లింగంపేటలోని అంబేడ్కర్ చౌరస్తాలో మాట్లాడుతున్న బండి సంజయ్
లింగంపేట (ఎల్లారెడ్డి): దళితులకు సీఎం పదవి, మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, పేదలకు డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మాటిచ్చారని, వీటిలో ఏ ఒక్కటైనా ఆయన అమలు చేశారా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. మాట తప్పుడు, మడమ తిప్పుడు కేసీఆర్‌కు పడదని, మాటతప్పితే తల నరుక్కుంటానని చెప్పిన సీఎంకు ఇప్పుడు తల ఉన్నట్టా లేనట్టా అని నిలదీశారు.
అందుకే తలకాయ లేని సీఎం కేసీఆర్‌ను వచ్చే ఎన్నికల్లో ఓడించి ఇంటికి పంపించాలని సంజయ్ పిలుపునిచ్చారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఆదివారం బండి సంజయ్ కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అటవీ అధికారులు పాకిస్తాన్, అమెరికా నుంచి రాలేదని, అటవీ, రెవెన్యూ శాఖలతో మాట్లాడి పోడుభూముల సమస్యను పరిష్కంచవచ్చని సూచించారు. ముస్లిం మైనారిటీలు కూడా బీజేపీకి మద్దతు పలుకుతున్నారని, తానెప్పుడూ ఇస్లాం మతాన్ని కించపరలేదని ఆయన తెలిపారు.
ధనికరాష్ట్రమైన తెలంగాణను ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితికి తీసుకొచ్చారని ఆరోపించారు. ప్రతీ పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయని, అయితే టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రం ఏమీ చేయడంలేదని ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. 2023లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బండి ధీమా వ్యక్తం చేశారు. జిల్లాకు ఒక వంద పడకల ఆస్పత్రి అని చెప్పి ఇప్పుడు జిల్లాకు వంద మద్యం దుకాణాలు తెరుస్తున్నారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు అరుణతార తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment