అభివాదం చేస్తున్న దృశ్యం
పంజగుట్ట: బీసీలు వారికి రావల్సిన న్యాయపరమైన వాటా అడుగుతారనే భయంతోనే కేంద్రం బీసీ జనగణన చేపట్టడంలేదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోదీని కలిసి జనగణన చేపట్టాలని టీఆర్‌ఎస్ కోరినా స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ‘బీసీ జనగణన–కేంద్ర ప్రభుత్వ విధానం, బీసీల తక్షణ కర్తవ్యం’అంశంపై అఖిలపక్ష పార్టీలు, బీసీ ఉద్యోగ సంఘాలు, బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... 75 సంవత్సరాల స్వాతంత్య్ర చరిత్రలో గొల్ల, కురుమ వర్గానికి చెందిన తనను, ముదిరాజ్ వర్గానికి చెందిన బండ ప్రకాష్‌ను రాజ్యసభకు పంపింది తెలంగాణ ప్రభుత్వమే అన్నారు. బీసీ జనగణనతో పాటు కులగణన చేపట్టాలనే డిమాండ్‌తో ఈ నెల 13న ఢిల్లీలో తలపెట్టిన బీసీల జంగ్ సైరన్, 14న పార్లమెంట్ ముట్టడి, 15న జాతీయ స్థాయి అఖిలపక్ష సమావేశానికి తన పూర్తి మద్దతు తెలిపారు.
మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ... కుక్కలు, పిల్లులు అన్నింటికీ లెక్కలు ఉన్నాయి కాని బీసీలకు మాత్రమే లెక్కలు లేకపోవడం బాధాకరమన్నారు. బీసీల లెక్కలు తేల్చకపోతే రాజకీయంగా దెబ్బతింటామని భావించేలా ఉద్యమం చేయాలని, అప్పుడే అన్ని పార్టీలు దిగివస్తాయన్నారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... ఎస్సీ, ఎస్టీలతోపాట ఆఖరుకు 9 శాతం ఉన్న ఓసీలు కూడా 10 శాతం రిజర్వేషన్లు పొందుతున్నారని, 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు మాత్రమే ఇవ్వడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్, బీఎస్‌పీ నేత రమేష్, బీసీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దానకర్ణచారి, బీసీ యువజన సంఘం అధ్యక్షుడు కనకాల శ్యామ్, బీసీ విద్యార్థి నేత విక్రమ్‌గౌడ్, కుల్కచర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment