సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎంపీలు కలసి పోటీ చేస్తారేమోనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఇరుపార్టీల మధ్య జరుగుతున్న మంతనాలను పరిశీలిస్తే, ఇది సాధ్యం కావొచ్చని అనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ ఎంపీలతో చర్చలు జరిగిన తర్వాతే టీఆర్‌ఎస్ పార్లమెంట్ సమావేశాలను బహిష్క రించిందని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్ ఎంపీలకు వేరే ఫంక్షన్లు ఉండటం కూడా బహిష్కరణకు ఒక కారణమని చెప్పారు.
టీఆర్‌ఎస్ ఎంపీలు ధర్నా ఎందుకు చేశారో ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. శనివారం సంజయ్ సమక్షంలో ఆమన్‌గల్ మండలం మంగళ్‌పల్లి సర్పంచ్ నర్సింహారెడ్డిసహా టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు చెందిన వి.చంద్రమౌళి, కె.శ్రీశైలం, టి.ప్రకాశ్‌రెడ్డి, కొప్పు యాదయ్య, పెద్దసంఖ్యలో కార్యకర్తలు బీజేపీ లో చేరారు. ఈ సందర్భంగా మీడియాతో సంజయ్ ‘చిట్‌చాట్’గా మాట్లాడారు.
కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్‌లకు రాష్ట్రప్రజలు ఇప్పటికే అవకాశమిచ్చినందున ఒక్కసారి బీజేపీకి అధికారం అప్పగిస్తే, ప్రధాని మోదీ స్ఫూర్తితో అవినీతిరహిత పాలన అందిస్తామన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబ, అవినీతి, నియంత పాలనను తరిమికొట్టటం బీజేపీతోనే సాధ్యమన్నారు. స్వార్థం, సొంత లాభం కోసం వచ్చేవారిని తమ పార్టీలో చేర్చుకునేది లేదని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలోనే వరికుప్పల మీద పడి రైతులు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment