చౌటుప్పల్‌లో ఓటర్లకు కమలం çపువ్వును ఇస్తూ ప్రచారం చేస్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. చిత్రంలో బూర నర్సయ్య గౌడ్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక తుదివిడత ప్రచారాన్ని బీజేపీ వినూత్నంగా సాగిస్తోంది. దీపావళి పండుగ సందర్భంగా సోమవారం స్థానిక ప్రజలకు పార్టీ ఎన్నికల గుర్తు అయిన కమలం పువ్వును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు అందజేశారు. బీజేపీకి మద్దతు పలకాల్సిందిగా కోరారు. దీంతో పాటు నియోజకవర్గంలోని వివిధ సామాజిక వర్గాల వారితో కలిసి పార్టీ ముఖ్యనేతలు బాణాసంచా కాల్చి పండుగ సంబరాలు జరుపుకున్నారు.
సహపంక్తి భోజనాలు చేశారు. పండుగ రోజున ఈ విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలతో పాటు ఇతర మెజారిటీ ఓట్లున్న కుటుంబాలు, సామాజిక వర్గాలతో మమేకం కావడం బీజేపీకి ఉపకరిస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి, మునుగోడు స్టీరింగ్ కమిటీ చైర్మన్ డా.జి.వివేక్ వెంకటస్వామి, సభ్యులు ఈటల రాజేందర్, ఏపీ జితేందర్‌రెడ్డి, డా.గంగిడి మనోహర్‌రెడ్డి తదితరులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
నేడు మేనిఫెస్టో విడుదల
బుధవారం మునుగోడు ప్రజలకు బీజేపీ అభ్యర్థి ఎన్నికల హామీపత్రాన్ని విడుదల చేయనున్నారు. కేవలం ఈ నియోజకవకర్గం వరకే పరిమితమై, తాను గెలిస్తే చేయ బోయే కార్యక్రమాల గురించి ఇందులో వివరించనున్నారు. గతంలో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో కూడా బీజేపీ అభ్యర్థులు ఇలాంటి మినీ మేనిఫెస్టోలను ప్రకటించిన విషయం తెలిసిందే.
రంగంలోకి జిల్లాల అధ్యక్షులు..
బుధవారం నుంచి అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఒక్కో జిల్లా నుంచి 200 మంది దాకా అనుచరగణం ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నెల 31న చండూరులో నిర్వహిస్తున్న పార్టీ బహిరంగ సభలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొంటారు. ఈ నెల 30న టీఆర్‌ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటున్నందున దానికి దీటుగా నడ్డా సభ విజయవంతానికి రాష్ట్రపార్టీ పకడ్బందీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇక నవంబర్ 1న ప్రచార గడువు ముగియనున్నందున, ఆరోజు రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలంతా మునుగోడు వ్యాప్తంగా రోడ్డుషోలు నిర్వహిస్తారు.
సమన్వయకర్తల నియామకం
ఎన్నికల ప్రచారం, నిర్వహణ, ఇతర అంశాల పర్యవేక్షణకు తాజాగా మళ్లీ సమన్వయకర్తలను నియమించినట్టు సమాచారం. నియోజకవర్గంలోని 7 మండలాలు, 2 మున్సిపాలిటీలకు ఒక్కొక్కరు చొప్పున 9 మందిని నియమిస్తున్నారు. మునుగోడు మండలానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మర్రిగూడకు ఏపీ జితేందర్‌రెడ్డి, చండూరు మండలానికి డీకే అరుణ, చండూరు మున్సిపాలిటీకి గరికపాటి మోహన్‌రావు, గట్టుప్పల్‌కు ఎంపీ ధర్మపురి అరవింద్, చౌటుప్పల్ అర్బన్ మండలానికి ఇంద్రసేనారెడ్డి, రూరల్ మండలానికి బూర నర్సయ్యగౌడ్, సంస్థాన్ నారాయణ్‌పూర్ మండలానికి ఎమ్మెల్యే రఘునందన్‌రావు, నాంపల్లికి ఈటల రాజేందర్‌లను సమన్వయకర్తలుగా నియమించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment