 15 తేదీల్లో ఆ జిల్లాలో జరిపిన పర్యటనల్లో పార్టీ నాయకుల మధ్య గొడవలు వెలుగు చూడటం గమనార్హం.
పెనుకొండలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ బి.కె.పార్థసారథి కంటే సవితమ్మ ఎక్కువ హడావుడి చేశారు. మడకశిరలో దళితులను వెనక్కి నెట్టి.. గుండుమల తిప్పేస్వామి అన్నీ తానై వ్యవహరించడం విమర్శలకు దారి తీసింది. రాప్తాడులో పరిటాల శ్రీరామ్, పరిటాల సునీత హడావుడి చూసి శ్రీరామ్ ధర్మవరం వైపు ఎందుకొస్తున్నారంటూ చాలా మంది టీడీపీ వీడుతున్నారు. పుట్టపర్తిలో పల్లె రఘునాథరెడ్డికి వ్యతిరేకంగా ఒక వర్గం ఏకంగా ఎన్నికల ప్రచారమే చేస్తోంది.
వియ్యంకుల్లో ఒకరికేనట!
పల్నాడు జిల్లాలో టీడీపీ సీనియర్ నాయకులు జి.వి.ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్‌ల టికెట్ల కేటాయింపునకు బంధుత్వం అడ్డుగా నిలుస్తున్నట్టు తెలుస్తోంది. వియ్యంకులైన ఈ ఇద్దరిలో జీవీ వినుకొండ, కొమ్మాలపాటి పెదకూరపాడు టికెట్లు ఆశిస్తున్నారు. ఇదే కోరికతో వారు చంద్రబాబును ఇటీవల కలిశారట.
అప్పుడు ఆయన ఒక్కరికే సీటు ఇవ్వగలనని, ఆ ఒక్కరూ ఎవరో మీరే తేల్చుకోండని వారిపైనే ఆ భారం నెట్టేసి చేతులు దులుపుకున్నారట. పరోక్షంగా పెదకూరపాడులో డబ్బు దండిగా పెట్టగల భాష్యం ప్రవీణ్‌కు ఇవ్వాలని యోచిస్తున్నట్టు ఆయన చెప్పడంతో శ్రీధర్ తన వర్గీయులతో శుక్రవారం గుంటూరు నగరంలోని ఓ హోటల్‌లో సమావేశం ఏర్పాటు చేసి తనకు అండగా నిలవాలని కోరారు.
మిత్రత్వంలో శతృత్వం
ఏలూరులో టీడీపీ, జనసేన మధ్య టిక్కెట్ ఫైట్ తీవ్రంగా ఉంది. జనసేనకు టిక్కెట్ ఇస్తే కాపుకాసేది లేదని టీడీపీ నేతలు చెబుతుంటే... టీడీపీ అభ్యర్థి టిక్కెట్ దక్కించుకుంటే తాము సహకరించబోమని, పోటీలో కచ్చితంగా ఉంటామని జనసేన నేతలు బహిరంగంగా చెబుతున్నారు. పొత్తుల్లో ఈ స్థానం టీడీపీకి ఖరారైందని ఆ పార్టీ ఇన్‌చార్జి బడేటి చంటి ప్రచారం చేసుకుని ఏకంగా హోర్డింగులతో హడావుడి చేశారు. దీనికి కౌంటర్‌గా జనసేన నాయకులు ‘మేము రెడీ.. టిక్కెట్ మాదే..’ అంటూ ఫ్లెక్సీలతో హంగామా చేశారు.
అంతేనా... ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడే అంటూ అతను నిర్వహించిన ఆతీ్మయ సమావేశంలో జిల్లా జనసేన నేతలే ప్రకటించారు. ఇదిలా కొనసాగుతుండగా జనసేనలో అకస్మాత్తుగా తెరపైకి మరో కొత్త నేత వచ్చి తనకే టికెట్ అంటూ నగరమంతా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరో గందరగోళానికి దారితీశారు.
అనంతపురంలో అంతర్గత పోరు
అనంతపురం అర్బన్‌లో ప్రభాకర్ చౌదరికి అసమ్మతి బెడద ఎక్కువైంది. ఆయన మున్సిపల్ చైర్మన్‌గా పనిచేసినప్పుడు జరిగిన అవినీతిని వారు గుర్తు చేసుకుంటున్నారు. ఆయనకు మళ్లీ టికెట్ ఇస్తే పార్టీ నామరూపాల్లేకుండా పోతుందని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. అక్కడ పవన్‌కల్యాణ్ పోటీచేస్తే తాను తప్పుకుని ఆయన గెలుపునకు పాటుపడతానని ప్రభాకర్ చెబుతుండగా ‘త్యాగం చెయ్యడానికి, గెలిపించడానికి నువ్వెవరు? ఇదేమైనా నీ తాత, తండ్రుల సొత్తు కాదు కదా!’ అని తెలుగుదేశం పార్టీలో బలిజ సామాజిక వర్గానికి చెందిన మునిరత్నం మీడియా ముఖంగా ధ్వజమెత్తారు.
‘తమ్ముళ్ల’ హడావుడితో జనసైనికుల ఆగ్రహం
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సీట్ల పంపకం తేలకున్నా... మిత్రపక్షాన్ని సంప్రదించకుండా టీడీపీ ఇన్‌చార్జులు, పార్టీ టిక్కెట్ ఆశిస్తున్నవారు ప్రచారం ప్రారంభించడంపై జనసేన పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పొత్తులో భాగంగా ఈ జిల్లా నుంచి తమకు అధిక సీట్లు కావాలని జనసేన కేడర్ పట్టుబడుతోంది. కానీ దానిని పట్టించుకోకుండా అమలాపురం టీడీపీ ఇన్‌చార్జి ఆనందరావు ఏకంగా ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు.
మండపేట నుంచి వేగుళ్ల జోగేశ్వరరావును గెలిపించాల్సిందిగా చంద్రబాబు మండపేట సభలో పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో రాజోలు నుంచి తాము పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. మిగిలిన ఐదు స్థానాల పరిస్థితి తేలాల్సి ఉంది. కొత్తపేట, ముమ్మిడివరంలో టీడీపీ ఇన్‌చార్జిలు బండారు సత్యానందరావు, దాట్ల సుబ్బరాజు(బుచ్చిబాబు) తామే అభ్యర్థులుగా ప్రచారం చేసుకుంటున్నారు.
యర్రగొండపాలెంలో డిష్యుం..డిష్యుం
యర్రగొండపాలెంలో టీడీపీపై అసమ్మతి బుసలు కొడుతోంది. డాక్టర్ మన్నె రవీంద్ర కారణంగా ఇక్కడ తెలుగు దేశం పార్టీ గెలవడం లేదని నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు వర్గం చెబుతుండగా ఆయన గ్రూపులను ప్రోత్సహిస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆయనకు టికెట్‌ఇస్తే సహకరించేది లేదని, అవసరమైతే రాజీనామాకు కూడా వెనకాడబోమని డాక్టర్ రవీంద్ర వర్గం కరాఖండీగా చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment