నూజివీడు: ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటమే లక్ష్యంగా టీడీపీ మూకలు బరితెగిస్తున్నాయి. బాబు ష్యూరిటీ–భవిష్యత్‌కు గ్యారంటీ పేరుతో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నాయి. ఇళ్లలోకి చొరబడి.. అమాయకులైన ప్రజల్ని మాయమాటలతో మభ్యపెట్టి వారి ఫోన్ల నుంచి సున్నిత సమాచారాన్ని సేకరిస్తున్నాయి. టీడీపీ కార్యకర్తలు తమ ఫోన్లు తీసుకొని ఓటీపీలు ఎందుకు సేకరిస్తున్నారో తెలియడం లేదంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏలూరు జిల్లా నూజివీడు మండలంలోని గ్రామాల్లో పలువురు టీడీపీ కార్యకర్తలు ప్రజల ఇళ్లకు వెళ్తున్నారు. వారితో మాటలు కలిపి.. ఏ రాజకీయ పార్టీకి ఓటు వేస్తారో తెలుసుకుంటున్నారు. అనంతరం వారి ఫోన్ నంబర్లు సేకరిస్తున్నారు. ఆ తర్వాత మెసేజ్‌లు పంపించి.. ఓటీపీలు సేకరిస్తున్నారు. మెసేజ్‌లు చూడటం తెలియనివారి వద్ద నుంచి టీడీపీ కార్యకర్తలే ఫోన్‌లు తీసుకొని ఓటీపీలను తమ ట్యాబ్‌లలో నమోదు చేసుకుంటున్నారు. రేగుంట గ్రామంలో ఇదే విధంగా జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై టీడీపీ మూకలను ఎవరైనా ప్రశ్నిస్తే.. టీడీపీ మేనిఫెస్టో పేరుతో ఓ లింక్ పంపించి.. మీ కుటుంబం పలు పథకాలకు అర్హత పొందిందని.. 2024 జూన్ తర్వాత మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయంటూ మభ్యపెడుతున్నారు. నూజివీడుకు చెందిన వాసవికి ఆడబిడ్డ నిధి, ఇతర పథకాల కింద ఏడాదికి రూ.54 వేలు వస్తాయని, ఐదేళ్లకు రూ.2.70 లక్షలు లబ్ధి పొందుతారంటూ చెప్పి.. ఆమె సమాచారమంతా సేకరించారు.
నా కుటుంబ వివరాలు వాళ్లకెందుకు?
టీడీపీ కార్యకర్తలు మా ఇంటికి వచ్చారు. ఎన్ని ఓట్లు ఉన్నాయని అడిగారు. చెప్పగా.. నా ఫోన్‌కు ఏదో మెసేజ్ పంపించారు. నాకు చూడటం రాదని చెప్పగా.. వాళ్లే ఏదో నమోదు చేసుకొని వెళ్లారు. ఏదో ఓటీపీ నా ఫోన్ నుంచి తీసుకున్నారని ఆ తర్వాత తెలిసింది. నా కుటుంబ వివరాలు వాళ్లకెందుకో అర్థం కావడం లేదు.
– కె.విజయకుమార్, రేగుంట
Comments
Please login to add a commentAdd a comment