డబ్బులిస్తామంటే..వద్దంటున్నారు. బెదిరిస్తుంటే.. ఎదురు తిరుగుతున్నారు.. బుజ్జగిస్తుంటే..కసిరి కొడుతున్నారు. పార్టీ గుర్తులతో పనిలేని పంచాయతీ ఎన్నికల్లో ఉనికి నిలుపుకోవడానికి టీడీపీ పడరాని పాట్లు పడుతోంది. సాధారణంగా ఎన్నికల ముందు జనాలను ఓట్లు అభ్యర్థించడం కామనే.. కానీ ప్రతిపక్ష పార్టీ పరిస్థితి వేరు. జనాలను కాకుండా నాయకులను ఆ పార్టీ అభ్యర్థిస్తోంది. తమ మద్దతుతో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని బతిమాలుతోంది. తొలి దశ పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న దశలో కూడా లీడర్ల కోసం వెతుకులాడుతోంది. కానీ ఏం లాభం.. మా కేండిడేటే అనుకున్న వారంతా డౌట్లు పెట్టి ముఖం చాటేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పంచాయతీ ఎన్నికల కోసం నానా యాగీ చేసిన టీడీపీకి ఇప్పుడు తత్వం బోధ పడుతోంది. ఏకగ్రీవాలు కాకుండా పంచాయతీల్లో అభ్యర్థులను నిలబెట్టాలని ఆ పార్టీ అగ్రనాయకత్వం పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ పిలుపునకు స్పందించే వారే కరువైపోయారు. ఓ వైపు ప్రభుత్వం ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తుంటే.. టీడీపీ మాత్రం పోటీకే మొండిగా దిగుతోంది. కానీ బరిలో దిగే వారు లేక ఆ పార్టీ నాయకులు డీలా పడిపోతున్నారు. (చదవండి: టీడీపీలో ‘గంటా’ టెన్షన్)
జిల్లాలో మొత్తం 1166 పంచాయతీల్లో నాలుగు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే తొలి రెండు దశల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నా మినేషన్లు కూడా ఖరారయ్యాయి. అయితే ఈ రెండు దశల్లోనూ దాదాపుగా అన్ని పంచాయతీల్లోనూ అభ్యర్థులను నిలబెట్టడానికి టీడీపీ ఆపసోపాలు పడింది. ‘బాబ్బాబూ..ఏకగ్రీవాలకు ఛాన్స్ ఇవ్వకండి....డబ్బులిస్తాం...పోటీలో ఉండండి చాలు’ అంటూ కింది స్థాయి నాయకులను బతిమలాడే స్థితికి చేరుకుంది. ఇక జిల్లాలో అప్పట్లో చక్రం తిప్పిన ప్ర స్తుత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు కూ డా పల్లె నాయకులను వెతకలేక చతికిలపడ్డారు.(చదవండి: పిచ్చి పీక్స్‌కు.. తుగ్లక్‌ను మరిపిస్తున్న నిమ్మగడ్డ)
టెక్కలి నియోజకవర్గంలో సుమారు 12 చోట్ల సర్పంచ్‌లు ఏకగ్రీవం కావడం అచ్చెన్నకు మింగుడు పడడం లేదు. గత సాధారణ ఎన్నికల్లో స్వగ్రామమైన నిమ్మాడలో తన భార్యను ఏకగ్రీవ సర్పంచ్‌గా చేసుకున్న అచ్చెన్నకు ఈసారి ఆ పప్పులుడకలేదు. అయితే ఎన్నికల బరిలో వ్యతిరేకంగా నిలబడిన కింజరాపు అప్ప న్నపై దౌర్జన్యానికి దిగి బెదిరింపులకు సైతం దిగిన సంగతి విదితమే. వీటిపై ఆధారాలుండడంతో ఎన్నికల కమిషన్ చర్యల్లో భాగంగా అచ్చెన్నను అరెస్ట్ చేసింది. దీంతో మిగిలిన ప్రాంతాల్లో కూడా అభ్యర్థుల కోసం ఆయా ప్రాంత నేతలు వెంపర్లాడుతున్నారు.
రాజకీయాలకు అతీతమని తెలిసినా..
పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ పార్టీల జోక్యం ఉండదని తెలిసినప్పటికీ... ముందు నుంచి ఈ ఎన్నికలకు పచ్చ రంగును పులిమేందుకు టీడీపీ నేతలు అత్యుత్సాహం చూపించారు. మేకపోతు గాంభీర్యంతో ఎన్నికలకు సై అన్నా.. అభ్యర్థులు దొరక్క బొక్కబోర్లా పడ్డారు.
అప్పుడు పట్టించుకోకుండా..
గ్రామ స్థాయిలో ఎన్నికలకు టీడీపీ శ్రేణులు దూరంగా ఉంటున్నాయన్నది సత్యం. అగ్రశ్రేణి నేతల ఒత్తిళ్లు ఏమాత్రం పట్టించుకోకుండా బాహాటంగానే ఎన్నికల్లో పోటీ చేయలేమ ని తేల్చి చెప్పేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. జిల్లా లో గత ప్రభుత్వ హయాంలో క్యాడర్‌ను ఏ మా త్రం పట్టించుకోని అగ్రనేతలు ఇప్పుడు తాయిలాలు ఇస్తామని ప్రలోభ పెడుతుండడంతో ద్వితీయ నాయక శ్రేణి అవమానంగా భావిస్తోంది. ఖర్చులన్నీ భరిస్తామని హామీ ఇచ్చినా ఆ పల్లకీ మోసే బోయీలు మాత్రం దొరకడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment