
ఏమ్మా.. ఎక్కడి నుంచి వచ్చావ్? ఏ కులం నీది? నీ ఇష్టమొచ్చినట్టు ఆడాలంటే కుదరదు. మేం చెప్పినట్టు వినకపోతే పైకి పంపిస్తాం. మా పార్టీ మద్దతుదారుల నామినేషన్లు ఎలా ఉన్నా సరే ఆమోదించాల్సిందే. తిరస్కరిస్తే మా తడాఖా చూపిస్తాం. ఎవడు అడ్డమొస్తాడో చూస్తాం.. ఇదీ ఓ పచ్చనేత గాండ్రింపు..
మీ అంతు చూస్తాం.. మీ ఇంటికొచ్చి కొడతాం.. కార్యాలయంలోనే పాతేస్తాం.. ఎవడొచ్చి కాపాడుతాడో చూస్తాం.. ఏం బలుపా.. మా పార్టీ మద్దతుదారుల నామినేషన్లు తిరస్కరించావంట.. ఎంత కొవ్వు నీకు.. చేతగాకపోతే తప్పుకో.. లేదంటే నామినేషన్లు ఆమోదించు- ఇది ఓ టీడీపీ నేత బెదిరింపు
జిల్లాలో ఇలాంటి ఘటనలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. టీడీపీ నేతలు అధికారులనే టార్గెట్ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారు. కులం పేరుతో దూషిస్తూ వారిని మానసిక వేదనకు గురిచేస్తున్నారు. సాటి ఉద్యోగుల ఎదుటే నోటికొచ్చినట్లు తిడుతూ అవమానపరుస్తున్నారు. వీరి వేధింపులు తార స్థాయికి చేరకముందే దౌర్జన్య కారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు అధికారులు వేడుకుంటున్నారు.
సాక్షి, తిరుపతి: పచ్చని పల్లెలు.. ప్రశాంత వాతావరణం మధ్య జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అల్లర్లు సృష్టించేందుకు కుట్రపన్నుతోంది. గొడవలు రేపి ఎలాగైనా లబ్ధిపొందాలని ప్రణాళిక సిద్ధం చేసింది. అందుకే తమ పార్టీ నేతలను గొడవలు చేసేవిధంగా ఉసిగొల్పుతోంది. ఇదేఅదునుగా ఆ పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారు. ఉన్నతాధికారులు అని కూడా చూడకుండా దాడులకు తెగబడుతున్నారు. నామినేషన్ కేంద్రాల్లో అలజడి సృష్టిస్తున్నారు. నామినేషన్ పత్రాలు తప్పులుతడకగా ఉన్నా తమ పార్టీ మద్దతుదారులవి ఆమోదించాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. మాట వినని అధికారులపై ఎదురుదాడికి దిగుతున్నారు. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. (చదవండి: ఆ కుటుంబానికి పోటీగా నిలబడ్డారు.. శవాలై తేలారు)
ఇంత బరితెగింపా.. : జిల్లాలో చిత్తూరు, గంగాధరనెల్లూరు, నగరి, చంద్రగిరి, పూతలపట్టు, సత్యవేడు నియోజకవర్గాల్లో మొదటి విడత పంచాయతీలు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యి పరిశీలన దశకు చేరింది. అలాగే రెండో విడత ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులోభాగంగా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లె మండలంలో తమ మద్దతుదారులకు నో డ్యూస్, ఇతర ధ్రువీకరణపత్రాలు ఇవ్వడం లేదని టీడీపీ నాయకులు శ్రీనాథ్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, రామచంద్ర తదితరులు మంగళవారం ఎంపీడీఓ వెంకటరత్నంను బెదిరించారు. గ్రామ సెక్రటరీలు టీడీపీ మద్దతుదారులకు సహకరించడం లేదని నానా మాటలు మాట్లాడారు. సహకరించకపోతే ఉద్యోగాలు ఊడుతాయ్ అంటూ హెచ్చరిక జారీచేశారు. తమ వారికి అనుకూలంగా నడుచుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ఊగిపోయారు. సుమారు గంటపాటు హంగామా చేశారు. దీనిపై ఎంపీడీఓ వెంకటరత్నం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిపై కేసులు నమోదయ్యాయి.
టీడీపీ అరాచకాలు.. ఇదిగో సాక్ష్యాలు
► పాకాల తహసీల్దార్ లోకేశ్వరిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి ముఖ్యఅనుచరుడు నాగరాజనాయుడు ఆదివారం దౌర్జన్యానికి దిగారు. అంతటితో ఆగక ఆమెను కులం పేరుతో దూషించారు.
► విజయపురం మండలం జగన్నాథపురం సర్పంచ్ అభ్యర్థిగా టీడీపీ మద్దతుతో నామినేషన్ దాఖలు చేశారు. అందులో భర్త పేరుకు బదులు తండ్రి పేరు రాసి ఉండడంతో నామినేషన్ తిరస్కరణకు గురైంది.
► కోసలనగరం సర్పంచ్ అభ్యర్థికి 1.5 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. నామినేషన్ పత్రంలో ఆ భూమి ఉన్నట్లు చూపించ లేదు. నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు.
► నారపురాజుకండ్రిగ సర్పంచ్ అభ్యర్థికి 6.5 ఎకరాల భూమి కలిగి ఉంటే అందులో 70 సెంట్లు చూపించకపోవడంతో ఆ నామినేషన్ తిరస్కరించారు. దీంతో టీడీపీ శ్రేణులు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.
► గత ఆదివారం యాదమరి మండలంలో ఎమ్మెల్సీ దొరబాబు రెచ్చిపోయారు. తనకారుతో వేగంగా వచ్చి రోడ్డుపక్కన వెళ్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దూసుకెళ్లారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
రెచ్చగొట్టి..చిచ్చుపెట్టి
జిల్లాలో టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. అధికార పార్టీ నేతలపై దాడులకు దిగడం.. అధికారులపై దౌర్జన్యం చేయడం రివాజుగా మారుతోంది. ఆపై ఆయా ఘటనలను ఆ పార్టీ నేతలే వీడియోలు తీసి పార్టీ ప్రధాన కార్యాలయానికి పంపడం.. అక్కడి నుంచి కొన్ని చానళ్లకు వెళ్లడం జరిగిపోతోంది. అందులో టీడీపీ నేతల మాటలు, దాడులను ఎడిట్ చేసి జనం నమ్మేలా చేయడం విమర్శలకు తావిస్తోంది.