సాక్షి ప్రతినిధి, విజయవాడ: టీడీపీలో ఇంటిపోరు రోడ్డున పడుతోంది. జనసేనతో టికెట్ల పంచాయితీ తేలక ముందే తెలుగు తమ్ముళ్లు రచ్చకెక్కుతున్నారు. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా అంతర్గత విభేదాలను తట్టుకొలేక పార్టీ నాయకత్వంపై పరోక్షంగా ధ్వజమెత్తారు.
పార్టీలో కొత్త వారి చేరికలను వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో ఆదివారం జరిగిన ‘టౌన్ హాల్ మీటింగ్ విత్ లీడర్’ అనే కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో అసమ్మతి గళానికి అద్దం పట్టాయి. మైలవరం నుంచి దేవినేని ఉమాకు టికెట్ లేదని ఇప్పటికే చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. దానిని బలపరుస్తూ తాజా రాజకీయ పరిణామాలు జోరందుకున్నాయి.
అవమాన భారంతో..
మైలవరం నుంచే పోటీ చేస్తానని ఉమా చెబుతున్నా శ్రేణులు, అధిష్టానం ఏమాత్రం పట్టించుకోవటం లేదు. ఉంటే ఉండు.. పోతే పో.. అన్న రీతిలో పార్టీ పెద్దలు వ్యవహరిస్తుండటంతో ఉమాలో అసహనం పెరిగిపోతోంది. ఫలితంగా అవమానభారంతో ఉమా అధిష్టానానికి పరోక్షంగా హెచ్చరికలు చేస్తూ గుంటుపల్లి సమావేశంలో తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ‘వందల కోట్ల రూపాయలు ఇస్తాం అని వస్తున్న రాజకీయ వ్యభిచారులను తరిమికొట్టాలి’ అని ఆయన పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపుతోంది.
‘పసుపు కండువా కప్పుకొని చచ్చిపోతాను తప్ప పార్టీని వీడను. ఫిబ్రవరి రెండో వారంలో అన్నేరావుపేట నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తా’ అని ఉమా చెప్పడంతో పరోక్షంగా చంద్రబాబు, చినబాబుకే హెచ్చరికలు జారీ చేస్తున్నారని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. మరోవైపు ‘పార్టీలో నేను పెద్దతోపును. తనది రెండో స్థానం.
నేను తలచుకొంటే ఎవరికైనా టికెట్ ఇప్పిస్తాను’ అని గొప్పలు చెప్పుకొనే ఉమాకు పట్టిన దుస్థితి చూసి పలువురు నేతలు నవ్వుకొంటున్నారు. తాను తలుచుకొంటే మైలవరంతోపాటు, నందిగామ నియోజకవర్గంలో పార్టీని దెబ్బ తీయగలనని ఆయన అధిష్టానానికి సంకేతాలు పంపినట్టు చర్చ జరుగుతోంది. అయితే ఉమా వ్యవహారశైలిని అధిష్టానం లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆయనపైన ప్రతిదాడి చేయాలని కొందరు నేతలకు ఇప్పటికే సూచించినట్లు పార్టీ వర్గాల్లో∙చర్చ సాగుతోంది.
ముద్దరబోయిన అసంతృప్తి
నూజివీడు టీడీపీలో అసమ్మతి సెగలు భగ్గుమంటున్నాయి. మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు ఈసారి టికెట్ లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు. దీనిపై బాబును కలిసి మాట్లాడేందుకు ముద్దరబోయిన యత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన తన వర్గీయులతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోసారి అధిష్టానంతో మాట్లాడి ఫలితం లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు చర్చ సాగుతోంది.
విజయవాడ వెస్ట్‌లో తాప‘త్రయం’
విజయవాడ వెస్ట్‌లో టికెట్ కోసం మూడు వర్గాలు కత్తులు దూసుకుంటున్నాయి. పేపరు పులిగా పేరొందిన బుద్దా వెంకన్న ర్యాలీలు చేస్తూ తనకు టీడీపీ టికెట్ ఇవ్వాలని పట్టుపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ విజయవాడ వెస్ట్ టికెట్ తనదేనని ఇప్పటికే ప్రకటించుకున్నారు. ‘అందరూ టికెట్ అడుగుతారు కానీ గెలిచే స్తోమత ఉండాలి. మంచి విలువలు ఉండాలి.
నాకు సీటు ఇవ్వకపోతే ముస్లిం మైనార్టీలు ఉరివేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నేనే ఎమ్మెల్యే అభ్యర్థినవుతా’ అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. జనసేన మాత్రం పొత్తులో భాగంగా సీటు తమకే వస్తుందని చెబుతోంది. ఆ పార్టీ నేత పోతిన మహేష్ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. జనసేన, టీడీపీ సీట్లు సర్దుబాటు కాకముందే ఇక్కడ ఆ పార్టీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment