Huzurabad Bypoll: హుజూరాబాద్‌కు అమిత్‌ షా? | Telangana: BJP Campaign As An Alternative To The CM KCR House | Sakshi
Sakshi News home page

Huzurabad Bypoll: హుజూరాబాద్‌కు అమిత్‌ షా?

Published Wed, Oct 13 2021 5:17 AM | Last Updated on Wed, Oct 13 2021 10:46 AM

Telangana: BJP Campaign As An Alternative To The CM KCR House - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారాన్ని అధికార టీఆర్‌ఎస్‌కు ధీటుగా హోరెత్తిం చాలని బీజేపీ నిర్ణయించింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సభతో ఈ ప్రచారాన్ని ముగించాలని భావిస్తోంది. వేయి మందికి మించి బహిరంగ సభ, ర్యాలీలు నిర్వహించవద్దని ఎన్నికల సంఘం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో తొలుత అమిత్‌షా సభను రద్దు చేసుకున్నా.. తాజా పరిణామాల నేపథ్యంలో సభ నిర్వహించాలని పార్టీ అగ్రనాయకులు నిర్ణయించినట్లు సమాచారం.

ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్‌ గెలుపును బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఓటర్లను చేరుకునేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవద్దని నిర్ణయించింది. హుజూరాబాద్‌లో కచ్చితంగా గెలిచి తీరాల్సిందేనని జాతీయ అధినాయకత్వం కూడా కచ్చితమైన ఆదేశాలు జారీచేయడంతో ఆ దిశగా వ్యూహాలు, ప్రతివ్యూహాలతో కార్యాచరణ ప్రణాళికలను రాష్ట్ర నాయకత్వం రూపొందిస్తోంది. టీఆర్‌ఎస్‌కు ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీనే అనే సంకేతాన్ని ప్రజల్లో బలంగా తీసుకెళ్లేందుకు ఈ విజయం దోహదపడుతుందని భావిస్తున్నారు.  

షా సభతో హోరెత్తించాలి... 
టీఆర్‌ఎస్‌ తరఫున కేసీఆర్‌ ఉప ఎన్నిక ప్రచారాన్ని వేడెక్కించనున్నందున అమిత్‌షా సభ, ప్రచారంతో దానికి చెక్‌ పెట్టాలనే అభిప్రాయానికి బీజేపీ వచ్చింది. కేసీఆర్‌ పాల్గొనేలా హుజూరాబాద్‌ నియోజకవర్గానికి పొరుగు జిల్లాలో టీఆర్‌ఎస్‌ బహిరంగ సభ నిర్వహించే అవకాశాలున్న నేపథ్యంలో.. దానికి తగ్గట్టుగానే తాము కూడా అమిత్‌షా సభ నిర్వహించేందుకు సిద్ధమౌతున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు. అమిత్‌షాతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొనేలా ఎన్నికల కార్యచరణకు తుది రూపునిస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విస్తృతంగా కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రచారం ఏర్పాట్లు చేస్తున్నారు.  

విస్తృత ప్రచారానికి సిద్ధమవుతున్న బండి 
ఈ నెల 16 లేదా 17 తేదీల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హుజూరాబాద్‌ ఎన్నికల ప్రచారా న్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో విస్తృతంగా పర్యటిం చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే వారం, పది రోజు లపాటు అన్ని మండలాల్లో క్షేత్రస్థాయి వరకు ఓటర్లను చేరుకునేలా కార్యక్రమాలు సిద్ధం చేస్తున్నారు. మూడు లేదా నాలుగు పోలింగ్‌ బూత్‌లు కలిపి ఒక శక్తి కేంద్రంగా ఏర్పాటు చేసి, ఆ స్థాయిలో ప్రజలను కలుసుకునేందుకు వివిధఎన్నికల కమిటీలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని అన్ని పోలింగ్‌ బూత్‌లు కవర్‌ చేసేలా శక్తి కేంద్రాల ఇన్‌చార్జీలు, వాటిలో గడప గడపకు వెళ్లి ప్రజలను కలుసుకునేందుకు వీలుగా వివిధ మోర్చాలు, అనుబంధ విభాగాల వారికి విధులను కేటాయించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement