
మేకల కళ్యాణ్ చక్రవర్తి
పోస్టల్ బ్యాలెట్.... ఎన్నికల ప్రక్రియలో చివరి అంకమైన కౌంటింగ్ మొదలు కాగానే వినిపించే ఫలితం ఇదే. రిజల్ట్కు సంబంధించిన ఎర్లీ ట్రెండ్స్‌కు అద్దం పడతాయని భావించే ఈ పోస్టల్ ఓట్లంటే ప్రతి ఎన్నికల్లోనూ క్రేజే. ఎందుకంటే ఈవీఎంలలో పోలయిన ఓట్లను లెక్కించేందుకు ఓ అర గంట ముందే ఈ ఓట్లను లెక్కిస్తారు.
వీటి లెక్క పూర్తి కాగానే పోస్టల్ బ్యాలెట్‌లో ఫలానా అభ్యర్థి ముందంజ... పోస్టల్ ఓట్లలో వెనుకబడిన ఫలానా అభ్యర్ధి... అంటూ వార్తలు వచ్చేస్తాయి. అయ్యో... మనోడు వెనుకబడ్డాడే... మన అభ్యర్థికి పోస్టల్ ఓట్లు బరాబర్ వచ్చినయ్.. కచ్చితంగా గెలుపు మనదే... అంటూ అభిమానులు, ఆయా పార్టీల కార్యకర్తలు
కూడా పోస్టల్ ఫలితం రాగానే లెక్కలు వేసుకుంటుంటారు.
గత ఎన్నికల్లో పొంతన లేకుండా
2018 ఎన్నికల్లో మాత్రం పోస్టల్ బ్యాలెట్‌కు, రిజల్ట్ ట్రెండ్స్‌కు అసలు పొంతనే లేకుండా పోయింది. ఈ ఎన్నికల్లో పోస్టల్ ఓట్లు ఎక్కువగా వచ్చిన 75 మంది ఓడిపోయారు. 42 మంది మాత్రమే గెలిచారు. రెండు చోట్ల మాత్రం గెలిచిన వారికి, ఓడిన వారికి సమానంగా (తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారికి) ఈ ఓట్లు పోలయ్యాయి. కొన్ని చోట్ల అయితే మూడోస్థానంలో నిలిచిన అభ్యర్థికి తొలి రెండు స్థానాల్లో ఉన్న వారికంటే ఎక్కువగా పోస్టల్ ఓట్లు రావడం గమనార్హం.
ఈ ఫలితాలను బట్టి చూస్తే ఉద్యోగుల మూడ్‌ను బట్టి ఎన్నికల ఫలితాలను అంచనా వేయడం కష్టమేనని అర్థమవుతోంది. ప్రజల తీర్పు ఓ విధంగా ఉంటే ఎన్నికల విధుల నిర్వహించిన ఉద్యోగులు, సరీ్వస్ ఓటర్లు, ఇతర పోస్టల్ ఓటర్ల అభిప్రాయం మరోవిధంగా ఉందని తేలింది.
చదవండి: Rahul Gandhi: విమర్శల బాణం.. ఆత్మీయ రాగం
మూడో స్థానానికి ‘మెజారిటీ’
గత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే మూడో స్థానంలో నిలిచిన అభ్యర్థులకు కొన్ని నియోజకవర్గాల్లో పోస్టల్ ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి. కల్వకుర్తిలో మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి చల్లావంశీచందర్‌రెడ్డికి అత్యధికంగా 323 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా మద్దతు తెలిపారు. అక్కడ గెలిచిన బీఆర్‌ఎస్ అభ్యర్థి జైపాల్‌యాదవ్‌కు 142, రెండో స్థానంలో నిలిచిన ఆచారికి 285 వచ్చాయి.
ఆదిలాబాద్ నియోజకవర్గంలో గెలుపొందిన జోగురామన్నకు 465 పోస్టల్ ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో వచ్చిన అభ్యర్థి పాయల్‌కు 290 పోస్టల్ ఓట్లు వస్తే మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి గండ్రత్ సుజాతకు ఏకంగా 578 మంది పోస్టల్ ఓట్లేశారు. బాల్కొండలో బీఆర్‌ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డికి 124 పోస్టల్ ఓట్లే వచ్చాయి. కానీ, మూడో స్థానంలో వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి ఈరవత్రి అనిల్‌కు ఏకంగా 298 ఓట్లు వస్తే, రెండో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి ముత్యాల సునీల్‌కు 175 పోస్టల్ ఓట్లు పోలయ్యాయి.
దుబ్బాకలో అందరికంటే మూడోస్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఉద్యోగుల మెప్పు పొందారు. ఆయనకు 221 పోస్టల్ ఓట్లు వస్తే, గెలిచిన బీఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డికి 187, రెండో స్థానంలో ఉన్న మద్దులకు 108 ఓట్లు రావడం గమనార్హం.
రెండు చోట్ల సమానంగా పోస్టల్ బ్యాలెట్
రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోకెల్లా పోస్టల్ బ్యాలెట్‌లో విభిన్న తీర్పు పటాన్‌చెరు, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో వచ్చింది. ఇక్కడ గెలిచిన అభ్యర్థులకు, వారి సమీప ప్రత్యర్థులకు సమానంగా పోస్టల్ బ్యాలెట్ పోలైంది. పటాన్ చెరులో గెలిచిన బీఆర్‌ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్‌రెడ్డికి 148, కాంగ్రెస్ అభ్యర్థి కాట శ్రీనివాస్‌గౌడ్‌కు 148 ఓట్లు వస్తే, చాంద్రాయణగుట్టలో గెలిచిన ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీకి 30, బీజేపీ అభ్యర్థిని షెహజాదికి 30 పోస్టల్ ఓట్లు వచ్చాయి.
2018 ఎన్నికల్లో పోస్టల్ ‘సిత్రాలు’ జరిగిన నియోజకవర్గాలివే..
►జుక్కల్‌లో రెండో స్థానంలో నిలిచిన సౌదాగర్ గంగారాం (216)కు పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువగా పోలయ్యాయి. అయితే, ఇక్కడ గెలిచిన అభ్యర్థి హన్మంత్ షిండే (157) పోస్టల్ ఓట్లు వస్తే మూడో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి అరుణతార (178)కు గెలిచిన అభ్యర్థి కంటే ఎక్కువ ఓట్లు రావడం గమనార్హం.
►కామారెడ్డిలో గెలిచిన బీఆర్‌ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్‌కు 206, రెండో స్థానంలో వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్‌అలీకి 542, మూడో స్థానంలో వచ్చిన బీజేపీ అభ్యర్థి కె.వి.రమణారెడ్డికి 338 పోస్టల్ ఓట్లు వచ్చాయి.
►నిజామాబాద్ అర్బన్‌లో సమీప ప్రత్యర్థి తాహెర్‌బిన్(కాంగ్రెస్)కు ఏకంగా 713 పోస్టల్ ఓట్లు వస్తే మొదటి స్థానంలో వచ్చిన బిగాల గణేశ్ గుప్తా (బీఆర్‌ఎస్)కు 499, మూడోస్థానంలో వచి్చన యెండల లక్ష్మీనారాయణ (బీజేపీ)కు పోటాపోటీగా 489 ఓట్లు వచ్చాయి.
►కరీంనగర్‌లో అయితే గెలిచిన అభ్యర్థి కంటే సమీప ప్రత్యర్థికి దాదాపు 600 పోస్టల్‌ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ఇక్కడ బీఆర్‌ఎస్ అభ్యర్థి గంగులకు 844, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కు 1440 ఓట్లు వస్తే, మూడో స్థానం దక్కించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌కు కూడా గెలిచిన అభ్యర్థితో
అటూఇటుగా 826 ఓట్లు వచ్చాయి.
►నారాయణ్‌ఖేడ్‌లో విచిత్రంగా గెలిచిన అభ్యర్థి, మూడో స్థానంలో ఉన్న అభ్యర్థికి చెరిసమానంగా పోస్టల్ ఓట్లు వచ్చాయి. గెలిచిన భూపాల్‌రెడ్డి (బీఆర్‌ఎస్)కి 306, మూడోస్థానంలో ఉన్న సంజీవరెడ్డికి 306 ఓట్లు వస్తే, రెండో స్థానంలో ఉన్న సురేశ్‌షెట్కార్‌కు కేవలం 244 ఓట్లు మాత్రమే వచ్చాయి.
►పరిగిలో గెలిచిన బీఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల మహేశ్‌రెడ్డికి 530కి పోస్టల్ ఓట్లు రాగా, ఆయన చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి టీఆర్‌ఆర్‌కు అంతకంటే రెట్టింపు సంఖ్యలో 1090 పోస్టల్ ఓట్లు పోలయ్యాయి.
►డంగల్‌లో ఓడిపోయిన రేవంత్‌రెడ్డి (కాంగ్రెస్)కు 526 పోస్టల్ ఓట్లు రాగా, గెలిచిన పట్నం నరేందర్‌రెడ్డి (బీఆర్‌ఎస్)కు కేవలం 174 ఓట్లు పోలయ్యాయి.
ఎన్నికల విధుల్లో ఉన్న వారితో పాటు సాయుధ దళాల్లో పనిచేస్తున్న వారు (సర్వీస్ ఓటర్లు), విదేశాల్లో నివసించే భారతీయ ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశముంటుంది. ఇక, ప్రత్యేక ఓటర్లు... అంటే పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేసే అవకాశం లేని ఓటర్లు కూడా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవచ్చు. వీటిని ఈవీఎంల లెక్కింపు కంటే ఓ అర గంట ముందు లెక్కిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment