అప్పుడైతే ముద్దు.. ఇప్పుడైతే వద్దు! ఏకగ్రీవం ఎందుకు.. ఫైటింగ్‌ల బాటలోనే పోదాం ముందుకు! ఇవేంటీ కొత్త నినాదాలు అనుకుంటున్నారా? ఇవి ఉత్తుత్తి నినాదాలు కావండీ.. పంచాయతీ ఎన్నికల వేళ తెలుగుదేశం పెద్దల విధానాలు. పల్లెల్లో విబేధాల సెగ రాజేసి ఏదోలా పబ్బం గడుపుకొందామని..ఆలోచిస్తున్న ప్రతి‘పచ్చ’ నేతల మానసిక స్థితికి నిదర్శనాలు. చిత్రమేమిటంటే.. అప్పట్లో రైటరైటన్న వారే ఇప్పుడు రాంగని గొంతు చించుకుంటున్నారు. ఏకగ్రీవాలకు గతంలో ఓట్లేసిన వాళ్లే ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ‘పచ్చ’కళ్లతో ప్రపంచాన్ని చూస్తున్నారు. పోటీలతోనే ప్రజాస్వామ్యం వర్థిల్లుతుందని.. గ్రామాలు ఒకే మాటగా.. ఒకే బాటగా ఉంటే కొంపలు మునిగిపోతాయని నానాయాగీ చేస్తున్నారు. అవకాశాలున్న చోట ఏకగ్రీవ నిర్ణయంతో తప్పేమిటంటే.. అదేదో అనరాని మాటన్నట్లు గుండెలు బాదుకుంటున్నారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘పార్టీ రహితంగా జరిగే ఎన్నికలు. గ్రామాల్లో గొడవలు చోటు చేసుకునే అవకాశాలు.. కక్షలు, కార్పణ్యాలకు దారి తీసే పరిస్థితులు’ పంచాయతీ ఎన్నికల్లో సాధారణంగా కన్పించే పరిణామాలివి. కుటుంబాలు, బంధుత్వాలతో సామరస్యంగా ఉండే గ్రామస్తుల్లో పంచాయతీ ఎన్నికలు అనగానే ఒక్కసారిగా తేడాలొచ్చే పరిస్థితులుంటాయి. వీటిని నియంత్రించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఏకాభిప్రాయంతో ఏకగ్రీవమైతే గ్రామానికి ప్రోత్సాహక నిధులు పొంది అభివృద్ధి చేసుకోవడానికి వీలుంటుందని, అభిప్రాయ బేధాలు లేకుండా సామరస్యంగా ఉండటానికి దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగానే ఏకగ్రీవ ప్రోత్సాహకాలను ప్రకటించింది. కానీ కక్షలు, కార్పణ్యాలు, గొడవలకు అలవాటైన టీడీపీ నేతలు మాత్రం ఏకగ్రీవాలు వద్దు.. అంటూ వ్యూహాత్మక రాజకీయాలకు తెరలేపుతున్నారు. గ్రామాల్లో అప్పుడే అగ్గి రాజేస్తున్నారు. గొడవలకు ఉసిగొల్పే రాజకీయాలు చేస్తున్నారు. చదవండి: అచ్చెన్నాయుడికి నోటీసులు..
టీడీపీకి అభ్యర్థులే కరువు..
టీడీపీ నేతలు ఈసారి వ్యూహాత్మక రాజకీయాలు చేస్తున్నారు. కరోనాకు ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువైన పరిస్థితులుండేవి. ఫలితంగా పలుచోట్ల ఏకగ్రీవమైపోయాయి. టీడీపీ తరఫున పోటీ చేసేందుకు ఆ పార్టీ నాయకులే దూరంగా ఉండిపోయారు. ప్రజల ఆలోచనకు భిన్నంగా టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలతో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకోవడం వల్ల ఎన్నికలంటేనే ఆసక్తి చూపలేదు. ఇలాంటి దుస్థితిలో పంచాయతీ ఎన్నికలపై రాద్ధాంతం చేస్తుంటే తెరవెనుక ఏదో చేసే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని శాంతిభద్రతలను కాపాడేందుకు, గ్రామాల అభివృద్ధికి దోహదపడతాయని రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఏకగ్రీవ ప్రోత్సాహకాలను ప్రకటించింది. అయితే ప్రోత్సాహకాలొద్దని, ఎన్నికలే కావాలని టీడీపీ నాయకులు రాజకీయాలు చేయడం అనుమానాలకు తావిస్తోంది. చదవండి: పంచాయతీ ఎన్నికలు: టీడీపీ దుష్ట పన్నాగాలు..
కొత్తేమీ కాదు..
ఏకగ్రీవ ఎన్నికలు కొత్తేమీ కాదు. 2001 నుంచి పంచాయతీల ఏకగ్రీవాలు జరుగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగాయి. 2013 పంచాయతీ ఎన్నికల్లో 225 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. నరసన్నపేట మండలం నడగాం, సత్యవరం రూరల్ పంచాయతీలు సైతం ఏకగ్రీవమే కాగా, వాటికి టీడీపీ నేతలే ప్రాతినిధ్యం వహించారు. ఒక్క నరసన్నపేటలోనే కాదు జిల్లా వ్యాప్తంగా ఏకగ్రీవాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సారి మాత్రం ఏకగ్రీవాలు వద్దంటూ టీడీపీ వితండవాద రాజకీయాలు చేస్తోంది. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అచ్చెన్నాయుడు, కూన రవికుమార్, కళా వెంకటరావు అదే రీతిలో మాట్లాడుతున్నారు. ఏకగ్రీవం చేసుకుంటే గ్రామాలకు ప్రోత్సాహకాలు వస్తాయని ప్రజలు ఆశిస్తుంటే ఎన్నికలు పెట్టి గలాటా సృష్టించాలని టీడీపీ నేతలు చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment